Travel Chaos : ఊరు చేరేదెట్లా?
ABN, Publish Date - Jan 12 , 2025 | 05:16 AM
ఆంధ్రులకు అతిపెద్ద పండగైన సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎ్‌సఆర్టీసీ విఫలమైంది.
సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయని ఆర్టీసీ.. బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షణ
అధికారులపై ప్రయాణికుల ఆగ్రహం
విద్యాసంస్థల బస్సులు వాడుకోవాలన్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన ఎండీ తిరుమలరావు
ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌తో మాట్లాడి తక్షణ ఏర్పాట్లు
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): ఆంధ్రులకు అతిపెద్ద పండగైన సంక్రాంతికి సరిపడా బస్సులు ఏర్పాటు చేయడంలో ఏపీఎ్‌సఆర్టీసీ విఫలమైంది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు తగినన్ని బస్సుల్లేక బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి ఊళ్లకు ప్రయాణం కొనసాగే దారి కనబడటంలేదు. ఉన్న ఒకటి రెండు బస్సుల్లో వందలాది మందిని తరలించలేని పరిస్థితి. ప్రయాణికుల ఇబ్బందుల విషయం తెలియడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావుతో మాట్లాడారు.
ఐదేళ్ల నుంచి కొత్త బస్సులు కొనుగోలు చేయనందున సరిపడా బస్సుల్లేవని, అందుబాటులో ఉన్న వాటిలో ఎక్కువ పొరుగు రాష్ట్రాలకు పంపామని చెప్పారు. ప్రతి రోజూ వందలాది ప్రత్యేక బస్సులు ఇతర ప్రాంతాలకు తిప్పుతున్నందున మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలకు బస్సుల కొరత ఏర్పడిందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి కదా అంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలకు సెలవులు ఉన్నందున తక్షణమే విద్యాసంస్థల బస్సుల్లో ఫిట్నెస్ ఉన్నవాటిని వినియోగించుకుని ప్రయాణికుల్ని గమ్యానికి చేర్చాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మేల్కొన్న ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులు సమకూర్చాలంటూ రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాను కోరారు. ఆగమేఘాల మీద మోటారు వాహన ఇన్‌స్పెక్టర్లను రంగంలోకి దించి ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల్లో ప్రయాణికుల్ని జిల్లా కేంద్రాల నుంచి గమ్యస్థానాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు పలుచోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందంటూ మండిపడ్డారు.
సీఎం ఆదేశించేదాకా..
సంక్రాంతి ప్రయాణికుల కోసం 7,200 బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ ఘనంగా ప్రకటించింది. ఈ ప్రకటన చూసి తగినన్ని బస్సులు ఉంటాయిలే అనుకున్న ప్రయాణికులకు నిరాశే మిగిలింది. తగినన్ని బస్సులు ఎందుకు లేవు అని ఆరా తీస్తే ఇక్కడి బస్సుల్ని స్పెషల్ సర్వీసులు కింద పొరుగు రాష్ట్రాలకు పంపినట్లు డిపో మేనేజర్లు చెప్పారు. ఈ సమస్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లింది. ఆయన స్పందించే వరకు కూడా ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఆర్టీసీ ఎండీతో సహా దాదాపు అందరూ ఇన్‌చార్జిలే ఉండటం, ఉన్నతస్థాయిలో సమన్వయ లోపం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆర్టీసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశించే దాకా మా అధికారుల్లో చలనం లేదు అని సిబ్బందే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ వద్ద ఖాళీగా ఉన్న ఆరు వోల్వో ఏసీ, నాలుగు సూపర్ లగ్జరీ బస్సులను అద్దె ప్రాతిపదికపైన వినియోగించుకోవాలని గత 20 రోజులుగా పర్యాటకశాఖ కోరుతున్నా ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కండీషన్ బస్సులు తీసుకోండి: ఆర్టీసీ ఎండీ
బస్టాండ్లలో వేచి ఉన్న ప్రయాణికుల్ని గమ్య స్థానాలకు చేర్చేందుకు ఫిట్నె్‌సతో పాటు మంచి కండీషన్ ఉన్న బస్సులు మాత్రమే అవసరం మేరకు వినియోగించాలని ఎండీ తిరుమల రావు డిపో మేనేజర్లను ఆదేశించారు. రవాణా శాఖ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న అన్ని రకాల బస్సుల్ని రోడ్డెక్కించి సిబ్బంది సహకారంతో నిరంతరం బస్సులు నడపాలని సూచించారు. మరోవైపు రోడ్లు, కూడళ్ల వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జిల్లా ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి డీజీపీ హోదాలో జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా స్థానిక పోలీసుల్ని సమాయత్తం చేయాలన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 08:21 AM