Uttam: రాష్ట్ర ఏర్పాటులో నాది క్రియాశీల పాత్ర
ABN, Publish Date - Dec 10 , 2024 | 04:05 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో తనది క్రియాశీలక పాత్ర అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.
2010 జనవరి 5న అఖిలపక్ష భేటీకి కాంగ్రెస్ తరఫున హాజరై రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశా: ఉత్తమ్
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో తనది క్రియాశీలక పాత్ర అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. డిసెంబరు 9వ తేదీకి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందని, 2009, డిసెంబరు 9వ తేదీనే అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేశారని గుర్తు చేశారు. 2010 జనవరి 5న చిదంబరం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రతినిధిగా తాను ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలుపుతూ వందల పేజీల నివేదికలను అందజేశానన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని తెలుపుతూ వినతి పత్రాలు సమర్పించానన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తున్నామని 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రకటన చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించుకుంటున్నందున.. ఇక నుంచి అన్ని జిల్లా కార్యాలయాల్లో ఏటా డిసెంబరు 9న తెలంగాణ చరిత్రను గుర్తు చేస్తూ అధికారికంగా వేడుకలను నిర్వహిస్తామని ఉత్తమ్ చెప్పారు. సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై శాసన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Dec 10 , 2024 | 04:05 AM