Share News

Sri Saila Kumbhotsavam: శ్రీశైలంలో శాస్త్రోక్తంగా కుంభోత్సవం

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:56 AM

శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి కుంభోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించగా, సాయంత్రం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు లభించింది

Sri Saila Kumbhotsavam: శ్రీశైలంలో శాస్త్రోక్తంగా కుంభోత్సవం

శ్రీశైలం, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి కుంభోత్సవాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత అమ్మవారికి కుంభోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రాతఃకాల పూజల అనంతరం ...హరిహరరాయ గోపురం వద్ద గల మహిషాసురమర్దిని అమ్మవారికి పూజాదికాలు జరిపి ఆ తర్వాత గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో పాటు నిమ్మకాయలతో స్వాత్వికబలిని సమర్పించారు. పసుపు, కుంకుమను సమర్పించి అమ్మవారికి శాంతి ప్రక్రియ క్రతువును పూర్తిచేశారు. సాయంత్రం ప్రదోషకాల పూజల అనంతరం మల్లికార్జున స్వామికి అన్నాభిషేకం చేసి ఆలయాన్ని మూసివేశారు. అదేవిధంగా అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఉన్న సింహ మంటపం వద్ద అన్నాన్ని కుంభరాశిగా పోశారు. ఆ తర్వాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించారు. ఆ తర్వాత రెండో విడతగా అమ్మవారికి గుమ్మడికాయలు, కొబ్బరికాయలతో సాత్వికబలిని ఇచ్చారు. చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి పిండివంటలతో మహానివేదన ఇచ్చారు. సాయంత్రం భ్రమరాంబికాదేవి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Updated Date - Apr 16 , 2025 | 05:56 AM