Share News

‘గాడిద గుడ్డు’ పాలనే

ABN , Publish Date - May 04 , 2024 | 05:41 AM

తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన సాగుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఇంతకుముందు కేసీఆర్‌ హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారని,. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి హామీల అమలు బదులు గాడిదగుడ్డు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్‌ ఎక్కడకు

‘గాడిద గుడ్డు’ పాలనే

తెలంగాణలో రేవంత్‌ సర్కారు చేస్తున్నది అదే..

ఎక్కడికెళ్లినా గాడిద గుడ్డుతో ప్రచారం

హామీల అమలుకు బదులు ప్రజలకు అదే ఇస్తున్నారు..

5 నెలల్లోనే కాంగ్రెస్‌ మార్కు అవినీతి

రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా?: కిషన్‌ రెడ్డి..

రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం: లక్ష్మణ్‌

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన సాగుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఇంతకుముందు కేసీఆర్‌ హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారని,. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి హామీల అమలు బదులు గాడిదగుడ్డు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్‌ ఎక్కడకు వెళ్లినా చెయ్యి గుర్తు బదులు గాడిద గుడ్డును తలపై పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్‌.. చెయ్యి గుర్తు నుంచి గాడిద గుడ్డు గుర్తుకు మారినట్లుందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే కాంగ్రెస్‌ అవినీతి మార్కును చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో కల్వకుంట్ల పాలన పోయి.. సోనియా కుటుంబ పాలన వచ్చిందని, మార్పు అంటే ఇదేనా? అని రేవంత్‌ను నిలదీశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ధ్వజమెత్తారు. ప్రజలను వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు. ఎన్నికల ప్రచారంలో వాస్తవాలకు విరుద్ధంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో రైల్వేల కోసం యూపీఏ హయాంలో ఎన్ని నిధులు ఇచ్చారో.. ప్రధాని మోదీ వచ్చాక ఎన్ని నిధులు ఇచ్చామో అనేదానిపై చర్చకు రావాలని సవాల్‌ చేశారు. రిజర్వేషన్లపై కావాలనే కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించి చీలికల ద్వారా రాజకీయ లబ్థి పొందాలని కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌ రెడ్డి కుతంత్రానికి తెర లేపారని మండిపడ్డారు. ఒక వర్గం వారి ఓట్ల కోసం బీజేపీపై బురదజల్లడం సరికాదన్నారు. దళితులు, బీసీల పట్ల కాంగ్రెస్‌ మొసలికన్నీరు కారుస్తోందని, అడుగడుగునా అంబేడ్కర్‌ను అవమానపరిచిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి డీఎన్‌ఏలో కాంగ్రెస్‌ లేదని, అందుకే ఆ పార్టీ చరిత్ర ఆయనకు తెలియదన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేసే ప్రతిపాదన ఏదీ లేదని, దీనిపై ప్రకటనలు చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు పగటి కలలు కంటున్నారని లక్ష్మణ్‌ అన్నారు. కాగా, వరంగల్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, హైదరాబాద్‌ నగరానికి చెందిన కొంతమంది ఐటీ కంపెనీల యజమానులు బీజేపీలో చేరారు.

Updated Date - May 04 , 2024 | 05:41 AM