Tirupati Stampede: టీటీడీ చైర్మన్, ఈవోలపై పవన్ కల్యాణ్ ఫైర్
ABN, Publish Date - Jan 10 , 2025 | 03:47 PM
Tirupati Stampede: ముక్కోటి ఏకాదశి జరగనున్న వేళ.. టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా బాధించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీటీడీ చైర్మన్, ఈవోలను డిమాండ్ చేశారు.
కాకినాడ, జనవరి 10: ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో టోకెన్ల జారీ వేళ.. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై పిఠాపురం వేదికగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తనను చాలా బాధించిందన్నారు. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు చైర్మన్, ఈవో కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
నామోషీ ఎందుకు..?
తాను క్షమాపణలు చెప్పిన తర్వాత.. మీరు చెప్పడానికి వచ్చిన నామోషీ ఏమిటని ఈ సందర్భంగా వారిని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారని.. మీకు వేరే దారి లేదన్నారు. బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడితే తనకు ఏడుపొచ్చిందని చెప్పారు. బాధితుల వద్దకు వెళ్లి.. వారి బాధ వింటే.. మీకు అర్థమవుతోందంటూ టీటీడీ బోర్డ్ చైర్మన్, ఈవోలతోపాటు అధికారులకు ఆయన సూచించారు. మీ తప్పులకు దేశం సంబరాలు చేసుకోవడం సైతం ఆపేసిందని గుర్తు చేశారు.
పోలీసుల తీరు బాగోలేదు..
పిఠాపురంలో పోలీస్ తీరు బాగోలేదని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దొంగతనాలు బాగా పెరిగాయంటూ ఫిర్యాదులు సైతం తనకు వచ్చాయని తెలిపారు. అలాగే పిఠాపురంలో గంజాయి వినియోగం సైతం పెరిగిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెప్పారు. వీటిని పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లి.. ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదంటూ తనకు ఫిర్యాదు దారులు చెబుతున్నారన్నారు.
ఏడిపిస్తే.. తొక్కి నార తీస్తా..
తన, మన అనే భేదం లేకుండా పని చేయాలంటూ ఈ సందర్భంగా పోలీసులకు ఆయన హితవు పలికారు. తాను మొదటి తరం రాజకీయ నాయకుడినని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈవ్ టీజింగ్ అనేది అత్యంత హేయమైన చర్య అని ఆయన స్పష్టం చేశారు. ఆడ పిల్లలను ఏడిపిస్తే తొక్కి నార తీస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇంకో సారి పిఠాపురంలో ఈవ్ టీజింగ్ చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
Also Read: బ్రాండ్ ఏపీ ముందుకెళ్తోంది
కులాలను అడ్డుపెట్టకండి..
క్రిమినల్ చర్యలకు పాల్పడి.. కులాలను అడ్డుపెట్టకండంటూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. పిఠాపురంతో ప్రారంభించిన.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. పని చేస్తేనే తనకు మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండని.. అలా కాకుంటే తనను గెలిపించ వద్దని పిఠాపురం ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
మరో 15 ఏళ్లు..
పిఠాపురం బాగుండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. లా అండ్ ఆర్డర్ బాగోకుంటే... తొక్కి నార తీస్తానంటూ పోలీసులను పవన్ హెచ్చరించారు. మరో 15 ఏళ్ల పాటు పొత్తు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని ఈ సందర్భంగా పిఠాపురం ప్రజలకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 10 , 2025 | 03:50 PM