Ayyanna Patrudu: అసెంబ్లీ దేవాలయం... నేను పూజారిని
ABN, Publish Date - Apr 04 , 2025 | 05:33 AM
స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు నిర్వహించాలన్న తన లక్ష్యాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలనీ ఆయన చెప్పారు

ఎవరిపైనా వివక్ష లేదు.. అందరికీ అవకాశం కల్పిస్తా
నిబంధనల ప్రకారమే ప్రతిపక్ష హోదా: స్పీకర్ అయ్యన్న
రామభద్రపురం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ‘అసెంబ్లీ దేవాలయం లాంటిది. నేను పూజారిని మాత్రమే. నాకు ఏ సభ్యుడిపై వివక్ష లేదు. అన్ని పార్టీల సభ్యులకు అవకాశం కల్పిస్తా’ అని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం బూసాయవలస గ్రామంలో తన చిన్ననాటి స్నేహితుడు గంటా తిరుపతిరావు కుమారుడు వివాహానికి ఆయన గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ విలేకరులతో మాట్లాడారు. ‘ప్రతిఏటా అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు నిర్వహించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. నేను స్పీకర్‌గా ఎన్నికైనప్పటి నుంచీ సభ్యులందరికీ అవకాశం కల్పిస్తున్నా. జీరో అవర్‌లో కొత్త సభ్యులను మాట్లాడడాన్ని ప్రోత్సహిస్తున్నా. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ప్రజలు కుటుంబంతో కలిసి చూస్తున్నారు. గత వైసీపీ పాలనలో అయిదేళ్లలో 63 రోజులు మాత్రమే అసెంబ్లీ జరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు దొంగచాటుగా వచ్చి రికార్డుల్లో సంతకాలు పెట్టి వెళ్లిపోవడం దురదృష్టకరం. ప్రతిపక్ష హోదా అనేది నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. దానికి ఎవరూ అతీతులు కాదు.
పోలవరంతో ఉత్తరాంధ్రకు ఎంతో ఉపయోగం. అమరావతి రాజధాని పూర్తయితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. విశాఖను ఆర్థిక రాజధాని చేయడమే మా లక్ష్యం. సీఎం చంద్రబాబుతో చర్చించి విశాఖను మరింత అభివృద్ధి చేసేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. కేంద్రం కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం ఏపీ ప్రజల అదృష్టం’ అని అయ్యన్న అన్నారు. సమావేశంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, బుడా చైర్మన్ తెంటు లక్ష్ముంనాయుడు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 04 , 2025 | 05:33 AM