Aviation Investments AP: ఏవియేషన్ హబ్‌గా ఏపీ
ABN , Publish Date - Apr 16 , 2025 | 03:45 AM
ఏపీలో ఏవియేషన్ రంగాన్ని అభివృద్ధి చేయాలని బీసీ జనార్ధనరెడ్డి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. పెట్టుబడులు పెడదామని వారు ప్రకటించారు

పౌర విమానయాన పారిశ్రామికవేత్తలతో మంత్రి బీసీ జనార్దనరెడ్డి భేటీ
ఏపీలో పెట్టుబడులకు కంపెనీల ఆసక్తి
ఎయిర్ ట్యాక్సీ మాన్యుఫ్యాక్చరింగ్‌లో 1200 కోట్లు..
ఎయిర్‌క్రాఫ్ట్ సిమ్యులేటింగ్ ట్రైనింగ్‌లో 600 కోట్ల పెట్టుబడులు
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని మౌలిక సదుపాయాలు, ఆర్ అండ్‌బీ మంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. సచివాలయంలో మంగళవారం పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా పౌర విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి చూపారు. మంత్రితో సమావేశమైన వారిలో మాగ్నమ్ వింగ్స్ సీఈవో అభిరామ్ చావా, అరిస్టాటిల్ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ కెప్టెన్ శిరీష్, ఈప్లేన్ డైరెక్టర్ కెప్టెన్ దివ్య, భారత్ ఏవియేషన్ డైరెక్టర్ జోసెఫ్ పొన్నుస్వామి తదితరులు ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ సిమ్యులేటింగ్ ట్రైనింగ్ యూనిట్ రంగంలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అరిస్టాటిల్ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ కెప్టెన్ శిరీష్ వెల్లడించారు. ఈవీటోల్స్ అండ్ ఎయిర్ టాక్సీ మాన్యుఫాక్చరింగ్ రంగంలో మొత్తం రూ. 1,200 కోట్ల పెట్టుబడులు పెడతామని ఈప్లేన్ కంపెనీ డైరెక్టర్ కెప్టెన్ దివ్య వెల్లడించారు. తొలిదశలో రూ. 270 కోట్ల మేర పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. ఏవియేషన్ రంగంలో మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్‌హాలింగ్(ఎంఆర్) సెంటర్ స్థాపిస్తామని భారత్ ఏవియేషన్ డైరెక్టర్ జోసెఫ్ పొన్నుస్వామి వెల్లడించారు.
అమరావతికి 16వ ఆర్థిక సంఘం బృందం
16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు అరవింద్ పనగారియా, సభ్యులు మంగళవారం అమరావతికి వచ్చారు. ఆ బృందానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు. విజయవాడ, తిరుపతి సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 4 రోజులపాటు ఈ బృందం పర్యటిస్తుంది. చివరి రోజు సీఎంతో, కేశవ్‌తో సమావేశమవుతుంది.