KHADRI : సమ్మోహన రూపం
ABN , Publish Date - Mar 17 , 2025 | 11:44 PM
మైమరపించే సోయగాలతో, చంకన అమృతభాండాగారంతో మోహన రూపుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు తరలిరాగా ఆలయ ప్రాంగణంతో పాటు తిరువీధులు సందడిగా మారాయి.

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
కదిరి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మైమరపించే సోయగాలతో, చంకన అమృతభాండాగారంతో మోహన రూపుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు తరలిరాగా ఆలయ ప్రాంగణంతో పాటు తిరువీధులు సందడిగా మారాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నారసింహుడు మోహినీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం యాగశాలలో నిత్యపూజ, హోమం అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. సంధ్యా సమయంలో మోహినీ అలంకారాన్ని గావించారు. బ్రహ్మోత్సవాల్లో అన్ని రోజుల్లోనూ శ్రీవారు తిరువీఽధుల్లో మాత్రమే విహరిస్తారు. అయితే మోహినీ ఉత్సవం రోజు కోరిన భక్తుడి ఇంటికి వెళ్లి దర్శనమిచ్చారు. సోమవారం రాత్రి ఆలయం నుంచి బయలుదేరిన శ్రీవారు తిరిగి ఆలయ్రపవేశం గావించేది మంగళవారం మధ్యాహ్నానికే. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాసరెడ్డి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు ప్రజా గరుడ సేవ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీలక్ష్మీనారసింహుడు మంగళవారం ప్రజా గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం నిత్యపూజ , హోమం అనంతరం గ్రామ సేవ నిర్వహిస్తారు. సంధ్యాసమయంలో శ్రీవారు గరుడ వాహనంపై తిరువీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమంటే బ్రహ్మోత్సవాల ప్రారంభంలోనే ఓమారు గరుడ సేవను నిర్వహించినా మళ్లీ ప్రజల కోరిక మేరకు గరుడ సేవను నిర్వహిస్తారు. అందుకే దీన్ని ప్రజా గరుడ సేవ అని పిలుస్తారు.