Share News

Tender Scam Twist: ఆడుదాం కోట్లాటలో కొత్త కోణాలు

ABN , Publish Date - Apr 16 , 2025 | 03:39 AM

ఆడుదాం ఆంధ్రా టెండర్లలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు దర్యాప్తులో వెలుగు ఇంజినీరింగ్‌ అధికారి సన్నిహితురాలి ఖాతాల్లో కోట్లు, భూముల వివరాలు బహిర్గతమవుతున్నాయి

Tender Scam Twist: ఆడుదాం కోట్లాటలో కొత్త కోణాలు

  • ఇంజనీరింగ్‌ అధికారి సన్నిహితురాలికి 3 ఖాతాలు

  • ఆమె తల్లి పేరుతో మరో మూడు బ్యాంకు ఖాతాలు

  • మొత్తం ఆరు ఖాతాల్లో కలిపి రూ.9 కోట్లు నిల్వ

  • అనంతపురం కాంట్రాక్టర్‌ నుంచి రూ.2 కోట్లు బదిలీ

  • ఫిర్యాదుదారు పేరున వెలది కొత్తపాలెంలో 7.50 ఎకరాలు

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో లోతుగా సాగుతున్న దర్యాప్తు

(ఆంధ్రజ్యోతి-విజయవాడ)

గత వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ టెండర్లలో రూ.కోట్లు దుర్వినియోగమైనట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంలో లోతుకు వెళ్లేకొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కార్యక్రమం టెండర్ల ప్రక్రియలో కీలకంగా వ్యవహరించిన కడప జిల్లాకు చెందిన ఇంజనీరింగ్‌ అధికారి సన్నిహితురాలి పేరు మీద కోట్లాది రూపాయల విలువైన భూములతో పాటు ఆమె బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లల్లో నిల్వ ఉండటం వాస్తవమేనని తేలినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు కొట్లాటకు సంబంధించినదే అయినా దాని వెనుక మాత్రం ‘ఆడుదాం ఆంధ్రా’లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన మూలాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ‘ఆడుదాంలో కోట్లాట’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. శాప్‌లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ అధికారి కుటుంబ సభ్యులు తన ఇంటికి వచ్చి దాడి చేశారని ఆయన సన్నిహితురాలు నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతోపాటు సన్నిహితులంతా కలిసి రూ.12కోట్ల వరకు ఆమెకు బదిలీ చేశామని సదరు అధికారి పోలీసులకు వివరించారు. తొలుత దీన్ని కొట్లాట కేసుగానే పరిగణించిన పోలీసులు.. ఇప్పుడు మొత్తం తీగను లాగే పనిలో ఉన్నారు. ఒక సాధారణ మహిళకు అన్ని కోట్ల రూపాయలు ఎందుకు బదిలీ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క ఈ కేసులో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న నిఘా వర్గాలు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాయి.


అధికారిపై ఫిర్యాదు చేసిన మహిళకు మూడు బ్యాంకు ఖాతాలు, ఆమె తల్లి పేరు మీద మరో మూడు బ్యాంకు ఖాతాలున్నట్టు గుర్తించారు. మొత్తం ఈ ఆరు ఖాతాల్లో కలిపి రూ.9కోట్ల నిల్వ ఉన్నట్టు నిర్ధారించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి, ఎవరి ఖాతాల ద్వారా చేరిందన్న విషయాలను దర్యాప్తు బృందాలు కూపీ లాగుతున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ ఫిర్యాదుదారు ఖాతాకు రూ.2 కోట్లు బదిలీ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్రా’లో భారీ మొత్తంలో ఒక టెండర్‌ను ఆ కాంట్రాక్టర్‌ దక్కించుకున్నారు. అలాగే అధికారి సన్నిహితురాలి పేరు మీద చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామంలో 7.50 ఎకరాలు ఉన్నట్టు తెలిసింది. ఈ భూమి విలువ రూ.23 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ భూమిని విక్రయించిన వారికి ఆమె ఖాతాల ద్వారానే మొత్తం చెల్లింపులు జరిగాయని దర్యాప్తు బృందాలు నిర్ధారించినట్టు సమాచారం.

వాలుతున్న దళారులు

నందిగామలో నమోదైన కేసును రాజీ చేస్తామని రాజకీయ నేతలు, దళారులు ఫిర్యాదుచేసిన మహిళ చుట్టూ వాలిపోతున్నారు. నియోజకర్గంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆమెను సంప్రదిస్తున్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అధికారితో వివాదం లేకుండా రాజీ చేయడానికి, పోలీసులు మున్ముందు ఎలాంటి దర్యాప్తు చేయకుండా కేసును కోల్డ్‌ స్టోరేజీలోకి పంపే ఏర్పాట్లు చేస్తానని ఓ దళారీ ఆమె నుంచి రూ.10 లక్షలు తీసుకున్నట్టు విశ్వసయంగా తెలిసింది. విషయం తెలుసుకున్న ఓ పోలీసు అధికారి ఆ దళారీని పిలిపించి ఆమె నుంచి తీసుకున్న డబ్బు తిరిగివ్వాలని హెచ్చరించినట్టు సమాచారం.

Updated Date - Apr 16 , 2025 | 03:39 AM