Acid Rain: విశాఖలో ఆమ్ల వర్షాలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:47 AM
విశాఖ నగరంలో కురిసే వర్షాల్లో ఆమ్లత్వం (ఆసిడ్ రైన్) కనిపించడంతో నగర వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 1987 నుంచి 2021 వరకు కురిసిన వర్షాల్లో పీహెచ్ విలువ సగటున 5.5గా ఉండడం, పారిశ్రామిక కాలుష్యం, వాహనాల నుంచి ఉద్గారాలు కారణమని పరిశోధన పేర్కొంది. ఆమ్ల వర్షం భవనాలు, పంటల పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

పీహెచ్ విలువ సగటున 5.5గా నమోదు
ఐఐటీఎం అధ్యయనంలో వెల్లడి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘వర్షంలో తడిస్తే ఒళ్లంతా జిడ్డుబారింది. ఏదో తెలియని వాసన కూడా వచ్చింది. ఇది యాసిడ్ రెయిన్ అంట’.. ఇదీ విశాఖ నగర శివారు ప్రాంతవాసుల నుంచి తరచూ వినిపించే మాట. ఈ క్రమంలోనే ఏటా వేసవిలో యాసిడ్ (ఆమ్లత్వం)తో కూడిన వర్షంపడుతోందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికల్ మెట్రాలజీ (ఐఐటీఎం) తాజా అధ్యయనంలో వెల్లడించడంతో విశాఖ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాలుష్య కాసారంగా మారిన విశాఖలో 1987 నుంచి 2021 వరకూ కురిసిన వర్షంలో ఆమ్లత్వపు లక్షణాలున్నాయని తేల్చింది. విశాఖలో కురిసిన వర్షంలో ఆమ్లత్వం పీహెచ్ విలువ సగటున 5.5గా ఉన్నట్టు తెలిపింది.
కాలుష్యమే ప్రధాన కారణం
నగరంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, లక్షల కొద్దీ వాహనాల నుంచి ప్రతిరోజూ కాలుష్యం వెలువుడుతోంది. వాయు కాలుష్యం భూ ఉపరితలంపై పది నుంచి 12 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరిస్తుంది. వేసవిలో క్యుములోనింబస్ మేఘాలతో కురిసే వర్షంలో పీహెచ్ విలువ సగటున 5.5గా నమోదు కావడం ఆమ్ల స్వభావాన్ని చూపుతోంది. వేసవి కాలంలో కురిసే వర్షంలో నైట్రిక్ యాసిడ్ 18 శాతం, సోడియం క్లోరైడ్ 16 శాతం, క్లోరిన్ 17 శాతం, వర్షాకాలం వర్షంలో నైట్రిక్ యాసిడ్ 16 శాతం, సోడియం క్లోరైడ్ 19 శాతం, క్లోరిన్ 17 శాతంగా నమోదైంది. నైట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడానికి పారిశ్రామిక సంస్థలు విడిచిపెట్టే ఉద్గారాలే కారణమని తేలింది. ఏడాది పొడవునా (కురిసిన ప్రతిసారీ) వర్షం నీటిని పరీక్షిస్తే దీర్ఘకాలిక సగటు విలువల్లో ఆమ్ల స్వభావం కనిపించింది. ఇందుకు చమురు శుద్ధి, ఎరువుల కర్మాగారాలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, షిప్‌యార్డుల నుంచి వెలువడే వాయు కాలుష్యంతో పాటు కొంతవరకు సముద్రం కారణమని ఐఐటీఎం అంచనా వేసింది. ఆమ్ల వర్షం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదురవుతాయి. భూమి సారాన్ని కోల్పోతుంది. దాంతో పంటల దిగుబడి తగ్గుతుంది. మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. భవనాల జీవితకాలం కూడా తగ్గుతుంది. మనిషి జీవితంపైనా ప్రభావం చూపుతుంది. అయితే, సాధారణంగా వర్షం నీటిలో పీహెచ్ విలువ 7 (తటస్థం)గా నమోదవుతుందని, ఇది సురక్షిత నీరని అంతకంటే తక్కువ పీహెచ్ విలువ నమోదైతే దాంట్లో ఆమ్లత్వం ఉందని చెప్పవచ్చని ఏయూ రసాయన శాస్త్రం ఆచార్యుడు సిద్ధయ్య తెలిపారు. విశాఖలో ఆమ్ల వర్షాలకు పరిశ్రమలు, వాహనాలు, నగరీకరణ వంటి అంశాలు కారణమని, దీనివల్ల ఊపిరితిత్తులు, చర్మవ్యాధులు వస్తాయని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..