Buffer Zone: నాడెం చెరువు తూము ధ్వంసం
ABN, Publish Date - Sep 01 , 2024 | 03:47 AM
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ నాడెం చెరువు తూమును శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి నీటిని కిందికి వదిలిపెట్టారు.
దిగువకు వెళ్లిపోయిన చెరువునీరు, చేపలు
‘బఫర్’లో నిర్మాణాలు లేవని చెప్పేందుకే...
అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం పనేనని ఆరోపిస్తున్న మత్స్యకారులు
పోలీసులకు ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు
ఘట్‌కేసర్ రూరల్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ నాడెం చెరువు తూమును శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి నీటిని కిందికి వదిలిపెట్టారు. తాడు సాయంతో షట్టర్‌ను జేసీబీతో లాగి ధ్వంసం చేశారు. నాడెం చెరువు బఫర్ జోన్‌లో అనురాగ్ విద్యాసంస్థలు, గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు సంబంధించిన నిర్మాణాలతో పాటు పలువురికి చెందిన హాస్టల్ భవనాలు కూడా ఉన్నాయి. హైడ్రా చర్యల నేపథ్యంలో బఫర్ జోన్ విస్తీర్ణాన్ని తగ్గించి, దానికి దూరంగా ఉన్నామని చెప్పడానికే అనురాగ్ విద్యాసంస్థల యాజమాన్యం తూమును ధ్వంసం చేసి నీటిని కిందికి విడిచిపెట్టిందని పలువురు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
నీరు అనురాగ్ విద్యాసంస్థల పక్కన ఉన్న నారాయణరావు చానెల్‌లోకి ప్రవహించింది. నీటితో పాటు చేపలు అధిక సంఖ్యలో తూము నుంచి బయటకు వెళ్లిపోయాయి. ఇరిగేషన్ ఏఈ పరమేశ్ పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తూమును ధ్వంసం చేసిన దుండగులను గుర్తించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని సీఐ తెలిపారు. కాగా, నాడెం చెరువు తూమును పీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రే్‌షయాదవ్ శనివారం పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులో నీరు పెరిగి తమ కట్టడాల వరకు రావడంతో రాత్రికి రాత్రి అనురాగ్ విద్యా సంస్థల యాజమాన్యం తూమును ధ్వంసం చేసిందని ఆరోపించారు. బఫర్, ఎఫ్‌టీఎల్ కబ్జాలపై హైడ్రా కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
జగన్ నివాసానికి నోటీసులు అవాస్తవం:రంగనాథ్
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ లోట్‌సపాండ్‌లోని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నివాసానికి హైడ్రా నోటీసులు జారీ చేసినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. తాము ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేశారు. జగన్ నివాసం బఫర్ జోన్‌లో ఉందని, దీంతో హైడ్రా నోటీసులు జారీ చేసిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో.. పలు మీడియా సంస్థల ప్రతినిధులు అక్కడికి వెళ్లి ఆరా తీశారు. ఈ నేపథ్యంలో రంగనాథ్ స్పందిస్తూ.. జీవో 99 ప్రకారం నోటీసులు జారీ చేసే అధికారం హైడ్రాకు లేదన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌లో, బఫర్‌జోన్‌లో ఉన్న న్యాయపరమైన వివాదాల్లేని నిర్మాణాలను నేరుగా కూల్చివేస్తామన్నారు.
Updated Date - Sep 01 , 2024 | 03:47 AM