Ap Vizag Steel Plant: స్టీల్‌ప్లాంటుకు రూ.2,400 కోట్లు
ABN , Publish Date - Apr 05 , 2025 | 03:28 AM
ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,400 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది. విద్యుత్ బిల్లులు, జివిఎంసీ పన్నుల వంటివి భరించేందుకు ఈ సాయం ఉపయోగించనుంది.

ఆర్థిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు
విశాఖపట్నం, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు చేయూత అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. సుమారు రూ.2,400 కోట్ల వరకు సాయం చేయాలని యోచిస్తోంది. దీనిపై తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో చర్చించింది. ఆర్థిక సమస్యల కారణంగా స్టీల్ ప్లాంటు విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతోంది. కర్మాగారానికి సొంతగా విద్యుత్ తయారు చేసుకునేందుకు క్యాప్టివ్ పవర్ ప్లాంటు ఉంది. అయితే ఉక్కు ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరగకపోవడంతో విద్యుదుత్పత్తికి అవసరమైన వ్యర్థ వాయువులు లభించడం లేదు. దాంతో యాజమాన్యం ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్ తీసుకుంటోంది. నెలకు సగటున రూ.90 కోట్ల వరకు బిల్లు వస్తోంది. కొన్ని నెలలుగా దీనిని చెల్లించలేదు. దీనిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు ఇటీవల ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్ ద్వారా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. జీవీఎంసీకి ఆస్తి పన్ను, నీటిని ఉపయోగించుకుంటున్నందుకు విస్కోకి రూ.కోట్లల్లో చెల్లించాల్సి ఉందని, ఏడాదిన్నర వరకు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉందని వివరించారు. సంఘాల అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం మంత్రివర్గంలో చర్చించి, ఆయా బిల్లుల మొత్తం సుమారు రూ.2,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది.
దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీలో ఆ మొత్తానికి సరిపడా ఈక్విటీ వాటా తీసుకోవాలని భావిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంటులో వాటాల విక్రయానికి గతంలోనే ప్రకటన విడుదల చేశారు. అయితే ఇందులో వాటాలను కేంద్ర, ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయకూడదనే నిబంధన పెట్టారు. సెయిల్‌తో విశాఖ ఉక్కును కొనిపించినా, లేదంటే అందులో విలీనం చేసినా తమ కష్టాలు తీరతాయని ఉద్యోగ, కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి. అయితే దీనికి నిబంధనలు అంగీకరించవని, ప్రైవేటు సంస్థలు తప్పితే ఇంకెవరూ అందులో వాటాలు తీసుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీనిప్రకారం ప్రభుత్వం సాయం చేయబోయే రూ.2,400 కోట్లకు ఈక్విటీ వాటా తీసుకునే అవకాశం ఉండదని, దీనిపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకోవలసి ఉంటుందని ప్లాంటు వర్గాలు చెబుతున్నాయి. ఈక్విటీ తీసుకునే అవకాశం లేకపోతే ఆ మొత్తానికి సరిపడా ప్లాంటు భూములను ప్రభుత్వం కోరే అవకాశం ఉందని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News