Jagan's PA : జగన్ పీఏ పేరిట సంగీత మొబైల్స్‌కు టోకరా
ABN, Publish Date - Jan 01 , 2025 | 05:41 AM
ఏపీ మాజీ సీఎం జగన్ పీఏ పేరిట సంగీత మొబైల్స్ కంపెనీకి రూ.10.40 లక్షలు టోకరా వేశారు. ఈ వ్యవహారంపై బనశంకరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
బనశంకరి పోలీస్ స్టేషన్‌లో కేసు
బెంగళూరు, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): ఏపీ మాజీ సీఎం జగన్ పీఏ పేరిట సంగీత మొబైల్స్ కంపెనీకి రూ.10.40 లక్షలు టోకరా వేశారు. ఈ వ్యవహారంపై బనశంకరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బెంగళూరు నగరంలోని బనశంకరి రెండో స్టేజ్ సంగీత మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ కేబీ రాజేశ్ ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రెండేళ్ల క్రితం సంగీత మొబైల్స్ మేనేజర్ రాజేశ్‌కు కొత్త నంబరు నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. సీఎం జగన్ పీఏ కేఎన్ నాగేశ్వరరెడ్డిగా అవతలి వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఏపీ క్రికెటర్ రికీ భుయ్‌కి స్పాన్సర్‌షిప్ అవసరమని, కంపెనీ నుంచి సహకరించాలని కోరారు. అందుకు రూ.10.40 లక్షలు ఖర్చు అవుతుందని, బ్యాంకు ఖాతాకు జమ చేయాలని కోరారు. దీంతో 2022 మే 10, 11తేదీలలో రోజుకు రూ.5.20 లక్షలు చొప్పున మొత్తం రూ.10.40 లక్షలను నాగేశ్వరరెడ్డి ఖాతాలో రాజేశ్ జమ చేశారు. ఆ తర్వాత పలుమార్లు ఫోన్ చేసినా నాగేశ్వరరెడ్డి అందుబాటులోకి రాలేదు. అనుమానం వచ్చి విచారించగా నాగేశ్వరరెడ్డి పేరిట జగన్‌కు పీఏలు ఎవరూ లేరని తేలింది. దీంతో రాజేశ్ 2 రోజులక్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - Jan 01 , 2025 | 05:43 AM