Share News

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి విడుదల

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:40 PM

శుక్రవారం గుంటూరులోని సీఐడీ కోర్టు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది. అది కూడా షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది.

Posani Krishna Murali: పోసాని కృష్ణమురళి విడుదల
Posani Krishna Murali

చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్న ఆయనకు గుంటూరులోని సీఐడీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు వద్దకు వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానికి స్వాగతం పలికారు. ఆ తర్వాత పోసాని తన కుటుంబసభ్యులతో కలిసి కారులో అక్కడినుంచి వెళ్లిపోయారు. కాగా, మార్చి 23వ తేదీ వరకు పోసాని రిమాండ్‌లో ఉండాల్సి ఉంది. సీఐడీ అధికారులు ఒక రోజు ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారించారు. మరోసారి తమకు విచారణ నిమిత్తం అప్పగించాలని కోర్టును కోరారు. కానీ, ఈ లూపే కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.


షరతులతో కూడిన బెయిల్

గుంటూరులోని సీఐడీ కోర్టు పోసానికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తులతోపాటు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. చార్జిషీటు దాఖలు చేసే వరకు గుంటూరు సీఐడీ రీజినల్‌ ఆఫీసులో రెండు వారాలకోసారి హాజరు కావాలని షరతు పెట్టింది. పోలీసులు పిలిచినప్పుడు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. అయితే, పోసానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదు అయి ఉన్నాయి. బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా ఆయన విడుదలపై ఉత్కంఠ నెలకొని ఉండింది. కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. ఏ జిల్లా నుంచి అయినా పోలీసులు వచ్చి పీటీ వారెంట్‌‌తో పోసానిని మరోసారి అదుపులోకి తీసుకుంటారా? అన్న అనుమానం కూడా ఉండింది. కానీ, ఆ ఉత్కంఠకు తెరపడి, పోసాని విడుదలయ్యారు.

posani.jpg


నెల రోజులుగా పోలీసుల అదుపులో..

పోసాని క‌ృష్ణమురళిపై గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చిత్ర పరిశ్రమపై అసభ్యకరమైన కామెంట్లు చేశాడంటూ ఆయనపై స్థానికులు కేసు పెట్టారు. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 26వ తేదీన ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. కోర్టులో హాజరుపరిచారు. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 22 వరకు ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: ఏప్రిల్ 2025లో బ్యాంక్ సెలవులు ఎన్ని రోజులో తెలుసా..

Nagpur Violence: అల్లర్లకు పాల్పడిన వారి నుంచే ఆస్తి నష్టం వసూలు: ఫడ్నవిస్

Minister Komatireddy: కేసీఆర్‌ రాజకీయాల నుంచి తప్పుకో.. మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

Updated Date - Mar 22 , 2025 | 05:54 PM