Aqua Price Reform: ఆక్వా సమస్యలపై దూకుడు
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:50 AM
ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. రొయ్యల ధరల స్థిరీకరణ, దేశీయ వినియోగం పెంపు కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు

ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏర్పాటు
కౌంట్‌ల వారీగా ధరల నిర్ణయం.. ధరల స్థిరీకరణకు కమిటీ ఏర్పాటు
దేశీయంగా వినియోగం పెంచేలా ప్రచారం
డిప్యూటీ స్పీకర్ రఘురామ అధ్యక్షతన ఆక్వా భాగస్వామ్య పక్షాల భేటీ
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): ఆక్వా రంగ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళుతోంది. ఇందుకోసం ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ(ఏపీపీపీసీ)ని ఏర్పాటు చేసింది. విజయవాడలోని మత్స్యశాఖ కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అధ్యక్షతన మంగళవారం ఆక్వా రంగ భాగస్వాముల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. నెక్ ఉపాధ్యక్షుడు సురేష్ రాయుడు చిట్టూరి, ఏపీ ఆక్వా డెవల్‌పమెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ష్రింప్ ఫీడ్ మ్యానుఫ్రాక్చరర్స్ అసోసియేషన్ అఽధ్యక్షుడు బీద మస్తాన్‌రావు, మత్స్యశాఖ కమిషనర్ రామ్‌శంకర్‌నాయక్, ఆక్వా రైతుప్రతినిధులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. జాతీయ రొయ్యల సమన్వయ కమిటీ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించారు. ఎన్‌పీసీసీకి బదులు ఏపీపీపీసీ ఏర్పాటు చేయాలని భాగస్వాములు ప్రతిపాదించారు. ఏపీపీపీసీ విధివిధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం తరహాలో ఏపీ ప్రాన్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సాధించే అంశంపై చర్చించారు.
ప్రముఖులు, సినీ నటుల వంటి సెలబ్రిటీలతో ప్రచారం నిర్వహించి, దేశీయంగా రొయ్యల వినియోగాన్ని పెంచడం, రొయ్యల్లోని పోషకాహార విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడం, చికెన్ షాపుల ద్వారా 100, 250, 500 గ్రాముల రొయ్యలను వంటకానికి, తినడానికి వీలుగా ప్యాకెట్లలో అమ్మాలన్న సూచనలు చేశారు. ఆక్వా రైతుల అవసరాలు, ఎగుమతులు, దేశీయ వినియోగం, కౌంట్‌ల వారీగా రొయ్యల ధర స్థిరత్వం, ఇన్‌పుట్స్ ఖర్చు నియంత్రణ, తక్కువ ధరకు ఉత్పత్తిచేసే పద్ధతులపై చర్చించారు. రాష్ట్రంతోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆక్వా ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యూహాలను మెరుగుపర్చడం ద్వారా జాతీయ రొయ్యల సమన్వయ కమిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, రాష్ట్రస్థాయిలో క్లస్టర్, డివిజనల్, జోన్ల వారీగా ఏపీపీపీసీని ఏర్పాటు చేయాలని, అంతర రాష్ట్ర ఎగుమతులు పెంచాలని నిర్ణయించారు. రొయ్యల ఎగుమతిదారులు గత వారం నుంచి కొనుగోలు ధరల విషయాన్ని వాయిదా వేస్తున్న నేపథ్యంలో.. చర్చల ద్వారా 100కౌంట్ రొయ్యలు రూ.230, 90కౌంట్ రూ.240, 80 కౌంట్ రూ.260, 70కౌంట్ రూ.280, 60 కౌంట్ రూ.305, 50కౌంట్ రూ.325, 40 కౌంట్ రూ.345 చొప్పున రానున్న 10రోజుల వరకు కొనుగోలు చేయడానికి ఎగుమతిదారులు అంగీకారం తెలిపారు. ఈ ధరలపై మళ్లీ ఈ నెల 25న నిర్ణయం తీసుకునేందుకు రైతులు, ఎగుమతిదారులు, అధికారులతో కూడిన ధరల స్థిరీకరణ కమిటీని ఏర్పాటు చేశారు.