Amaravati: రాజధానికి జల రవాణా?

ABN, Publish Date - Mar 14 , 2025 | 04:49 AM

ఈ క్రమంలో ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) గతంలో కృష్ణా నదిలో చేపట్టిన అంతర్గత జల రవాణా-4 తాలూకు కార్యాచరణను వినియోగించుకోవాలని భావిస్తోంది.

Amaravati: రాజధానికి జల రవాణా?

నిర్మాణ పనులకు సామగ్రి తరలింపుపై ప్రభుత్వం దృష్టి.. రోడ్డు మార్గం కంటే ఖర్చు తక్కువ

  • 2017లోనే కృష్ణా నదిలో జల రవాణా మార్గం అభివృద్ధి పనులకు శ్రీకారం

  • ముక్త్యాల నుంచి హరిశ్చంద్రాపురం వరకు జీఎన్‌టీ కేసులతో అంతరాయం

  • ఇప్పుడు మళ్లీ కూటమి సర్కారు దృష్టి

  • నదీ తీరంలో 3 కార్గో, 4 టూరిజం టెర్మినల్స్‌

  • ఏర్పాటుకు ఐడబ్ల్యూఏఐ సుముఖత

(ఆంధ్రజ్యోతి-మంగళగిరి)

రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అంతర్గత జలమార్గాలను కూడా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాణ పనుల్లో వినియోగించాల్సిన సిమెంటు, ఇసుక, ఇనుము, కంకర, ఫ్లైయాష్‌ వంటి పలు ముడి సరుకులను తక్కువ ఖర్చుతో రాజధాని ప్రాంతానికి తరలించడానికి జల రవాణా చాలా అనుకూలమైందని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) గతంలో కృష్ణా నదిలో చేపట్టిన అంతర్గత జల రవాణా-4 తాలూకు కార్యాచరణను వినియోగించుకోవాలని భావిస్తోంది. రోడ్డు రవాణా ఖర్చులతో పోల్చుకుంటే జల రవాణాకు అయ్యే ఖర్చు సగంలో సగం మాత్రమే ఉంటుంది. ఉదాహరణకు... టన్ను బరువున్న సరుకును కిలోమీటరు దూరం రోడ్డు మార్గంలో రవాణా చేసేందుకు రూ.2.50 ఖర్చు అయితే, రైలు ద్వారా రూ.1.36, జల రవాణాలో రూ.1.06 మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా జల రవాణాకు ప్రాధాన్యం ఇచ్చి సాగరమాల పేరుతో దేశవ్యాప్తంగా జల రవాణా మార్గాలను అభివృద్ధి చేస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరికొద్ది రోజుల్లోనే ఊపందుకోనున్న నేపథ్యంలో నిర్మాణ సామగ్రి, ఇతరత్రా ముడి సరుకులను తేలికగా తరలించడంపై చర్చ మొదలైంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన సిమెంటు, ఇటుక, కంకర వంటి మెటీరియల్‌ అంతా ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల పరిసర ప్రాంతాల నుంచే తరలించాల్సి ఉంటుంది. ముక్త్యాల-అమరావతి మధ్య కృష్ణా నదీ మార్గాన్ని వినియోగించుకుని ముడి సరుకును జల రవాణా చేయడం.. రోడ్డు మార్గం కంటే అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారు. నదీమార్గంలో తక్కువ దూరంతో పాటు రవాణా ఖర్చు గణనీయంగా తగ్గిపోతుందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమౌతోంది. జల రవాణా కోసం కార్గో వెస్సెల్స్‌ను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.


జాతీయ జల రవాణా-4

వాస్తవానికి 2008 నవంబరులో కేంద్ర ప్రభుత్వం... ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు వర్తింపజేస్తూ జాతీయ జల రవాణా-4ను ప్రకటించింది. అప్పట్లో భద్రాచలం నుంచి రాజమండ్రి వరకు గోదావరి నదిలో 171 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ఏలూరు కాలువలో 139 కి.మీ, కాకినాడ నుంచి రాజమండ్రి వరకు కాకినాడ కాలువలో 50 కి.మీ, విజయవాడ నుంచి పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువలో 113 కి.మీ, పెదగంజాం నుంచి చెన్నై వరకు ఉత్తర బకింగ్‌హమ్‌ కాలువలో 316 కి.మీ, చెన్నై నుంచి మరక్కోణం వరకు దక్షిణ బకింగ్‌హమ్‌ కాలువలో 110 కి.మీ, నల్గొండ జిల్లా వజీరాబాద్‌ నుంచి విజయవాడ వరకు కృష్ణా నదిలో 157 కి.మీ. వంతున మొత్తం 1078 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాన్ని జాతీయ అంతర్గత జల రవాణా-4 కింద అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. 2016లో దీనిని సవరిస్తూ కృష్ణా నదిలో వజీరాబాద్‌ నుంచి కర్ణాటక రాష్ట్రం గలగలి వరకు మరో 628 కిలోమీటర్లు, భద్రాచలం నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌ వరకు గోదావరి నదిలో 1184 కి.మీ. వరకు విస్తరించడం ద్వారా జాతీయ జల రవాణా-4 ప్రతిపాదనను మొత్తం 2890 కి.మీ.కు పెంచింది.

2017లో పనులకు శ్రీకారం

జాతీయ జల రవాణా-4 ప్రాజెక్టు ఆచరణ విషయానికొస్తే... 2016లో తొలిదశ కింద ముక్త్యాల నుంచి విజయవాడ వరకు కృష్ణా నదిలో 82 కిలోమీటర్ల వరకు జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.96 కోట్లను మంజూరు చేశారు. ప్రధానంగా కార్గో ఓడలు లేదా క్రూయిజ్‌ షిఫ్‌లు ప్రయాణించేందుకు వీలుగా నదీ మార్గంలో సుమారు యాభై మీటర్ల నిడివిలో రెండేసి మీటర్ల లోతున పూడికతీత పనులను చేపట్టాలి. ఇందుకోసం మొదటగా ముక్త్యాల నుంచి గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు వరకు 29 కిలోమీటర్ల పొడవున డ్రెడ్జింగ్‌ చేసేందుకు రూ.33.85 కోట్ల వ్యయంతో, చామర్రు నుంచి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రాపురం వరకు 37 కి.మీ. పొడవున డ్రెడ్జింగ్‌ చేసేందుకు మరో రూ.35.91 కోట్ల వ్యయంతో 2016 ఏప్రిల్‌లో టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించేందుకు ఏడాదిన్నర పట్టింది. 2017 అక్టోబరు 3న ఈ పనులకు శ్రీకారం చుట్టారు. 2019 జూన్‌ నాటికి డ్రెడ్జింగ్‌ పనులు పూర్తి కావల్సివుంది. కానీ, నదీ అంతర్భాగంలో కొన్ని చోట్ల గట్టి రాయి తగలడం, కొందరు జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో కేసులు వేయడంతో పనులకు అంతరాయం కలిగింది. డ్రెడ్జింగ్‌ పనులు 70 శాతం వరకు పూర్తి చేయగలిగినా, ఆ తర్వాత ముందడుగు పడలేదు. జల రవాణాకు సంబంధించి డ్రెడ్జింగ్‌ తీసిన ప్రాంతాల్లో తరచుగా నిర్వహణ కూడా చేయాలి. ఐడబ్ల్యూఏఐ నిర్వహణను పట్టించుకోలేదు. ఇటీవల కృష్ణా నదికి 11.5 లక్షల క్యూసెక్కుల మేర భారీ వరద రావడంతో డ్రెడ్జింగ్‌ తాలూకు లీడ్స్‌ మళ్లీ ఇసుక మేటలతో నిండి ఉండవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతి నిర్మాణ పనుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాతో సమన్వయం చేసుకుని కార్గో వెస్సెల్స్‌ ముక్త్యాల-హరిశ్చంద్రాపురం మధ్య నడిచేలా నదీ జలమార్గాన్ని అభివృద్ధి చేస్తే రవాణా ఖర్చులు బాగా తగ్గుతాయి.


3 కార్గో టెర్మినల్స్‌

కృష్ణా నదిలో అంతర్గత జల రవాణా మార్గం సానుకూలమైతే మూడు కార్గో టెర్మినల్స్‌ను కూడా నదీ తీరప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ఐడబ్ల్యూఏఐ నిర్ణయించింది. వీటిని ముక్త్యాల, ఇబ్రహీంపట్నం, హరిశ్చంద్రాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ టెర్నినల్స్‌ సరుకు ఎగుమతులు, దిగుమతులకు ఉపకరిస్తాయి. టెర్మినల్స్‌ ఏర్పాటుకు ముక్త్యాల వద్ద 8.57 ఎకరాలు, ఇబ్రహీంపట్నం (ఫెర్రీ) వద్ద 3.63 ఎకరాలు, హరిశ్చంద్రాపురం వద్ద 3.80 ఎకరాలు అవసరమవుతాయని ఐడబ్ల్యూఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ భూసేకరణకు అయ్యే ఖర్చును కూడా ఐడబ్ల్యూఏఐ సంబంధిత అధికారుల వద్ద డిపాజిట్‌ చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని భూసేకరణ చేసి ఐడబ్ల్యూఏఐకి స్వాధీనం చేసింది. త్వరలోనే ఈ మూడు ప్రాంతాల్లో కార్గో టెర్మినల్స్‌ నిర్మాణ పనులను ఐడబ్ల్యూఏఐ చేపట్టబోతుంది.

టూరిజం టెర్మినల్స్‌

రాజధాని అమరావతి నిర్మాణ పనుల నేపఽథ్యంలో కృష్ణా నదిలో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేందుకు ఐడబ్ల్యూఏఐ కూడా సంసిద్ధంగానే ఉంది. పర్యాటకంగా కూడా జల రవాణాను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే సలహా ఇవ్వడంతో ఓ టూరిజం సర్క్యూట్‌ను కూడా ఇందులో చేర్చాలని ఐడబ్ల్యూఏఐ నిర్ణయించింది. విజయవాడలోని దుర్గాఘాట్‌, భవానీ ఐలాండ్‌, వేదాద్రి, అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయం వద్ద టూరిజం టెర్మినల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఐడబ్ల్యూఏఐ సంసిద్ధత వ్యక్తం చేసింది.

Updated Date - Mar 14 , 2025 | 04:49 AM