Kunamneni:పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అసలు స్వరూపం తెలుస్తుంది
ABN, Publish Date - Feb 29 , 2024 | 07:10 PM
ఇండియా కూటమి పొత్తుధర్మం పాటించి, తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) కోరారు.
హనుమకొండ: ఇండియా కూటమి పొత్తుధర్మం పాటించి, తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) కోరారు. గురువారం నాడు హనుమకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ శ్వేతపత్రాల ద్వారా బీఆర్ఎస్ అసలు స్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి కేసీఆర్ సర్కార్ విఫలమైందని చెప్పారు. ఎందుకు మేడిగడ్డ బ్యారేజ్‌కు వెళ్తున్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారని... ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. మేడిగడ్డా... బొందలగడ్డా...? అని కేసీఆర్ అన్నారని.. ఏదో కేసీఆరే చెప్పాలని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పనిచేసే పరిస్థితి లేదన్నారు. రివర్స్ పంపింగ్ పేరుతో మిగిలిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. కాళేశ్వరంతో ఆదిలాబాద్ జిల్లాకు నీరులేకుండా పోయిందన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని కుంగిన పిల్లర్లు పునర్నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
హరీశ్‌కు ఆ పదవి కావాలంటా..?
సీఎం కుర్చీకావాలని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. అధికారం పోవడంతో ఆ పార్టీ నేతలకు మతి తప్పిందని ఆరోపించారు. తనకు సీఎం పదవి ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్‌రావు అంటున్నారు, ఇది చిన్నపిల్లలాటా..? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంతో పరిహాసాలా...? అని నిలదీశారు. రాజ్యాంగబద్దమైన కాగ్‌ను బీఆర్ఎస్ నేతలు తిట్టడం అవివేకమన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో హుందాతనం అవసరమని చెప్పారు. బీఆర్ఎస్ సెంటిమెంట్ పునాదిపై నిలబడిందని చెప్పారు. తర్వాత అది డబ్బమయం అయిందన్నారు. ఇప్పుడు పేకమేడలా ఆ పార్టీ కూలిపోతోందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అసలు స్వరూపం తేలిపోతోందని వివరించారు. శ్రీరాముడును బీజేపీ బంధించిందని.. దేవుడి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బీజేపీ త్వరలోనే పేకమేడలా కూలిపోతుందని అన్నారు. సెంటిమెంట్, భావోద్వేగాలపై ఏర్పడిన పార్టీలు ఎప్పటికైనా కూలిపోతాయని కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...
Updated Date - Feb 29 , 2024 | 07:15 PM