Share News

వకుళాభరణం రామకృష్ణకు జస్టిస్‌ ఆవుల స్మారక పురస్కారం

ABN , Publish Date - Mar 12 , 2024 | 03:55 AM

ప్రముఖ చరిత్ర పరిశోధకుడు ఆచార్య వకుళాభరణం రామకృష్ణను ‘జస్టిస్‌ ఆవుల సాంబశివరావు స్మారక పురస్కారానికి’ ఎంపిక చేసినట్లు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

వకుళాభరణం రామకృష్ణకు జస్టిస్‌ ఆవుల స్మారక పురస్కారం

ప్రకటించిన తెలుగు వర్సిటీ - మార్చి18న అవార్డు ప్రదానం

హైదరాబాద్‌ సిటీ, మార్చి11(ఆంధ్రజ్యోతి): ప్రముఖ చరిత్ర పరిశోధకుడు ఆచార్య వకుళాభరణం రామకృష్ణను ‘జస్టిస్‌ ఆవుల సాంబశివరావు స్మారక పురస్కారానికి’ ఎంపిక చేసినట్లు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య కిషన్‌రావు తెలిపారు. ఈ అవార్డు ప్రదానోత్సవం మార్చి18, సోమవారం ఉదయం 11గంటలకు నాంపల్లిలోని యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగనుందని పేర్కొన్నారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు. విద్య, సాహిత్య, సాంస్కృతిక, చరిత్ర, పాత్రికేయ తదితర రంగాలలో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు... హేతువాద ఉద్యమ నాయకుడు, ఉమ్మడి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన దివంగత జస్టిస్‌ ఆవుల సాంబశివరావు పేరుతో పురస్కారాన్ని ప్రతి యేటా తెలుగు వర్సిటీ అందిస్తోంది. కాగా, ప్రొఫెసర్‌ వకుళాభరణం రామకృష్ణ హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో చరిత్ర బోధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక, చారిత్రక అంశాలపై పలు పుస్తకాలు రాశారు. ఆయన ప్రధాన సంపాదకత్వంలో ‘ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర చరిత్ర - సంస్కృతి’ తొమ్మిది సంపుటాలుగా వెలువడ్డాయి.

Updated Date - Mar 12 , 2024 | 03:55 AM