Gulf custody battle: ఆ దంపతుల కొడుకు నా బిడ్డే
ABN , Publish Date - Apr 08 , 2025 | 04:56 AM
గల్ఫ్‌లో ఉంటున్న ఏపీకి చెందిన హిందూ దంపతులకు చెందిన ఐదేళ్ల బాబుపై ఓ పాకిస్థానీ యువకుడు తానే తండ్రినంటూ వాదిస్తూ, కోర్టు నుండి చిన్నారిని పొందాడు. కానీ, ఆ తల్లి మాత్రం బిడ్డను ఇవ్వనని, న్యాయస్థానంలో అప్పీల్ చేసింది.

యూఏఈలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హిందూ దంపతులతో పాక్ యువకుడి పేచీ
తనను ఆమె పెళ్లాడిందని, బాబును ఇస్లాం పద్ధతిలో పెంచుకుంటానని న్యాయస్థానంలో వాదన
చిన్నారి తండ్రి ఆ పాకిస్థానీయేనని తేల్చిన డీఎన్‌ఏ టెస్టు
అతడికే బిడ్డను అప్పగించాలని న్యాయస్థానం తీర్పు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
గల్ఫ్‌లో స్థిరపడ్డ ఏపీకి చెందిన ఓ హిందూ దంపతులకు ఇద్దరు కూతుళ్ల తర్వాత ఓ బాబు కలిగాడు. అతడి వయసు ప్రస్తుతం ఐదేళ్లు. ఉన్నట్టుండి ఓ పాకిస్థాన్ యువకుడొచ్చి ఆ బాబు తన బిడ్డేనని.. తనకే దక్కాలని ఆ దంపతులతో వాదించాడు. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డను ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెంచుకుంటానని.. తనకు అప్పగించాలని గొడవకు దిగాడు. డీఎన్‌ఏ టెస్టులోనూ ఆ బిడ్డకు తండ్రి ఆ పాకిస్థానీయేనని తేలడం విశేషం. అయి తే ఆ కన్నతల్లి మాత్రం బిడ్డను ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. తాను హిందువునని.. తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ.. జన్మతః హిందువే అవుతాడని.. అందుకే బాబు తనకే దక్కాలని ఆ తల్లి వాదిస్తోంది. ఆమెకు భర్త కూడా మద్దతునిచ్చాడు. బిడ్డ తమ ప్రాణం అని.. ఇచ్చేది లేదంటూ ఆమెకు దన్నుగా నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దంపతులు, వారి ఇద్దరు పిల్లలు యూఏఈలో చాలాకాలంగా ఉంటున్నారు. షార్జాలో ఈ దంపతులకు పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆ మహిళకు మూడో సంతానంగా బాబు పుట్డాడు. అయితే ఐదేళ్ల తర్వాత గత డిసెంబరులో ఆ బాబుకు తానే తండ్రినంటూ సదరు పాకిస్థాన్ యువకుడు వాదించాడు. అతడి ఈ వాదనపై ఆ దంపతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పాకిస్థానీ విజ్ఞప్తి మేరకు యూఏఈ అధికారులు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. అందులో బాబుకు తండ్రి.. పాకిస్థానీయే తేలింది. అయితే.. ఆ మహిళతో తాను బిడ్డను కనడమే కాదు, ఆమెను తాను పెళ్లి కూడా చేసుకున్నానంటూ న్యాయస్థానం దృష్టికి తెచ్చాడు. ఇన్నాళ్లు.. తన కొడుకును ఆమె హిందూ సంప్రదాయం ప్రకారం పెంచిందని,. బిడ్డకు తండ్రిని తానే కాబట్టి తనకు అప్పగిస్తే ముస్లిం సంప్రదాయ పద్ధతిలో పెంచుకుంటానని కోర్టుకు తెలిపాడు వాదనలన్నీ విన్న న్యాయస్ధానం చిన్నారిని పాకిస్థాన్ జాతీయుడికే అప్పగించాలని తీర్పిచ్చింది.
దీనిపై ఆ తెలుగు కుటుంబం ఉన్నత న్యాయస్ధానానికి అప్పీలుకు వెళ్లింది.. చిన్నారితో సహా తల్లిదండ్రులు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. అయితే ఈ మొత్తం న్యాయ ప్రక్రియలో తమ వాదనను తెలుగు కుటుంబం సరిగ్గా వినిపించలేకపోయింది. ఇంటిపెద్ద ఉన్న ఉద్యోగం కోల్పోవడం.. ఫలితంగా ఆర్థిక సమస్యల కారణంగా న్యాయవాదులను పెట్టుకోలేకపోవడం.. చెప్పుకొంటే పరువు రోడ్డున పడుతుందనే భావనతో తమ సమస్యను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో కుమిలిపోతుండటం.. స్థానిక చట్టాలపై అవగాహన లేకపోవడంతో సరైన వాదనలను వినిపించలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలకు తల్లిగా భర్తతో కలిసి ఉంటున్న మహిలను ఆ పాకిస్థానీ ఏ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు? జీవిత భాగస్వామి ఉండగా మరోవ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు గల్ఫ్ చట్టాలూ అనుమతించవు కదా? ఒకవేళ పాకిస్థానీయుడిని పెళ్లాడాలంటే భర్తకు తొలుత ఆమెకు విడాకులివ్వాలి.. అందునా గల్ఫ్ దేశాల్లో ఓ ముస్లింను పెళ్లి చేసుకునే వారు ముస్లిమేతరులైతే ఇస్లాంను స్వీకరించాలి కదా? అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు చాలా సంక్లిష్టతతో కూడుకొని ఉన్నదని.. ఒకవేళ దంపతులు పెట్టుకున్న అప్పీలు వీగిపోయినా కూడా పాకిస్థాన్ యువకుడికి చిక్కులే ఉంటాయని అంటున్నారు. ఎందుకుంటే.. ఆ చిన్నారిని పాకిస్థాన్‌కు తీసుకెళ్లాలంటే ఆ దేశం పాస్‌పోర్టు అవసరం అని.. భారతీయ పౌరసత్వం, పాస్‌పోర్టు ఉన్న చిన్నారిని తీసుకెళ్లడం ఎలా సాధ్యం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్
Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు
Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా
Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..
Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..
Nara Lokesh: ‘సారీ గయ్స్..హెల్ప్ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్
LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..