Special Ed Boost: స్పెషల్ ఎడ్యుకేషన్‌కు 2,260 పోస్టులు
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:46 AM
ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టించింది. 2025-26 నుంచి ఆటిజం కేంద్రాలను కూడా ప్రారంభించేందుకు కార్యాచరణ మొదలైంది

ఈ ఏడాది నుంచే ఆటిజం కేంద్రాలు
ఎస్జీటీ 1,136, స్కూల్ అసిస్టెంట్
1,124.. మిగులు టీచర్ల సర్దుబాటుతో పోస్టుల సృష్టి
ఈ ఏడాది నుంచే ఆటిజం కేంద్రాల ఏర్పాటు
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల చదువులపై ప్రభుత్వందృష్టి సారించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టించింది. 1,136 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 1,124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సృష్టిస్తూ పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్‌కు 1,984 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అవసరమని పాఠశాల విద్యాశాఖ అంచనా వేయగా, అందులో 860 పోస్టులు ఇప్పటికే మంజూరయ్యాయి. అయితే ఈ పోస్టుల కోసం సాధారణ టీచర్ పోస్టులను రద్దు చేసింది. సాధారణ టీచర్ పోస్టుల్లో మిగులు పోస్టులను స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులుగా సర్దుబాటు చేయడంతో, అంతే సంఖ్యలో సాధారణ టీచర్ పోస్టులు రద్దైపోయాయి. ఈ చర్యతో రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల విద్యను బలోపేతం చేసే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రాష్ర్టానికి 125 ఆటిజం కేంద్రాలను కేటాయించింది. మానసిక ఎదుగుల తక్కువగా ఉన్న పిల్లల విద్యపై ఆటిజం కేంద్రాలు దృష్టిపెడతాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచే కొన్ని ఆటిజం కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించనుంది. వాటికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కేటాయిస్తారు. అలాగే శారీరక దివ్యాంగులుగా ఉన్న విద్యార్థులకు కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు అవసరం. తాజా పోస్టుల సృష్టితో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సరిపడా స్థాయిలో టీచర్లు అందుబాటులోకి వస్తారు.