Crop Damage: రైతన్న ఆశలపై నీళ్లు..
ABN, Publish Date - Nov 02 , 2024 | 05:45 AM
అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని నిండా ముంచింది. వరి పంటపై విరుచుకుపడి, కోతకొచ్చిన గొలుసులను నేల వాల్చింది.
అకాల వర్షంతో తడిసిన ధాన్యం
పలు జిల్లాల్లో నేలకొరిగిన వరి
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
నేడు, రేపు అక్కడక్కడా వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : అకాల వర్షం అన్నదాతను ఆగం చేసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని నిండా ముంచింది. వరి పంటపై విరుచుకుపడి, కోతకొచ్చిన గొలుసులను నేల వాల్చింది. పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో కురిసిన వాన రైతన్న ఆశలపై నీళ్లు చల్లింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మర్రివానిపల్లె, సిరిసేడు, ఇల్లందకుంట తదితర గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది. మర్రివానిపల్లెలో 65 ఎకరాల్లో వరి పూర్తిగా దెబ్బతింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్, వెల్గటూర్ మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, సిరిసిల్ల, రుద్రంగి, తంగళ్లపల్లి, మండలాల్లోని కొనుగోలు కేంద్రాలు, పొలాల వద్ద ఆరబోసిన ఽధాన్యం తడిసిపోయింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లితోపాటు పలు గ్రామాల్లో వరి పంట నేలవాలింది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పెద్ద మొత్తంలో వరి ధాన్యం తడిసింది. పలు చోట్ల వరద నీటిలో వడ్లు కొట్టుకుపోయాయి. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో సుమారు 4సెం.మీకు పైగా వర్షపాతం నమోదైంది. దీంతో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. మండలంలోని వివిధ గ్రామాల పరిధిలో వందల ఎకరాల్లో వరి నేలవాలింది. ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి తడిసి ముద్దయింది.
హైదరాబాద్‌లో జోరు వాన..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వాన దంచికొట్టింది. రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరడంతో వాహనాలు మునిగిపోయాయి. మెహిదీపట్నం, టోలీచౌకీ, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, ఇందిరానగర్, కృష్ణానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, హైదర్‌గూడ, అల్వాల్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, తారానగర్, గుల్‌మొహర్‌పార్కు, అంజయ్యనగర్, గచ్చిబౌలి, మియాపూర్, మదీనగూడ, చందానగర్, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. లింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నల్లగండ్ల హుడాకాలనీ తెల్లాపూర్ రోడ్డులో రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్-5.8 సెం.మీ, గచ్చిబౌలి-5.6, చందానగర్-4.1, లింగంపల్లి, అల్లాపూర్-3.8, హఫీజ్‌పేట్-3.1, మియాపూర్-2.7 సెం.మీ వర్షం కురిసింది.
పిడుగుపాటుతో ముగ్గురి మృతి
పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సొనప నవీన్(24) పొలంలో పశువులను మేపుతుండగా పిడుగుపాటుతో మృతిచెందాడు. భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం సర్వాయిపేటకు చెందిన జనగామ చిన్న మల్లయ్య(35) పొలం పనులకు వెళ్లి వస్తుండగా పిడుగుపడి చనిపోయాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్తమామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దమ్మనపేట గ్రామంలో పత్తి ఏరుతుండగా పిడుగు పడి గడ్డం నాగమ్మ(26) చనిపోయింది.
నేడు, రేపు అక్కడక్కడ వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని, ఆది వారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం మంచిర్యాల జిల్లా కాసిపేటలో అత్యఽధికంగా 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
Updated Date - Nov 02 , 2024 | 05:45 AM