Rewind 2024: పవన్‌కు లక్కీ ఇయర్.. ఈ ఏడాది జనసేన విజయాల పరంపర..
ABN, Publish Date - Dec 28 , 2024 | 08:06 AM
ఈ ఏడాది రాజకీయరంగంలో జనసేనకు బాగా కలిసొచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా గుర్తింపు పొందింది. పోటీచేసిన అన్ని, శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఏడాది జనసేన ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం.
మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2024కు విడ్కోలు పలకబోతున్న వేళ.. రాజకీయరంగంలో ఈ ఏడాది జనసేన ప్రస్థానాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం.
రాజకీయ రంగం విషయానికొస్తే 2024 కొందరికి మధురస్మృతులను మిగిలిస్తే.. మరికొందరికి ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలను నేర్పింది. అహంకారంతో వ్యవహారిస్తే ఎలా ఉంటుందో ప్రజలు నాయకులకు రుచి చూపించారు. ఏదైనా ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో మంచిదికాదనే సందేశాన్ని ప్రజలు ఇచ్చిన సంవత్సరంగా 2024 మిగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024లో జనసేన ప్రయాణాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం.
వందశాతం స్ట్రైక్ రేట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకు, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు బాగా కలిసొచ్చిన సంవత్సరం 2024గా చెప్పుకోవచ్చు. 2014లో పార్టీని పెట్టినప్పటికీ 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి, కేవలం ఒక సీటును మాత్రమే గెల్చుకున్న పార్టీ 2024లో పోటీచేసిన 21 శాసనసభ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. ఏవిధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలో సరిగ్గా అంచనా వేయగలిగారు. అప్పటి అధికారపక్షం వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా వెనక్కి తగ్గలేదు.. ప్రతి విమర్శకు ధీటైన జవాబుఇస్తూ ముందుకుసాగారు. వారాహి యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న మాటపై చివరివరకు నిలబడుతూ.. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరడంతో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు. జనసేనకు సీట్ల కేటాయింపుపై ఎన్నో రకాల విమర్శలు వచ్చినా.. తాను పోటీచేసే అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటడమే తన ముందున్న కర్తవ్యమంటూ ముందుకెళ్లారు. చివరకు పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు.
ఎన్నికలకు ముందు.. ఎన్నికల తర్వాత
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన ఓ రాజకీయపార్టీ.. ఎన్నికల తర్వాత ఆపార్టీ ఓ శక్తిగా మారింది. పవర్ ఉంటే ఏదైనా చేయ్యెచ్చు.. జనసేన లక్ష్యం చేరుకోవాలంటే పవర్ కావాలంటూ పవన్ కళ్యాణ్ పదేపదే వ్యాఖ్యానించేవారు. సరిగ్గా 2019 ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా తాను ప్రజాసేవకుడినేనంటూ ముందుకు సాగారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడా తొందరపాటు చూపించకుండా.. నిదానంగా ముందుకెళ్తూ.. అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తున్నారు. తనకు ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తూ.. రాష్ట్రంలో తనదైన మార్క్ పాలనను ప్రజలకు చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.
సనాతన ధర్మం కోసం..
సాధారణంగా ఏదైనా రాజకీయపార్టీ మత విశ్వాసాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తమది సెక్యులర్ పార్టీ అని అన్ని మతాలను సమానంగా చూస్తామని ప్రచారం చేసుకుంటారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించుకోవల్సిన అవసరం ఉందని, తమ పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషిచేస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో పాటు తిరుపతిలో ఓ సభ ఏర్పాటుచేసి డిక్లరేషన్ ప్రకటించారు. దీంతో ఏపీలో సనాతన ధర్మ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన అవసరాన్ని ధైర్యంగా చెప్పారు. దేశ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే తాను నాయకత్వం వహిస్తాననే రీతిలో పవన్ కళ్యాణ్ తీరు కనిపిస్తోంది. దీంతో దేశ ప్రజల దృష్టిని పవన్ కళ్యాణ్ ఆకర్షించారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో..
మహారాష్ట్ర ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇండియా (మహా వికాస్ అఘాడీ), ఎన్డీయే(మహాయుతి) కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడంతో శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. రెండు కూటములు అధికారంపై ధీమా వ్యక్తం చేశాయి. చివరకు ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. ముఖ్యంగా గతంలో తెలుగు ఓటర్లు ఎక్కువుగా ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ లేదా ఆ పార్టీ మద్దతు దారులు ఎక్కువుగా గెలుపొందేవారు. ఈసారి పవన్ కళ్యాణ్ తెలుగు ఓటర్లు ఎక్కువ ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి మంచి ప్రదర్శన కనబర్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయస్థాయికి వెళ్లింది. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అంటూ జనసైనికులు నినాదాలు హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఎన్డీయే సమావేశాల్లో పవన్ కళ్యాణ్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన ఇమేజ్‌ను దేశ స్థాయిలో మరింత పెంచింది.
పవన్‌కు లక్కీ ఇయర్..
సాధారణంగా ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరికి బాగా కలిసివస్తోంది. అలా 2024 సంవత్సరం పవన్‌కు లక్కీ ఇయర్‌గా చెప్పుకోవచ్చు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలాంటి విజయాలను చూడలేదు. కానీ 2024లో తాను ఊహించదానికంటే ఎక్కువ విజయాలను అందుకున్నారు. తనతో పాటు జనసేన పార్టీకి 2014 కలిసొచ్చిందనే చెప్పుకోవాలి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here
Updated Date - Dec 28 , 2024 | 01:28 PM