Share News

CM Revanth Reddy: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు

ABN , Publish Date - Mar 01 , 2025 | 03:39 AM

దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లను పెంచకుండా శిక్షించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అలా జరిగితే దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

CM Revanth Reddy: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు

  • జనాభా ప్రాతిపదికన లోక్‌సభ సీట్లు పెంచే కుట్ర

  • దీంతో ఉత్తరాది రాష్ట్రాలకే భారీగా ప్రయోజనం

  • దక్షిణాది ఓట్లతో పనిలేకుండా గెలవాలని ఎత్తుగడ

  • జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాదికే శిక్ష

  • ఇప్పటికే పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం

  • మేం రూపాయిస్తే 42 పైసలే వెనక్కి వస్తోంది

  • బిహార్‌కు రూ.7.60, యూపీకి రూ.3 ఇస్తున్నారు

  • మోదీ కుట్రను కచ్చితంగా తిప్పికొడతాం

  • ఇతర భాషలను బలవంతంగా రుద్దితే ఊరుకోం

  • విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లను పెంచకుండా శిక్షించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అలా జరిగితే దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. దక్షిణాది సీట్లు తగ్గవంటూ అమిత్‌ షా చెబుతున్నారని, పెంచబోమన్న లాజిక్‌ అందులో కనబడుతోందని వ్యాఖ్యానించారు. ఉత్తరాది బీమారు(బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, యూపీ) రాష్ట్రాలకు సీట్లు పెంచుకుని, శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ పన్నాగం పన్నిందని ఆరోపించారు. కేంద్రం సూచనలు పాటిస్తూ జనాభాను నియంత్రించినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రను తప్పకుండా తిప్పికొడతామని ప్రకటించారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్‌ పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. డీలిమిటేషన్‌లో లోక్‌సభ సీట్లు తగ్గబోవని చెబుతున్న అమిత్‌షా దామాషా పద్ధతిలో ఎన్నిసీట్లు పెంచబోతున్నారో ఎందుకు చెప్పడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. లోక్‌సభ సీట్ల పెంపులో కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రాతిపదిక ఏమిటని అడిగారు. ఇప్పుడున్న సీట్ల దామాషానా? జనాభా దామాషానా? చెప్పకుండా తగ్గవంటూ స్పష్టత లేని సమాధానం అమిత్‌షా ఎలా ఇస్తారన్నారు. నియోజకవర్గాల పునర్విభన ద్వారా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి బీమారు రాష్ట్రాల సీట్లు పెంచుకుని, దక్షిణాది రాష్ట్రాల సీట్లు, ఓట్లతో పని లేకుండా శాశ్వతంగా అధికారంలో ఉండాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.


ఇది దేశంలో తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సీట్ల దామాషా ప్రకారం 17 సీట్లకు ఇంకా 9 సీట్లు కలిసి మొత్తం 26 సీట్లు రావాలన్నారు. సీట్ల దామాషా కాదంటే 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని సీట్ల పెంపును ఖరారు చేయాలని డిమాండ్‌ చేశారు. గత యాభై ఏళ్లలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించడంతో జనాభా బాగా తగ్గిందని చెప్పారు. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు పాటించకపోవడంతో జనాభా విపరీతంగా పెరిగిందన్నారు. ప్రస్తుత జనాభాను ప్రాతిపదికగా తీసుకొని, దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా, రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దక్షిణాదిలో బీజేపీకి బలం లేనందున ఇక్కడి రాష్ట్రాలకు కేంద్రంలో న్యాయమైన వాటా ఇవ్వకూడదన్నదే ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే పన్నుల వాటాల్లో జనాభా తక్కువైన కారణంగా తెలంగాణ తీవ్రంగా నష్టపోతోందని చెప్పారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి పంపిస్తే రాష్ట్రానికి 42 పైసలు మాత్రమే తిరిగి వెనక్కి వస్తున్నాయని చెప్పారు. జనాభా, పేదరికం ఎక్కువగా ఉన్న కారణంగా బిహార్‌కు రూపాయికి 7.6 రూపాయలు, ఉత్తరప్రదేశ్‌కు రూపాయికి 3 రూపాయలు ఇస్తున్నారని ప్రస్తావించారు. భాష అనేది ఇష్టంతో నేర్చుకునేదని, బలవంతంగా ఏదైనా భాషను రుద్దాలని ప్రయత్నిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తెలంగాణలో నిర్బంధంగా తెలుగు భాషను అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జీవోలను కూడా తెలుగులో ఇవ్వబోతున్నామని ప్రకటించారు. తెలుగు భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరి మీద ఉందని చెప్పారు. ఈ ప్రాచీన భాషను కనుమరుగు చేసే ప్రయత్నాలను ఏ మాత్రం ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. యూపీఎస్సీ పరీక్షలను తెలుగులో కూడా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రాంతీయ భాషలకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. వివిధ భాషలు, సంస్కృతుల సమ్మేళనమే భారత దేశమని, ఒక భాషను ఇతరులపై రుద్ది, రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఎవరైనా చూస్తే ప్రజలు తిప్పికొడతారని అన్నారు.


పదేళ్లలో కేసీఆర్‌ కదల్లేదు

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే వరంగల్‌ ఔటర్‌ రింగు రోడ్డు, విమానాశ్రయం ముందుకు కదిలాయని రేవంత్‌ చెప్పారు. కేసీఆర్‌ తన పదేళ్ల కాలంలో ఎప్పుడూ ఈ పని చేయలేదన్నారు. ఇలాంటి వాటి కోసమే పలుమార్లు ఢిల్లీకి వెళుతున్నామని చెప్పారు. కోచ్‌ ఫ్యాక్టరీని తామే సాధించుకువచ్చామన్నారు. రాష్ట్రానికి అవసరమైన అనుమతులు, నిధుల కోసం ఎన్ని సార్లయినా ఢిల్లీకి వెళతామని రేవంత్‌ స్పష్టం చేశారు. తాము ప్రత్యేక విమానాల్లో దుబాయ్‌కు, ఇతర దేశాలకు వెళ్లలేదని, ఢిల్లీకి వెళ్లి లిక్కర్‌ దందా చేయలేదని ఎద్దేవా చేశారు.

Updated Date - Mar 01 , 2025 | 03:39 AM