Share News

Vijayawada Fitness Industry: ఆ కండలన్నీ బిల్డప్పేనా

ABN , Publish Date - Apr 02 , 2025 | 06:03 AM

విజయవాడలో అనబాలిక్‌ డ్రగ్స్‌ ఉపయోగించి తక్కువ సమయంలో కండలు పెంచుకునే প্রবణత పెరుగుతోంది. ఆరోగ్యానికి హానికరమైన ఈ స్టెరాయిడ్లను రహస్యంగా విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించి దాడులు నిర్వహించారు

 Vijayawada Fitness Industry: ఆ కండలన్నీ బిల్డప్పేనా

  • స్టెరాయిడ్స్‌ వాడి బాడీ పెంచుతున్న యువత

  • అనబాలిక్‌ డ్రగ్స్‌ విచ్చలవిడిగా వాడకం

  • విజయవాడలో రహస్యంగా అమ్మకాలు

  • ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణుల హెచ్చరిక

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

నెలల తరబడి వ్యాయామం చేసినా పెరగని శరీర సౌష్టవం జిమ్‌లకు వెళ్లిన కొద్ది రోజులకే పెరిగిపోతోంది..! ఏళ్ల తరబడి చెమటోడ్చినా రాని సిక్స్‌ ప్యాక్‌.. నెలల వ్యవధిలోనే సాకారమవుతోంది...! దీనికి కారణం ఏమిటబ్బా అంటే అనబాలిక్‌ డ్రగ్స్‌ వాడకమే..! చెమటోడ్చి సహజసిద్ధంగా పెంచాల్సిన కండల కోసం కొందరు అనబాలిక్‌ను ఎంచుకుంటున్నారు. ఈ స్టెరాయిడ్లను రహస్యంగా ఉపయోగిస్తూ అసహజసిద్ధంగా కండలు పెంచుతూ.. తాము పెద్ద బాడీ బిల్డర్లమంటూ బిల్డప్‌ ఇస్తున్నారు. ఈ రోజుల్లో యువతకు ఫిట్‌నె్‌సపై అవగాహన పెరిగింది. డిగ్రీ చదువుతుండగానే ఎక్కువమంది జిమ్‌లకు వెళ్తున్నారు. అలాగే ప్రముఖులకు బౌన్సర్లుగా వ్యవహరించాలనుకునే వారు కూడా బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. సిక్స్‌ ప్యాక్‌ల కోసం కొందరు, బాడీ బిల్డింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు మరికొందరు.. జిమ్‌ల్లో గడుపుతున్నారు. అయితే.. గంటలకొద్దీ జిమ్‌ల్లో చెమటోడ్చి బాడీ పెంచితే ఎలాంటి సమస్యా లేదు కానీ.. కొంతమంది మాత్రం అడ్డదారులు తొక్కుతున్నారు. విజయవాడ నగరంలో కొంతమంది అనబాలిక్‌ డ్రగ్స్‌ను వినియోగించి అతనికాలంలోనే కండలు పెంచుకుంటున్నారు. నగర యువతకు కొంతమంది అనబాలిక్‌ డ్రగ్స్‌ను రహస్యంగా విక్రయిస్తున్నారని తెలిసింది. ఇటీవలే ఔషధ నియంత్రణ మండలి అధికారులు, కమిషనరేట్‌లోని ఈగల్‌ టీం పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆరోగ్యం కోసం వ్యాయామం అవసరమని వైద్యులు చెబుతుంటే... తక్కువ రోజుల్లో ఎక్కువ కండలు పెంచుకోవడానికి అనబాలిక్‌ ఉందని జిమ్‌ల్లో కోచ్‌లు చెబుతున్నట్టు గుర్తించారు.


ఆరోగ్యంపై దుష్ప్రభావం: అనిల్‌కుమార్‌

జిమ్‌లకు వెళ్లే యువత త్వరగా బాడీ పెరగడానికి, సిక్స్‌ప్యాక్‌లు రావడానికి అనబాలిక్‌ డ్రగ్స్‌ను ఉపయోగిస్తున్నారని ఔషధ నియంత్రణ మండలి సహాయ సంచాలకుడు అనిల్‌ కుమార్‌ చెప్పారు. వయస్సు మీద పడినా బాడీ మాత్రం అలాగే ఉండడానికి కొంతమంది వాటిని వాడుతున్నారన్నారు. ఈ డ్రగ్స్‌ వాడడం వల్ల ఆరోగ్యం పాడైపోతుందని, ఇతర దుష్ప్రభావాలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఈ తరహా డ్రగ్స్‌ వాడకం వల్ల 30 ఏళ్లకే బ్లడ్‌ క్యాన్సర్‌, షుగర్‌, బీపీ వంటి సమస్యలు వస్తాయన్నారు. సంసార జీవితానికి కూడా పనికిరాకుండా పోతారని చెప్పారు.

ఢిల్లీ, పంజాబ్‌ నుంచి...

జిమ్‌ల్లో వ్యాయామం చేసే వారికి విక్రయిస్తున్న అనబాలిక్‌ డ్రగ్స్‌ దాదాపు 40 రకాల వరకు ఉన్నాయి. ఈ ఔషధాలను స్టెరాయిడ్స్‌గా వ్యవహరిస్తారు. వీటిని ఎక్కువగా ఢిల్లీ, పంజాబ్‌ ప్రాంతాల్లో తయారు చేస్తున్నట్టు ఔషధ నియంత్రణ మండలి అధికారులు గుర్తించారు. కొంతమంది అడ్డదారిలో డబ్బులు సంపాదించడం కోసం అక్కడి నుంచి ఈ ఔషధాలను విజయవాడకు తీసుకొస్తున్నట్టు సమాచారం అందింది. అత్యంత పరిచయస్తుల సిఫారసులతో వచ్చిన వారికి ఈ అనబాలిక్‌ డ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు. దీనిపై ఔషధ నియంత్రణ మండలి అధికారులు పక్కాగా సమాచారం సేకరించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన దాడుల్లో టెస్టోస్టెరాన్‌, స్టాంజోలోన్‌, ఇంజక్షన్లు, ప్రొటీన్‌ పౌడర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఉత్తరాది నుంచి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నట్టు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. అక్కడి నుంచి రూ.400-500లకు కొనుగోలు చేసిన పౌడర్లు, ఇంజక్షన్లను ఇక్కడ రూ.4-5వేలకు విక్రయిస్తున్నారు. అయితే ఈ అనబాలిక్‌ డ్రగ్స్‌ను ఎలాంటి ఫార్ములా లేకుండా తయారు చేస్తున్నారని ఔషధ నియంత్రణ మండలి అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 06:03 AM