Aghori: గృహ నిర్బంధంలో అఘోరీ
ABN, Publish Date - Nov 02 , 2024 | 05:16 AM
సనాతన ధర్మం కోసం సికింద్రాబాదు ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణం చేస్తానని ప్రకటించిన మహిళా అఘోరీని పోలీసులు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లిలోని ఆమె స్వగృహంలో నిర్బంధించారు.
ఆత్మార్పణ ప్రకటనతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
మంచిర్యాల జిల్లా కుశ్నపల్లికి తరలింపు
తల్లిదండ్రులకు అప్పగింత..
నెన్నెల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మం కోసం సికింద్రాబాదు ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆత్మార్పణం చేస్తానని ప్రకటించిన మహిళా అఘోరీని పోలీసులు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లిలోని ఆమె స్వగృహంలో నిర్బంధించారు. నెల రోజులుగా అఘోరీ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. ముత్యాలమ్మ ఆలయంపై దుండగుల దాడి అనంతరం సనాతన ధర్మం ప్రమాదంలో ఉందని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం కేదారినాథ్ పర్యటనకు వెళ్లింది. ధర్మ పరిరక్షణ కోసం దీపావళి మరుసటి రోజున ముత్యాలమ్మ గుడి వద్ద ప్రాణత్యాగం చేస్తానని అఘోరీ కేదారినాథ్ నుంచే ప్రకటించడం కలకలం రేపింది. అనంతరం అక్టోబరు 28న రాష్ట్రానికి తిరిగి వచ్చింది.
ఆత్మాహుతి ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు బుధవారం రాత్రి ఆమెను సిద్దిపేట వద్ద అదుపులోకి తీసుకొని బందోబస్తు మధ్య గ్రామానికి తీసుకొచ్చారు. తల్లిదండ్రులు చిన్నయ్య, చిన్నమ్మలకు అప్పగించారు. మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతానికి ప్రజలను, మీడియాను అనుమతించడం లేదు. ముందుగా ప్రకటించినట్టు అఘోరీ తన ఇంట్లోనే శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రాణత్యాగం చేసుకుంటుందని ప్రచారం జరిగింది. అఘోరీ కుటుంబీకులతో చర్చించిన పోలీసులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమెకు సూచించారు. పలువురు కౌన్సెలింగ్ ఇచ్చారు. అఘోరీ తల్లిదండ్రులను బెల్లంపల్లికి తరలించిన పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.
Updated Date - Nov 02 , 2024 | 05:16 AM