Share News

అధునాతన విమానాశ్రయంగా భోగాపురం

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:26 AM

భోగాపురం విమానాశ్రయం 2026 జూన్‌ నాటికి పూర్తవుతుంది. ఆ గడువు లోకి తాజ్‌ హోటల్‌ కూడా అందుబాటులోకి రానున్నది

అధునాతన విమానాశ్రయంగా భోగాపురం

2026, జూన్‌ నాటికి ఎయిర్‌పోర్టు పూర్తి

అప్పటికి అందుబాటులోకి తాజ్‌ హోటల్‌: రామ్మోహన్‌నాయుడు

విజయనగరం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టును అత్యంత అధునాతనంగా నిర్మిస్తాం. ఈ విమానాశ్రయం నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలే మారుతాయి’ అని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలసి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడారు. ‘గత ప్రభుత్వం ఎయిర్‌ పోర్టు పనులను గాలికి వదిలేసింది. ప్రస్తుత ప్రభుత్వం పనులు వేగవంతం చేయటంతో అనుకున్న సమయం కన్నా ముందే వచ్చే ఏడాది జూన్‌ నాటికి నిర్మాణం పూర్తిచేసి ప్రారంభిస్తాం. నవంబరులో సుమారు 49 శాతంగా ఉన్న పనులు నేడు 71% వరకు పూర్తయ్యాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 3.8 కిలోమీటర్ల రనేవే నిర్మిస్తున్నాం. ఎయిర్‌పోర్టు ప్రారంభించే నాటికి తాజ్‌ గ్రూప్‌ హోటల్‌ ప్రారంభమయ్యేలా చూస్తాం. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకు కనెక్టివిటీ కోసం కొత్త డీపీఆర్‌ తయారు చేశాం. అనకాపల్లి, ఆనందపురం బైపాస్‌ రహదారిని భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేస్తాం. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులను ఆదుకుంటాం’ అని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశలు లభిస్తాయి. దీంతో కొంతమేర వలసలు తగ్గుతాయి’ అని అన్నారు. మార్కెఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, జిల్లా కలెక్టర్‌ అంబేడ్కర్‌, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 05:27 AM