Hanumakonda: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి
ABN, Publish Date - Oct 31 , 2024 | 04:45 AM
కన్నతండ్రి రాసిచ్చిన భూమిని తీసుకొని అనుభవిస్తున్నాడు. కానీ, వృద్ధుడైన తండ్రిని మాత్రం పట్టించుకోవడం లేదు. బాగోగులు చూసుకోవడం సంగతి దేవుడెరుగు.. తండ్రిపై చేయి కూడా చేసుకున్నాడా కొడుకు.
బాగోగులు చూడకపోవడంతో భూమి పట్టా రద్దు చేయాలని కోరిన వృద్ధ తండ్రి
సీనియర్ సిటిజన్ యాక్టు అమలు చేసి, పట్టా రద్దు చేసిన రెవెన్యూ అధికారులు
తిరిగి తండ్రి పేరిట పట్టా చేసిన వైనం
హనుమకొండ జిల్లా ముస్తఫాపూర్‌లో ఘటన
భీమదేవరపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కన్నతండ్రి రాసిచ్చిన భూమిని తీసుకొని అనుభవిస్తున్నాడు. వృద్ధుడైన తండ్రిని మాత్రం పట్టించుకోవడం లేదు. బాగోగులు చూసుకోవడం సంగతి దేవుడెరుగు.. తండ్రిపై చేయి కూడా చేసుకున్నాడా కొడుకు. పొట్టకూటి కోసం 75 ఏళ్ల వయసులో ఓ రైస్‌మిల్లులో గుమస్తాగా పనిచేస్తున్న ఆ తండ్రి.. తన కుమారుడికి ఇచ్చిన భూమి పట్టాను రద్దు చేయాలని రెవెన్యూ అధికారులను ఆశ్రయించాడు. స్పందించిన అధికారులు.. ఆ ప్రబుద్ధుడికి రాసిచ్చిన వ్యవసాయ భూమి పట్టాను రద్దు చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్‌ను అమలు చేసి.. ఆ భూమిని తిరిగి తండ్రి పేరుపైనే పట్టా చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఒక్కగానొక్క కొడుకు
గ్రామానికి చెందిన మద్దెల రాజకొంరయ్య, మల్లమ్మ దంపతులకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆరేళ్ల క్రితం మల్లమ్మ మృతి చెందింది. అనంతరం 2018లో రాజకొమురయ్య తన కుమారుడు రవికి 707/2018 గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ద్వారా 4.12 ఎకరాల భూమిని పట్టా చేశాడు. భార్య మరణించినప్పటి నుంచి రాజకొమురయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. రిజిస్ట్రేషన్ జరిగిన కొన్ని రోజుల తర్వాత రవి తన తండ్రి బాగోగులను చూడడం మానేశాడు. ఈ విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగినా ఫలితం లేకపోయింది. పైగా ఒకటి రెండు సార్లు రవి తండ్రిని కొట్టాడు.
కుంగిపోయిన తండ్రి
మానసికంగా కుంగిపోయిన రాజకొమురయ్య, తన కుమారుడికి ఇచ్చిన భూమి పట్టాను రద్దు చేయాలని భీమదేవరపల్లి తహసీల్దార్, హనుమకొండ ఆర్డీవో, ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మళ్లీ తన కుటుంబ సభ్యులెవరైనా తనపై దాడి చేస్తారనే భయంతో ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలోని ఓ రైస్‌మిల్లులో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. హనుమకొండ ఆర్డీవో, భీమదేవరపల్లి తహసీల్దార్ వ్యవసాయ భూమిపై విచారణ చేపట్టారు. సీనియర్ సిటిజన్ యాక్టు అమలు చేసి, రవికి రిజిస్ట్రేషన్ చేసిన 4.12 ఎకరాల్లో 3.20 ఎకరాలను రద్దు చేశారు. తిరిగి ఆన్‌లైన్‌లో రాజకొంరయ్య పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు తహసీల్దారు ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
అనాథ శరణాలయానికి రాసిస్తా
నా బాగోగులు నా పిల్లలు చూసుకోకపోతే భూమిని ఏదైనా అనాథ శరణాలయానికి రాసిస్తా. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు చూసే బాధ్యత కన్న కొడుకులపై ఉంటుంది. కానీ, నా బాగోగులు చూడకుండా, నాపై దాడి చేస్తున్నారు. 75 ఏళ్ల వయసులో రైస్‌మిల్లులో గుమస్తా, నైట్ వాచ్‌మెన్‌గా పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది. నా పరిస్థితి ఏ తండ్రికీ రాకూడదు.
ఇది కూడా చదవండి
TTD Chairman: టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు..
Updated Date - Oct 31 , 2024 | 08:29 AM