Chandrababu Naidu: అన్నీ జయాలే!
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:47 AM
మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. ప్రజలు అండగా ఉండాలి.
సుపరిపాలనతో సంక్షేమం.. అభివృద్ధి
సూపర్ సిక్స్ అమలు చేస్తాం.. 20 లక్షల
ఉద్యోగాలు మా బాధ్యత.. విశాఖ సభలో సీఎం
మంచి ప్రభుత్వాన్ని నిరంతరం కొనసాగించాలి
విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేం
మోదీ, నేను, పవన్ కలయిక సూపర్ హిట్
ఈ కాంబినేషన్ ఇకపైనా కొనసాగుతుంది
ఒకే రోజు 2 లక్షల కోట్లకు పైబడిన ప్రాజెక్టులు
రాష్ట్ర ప్రజల తరఫున ప్రధానికి ధన్యవాదాలు
మోదీ మద్దతుతో అమరావతి పూర్తిచేస్తాం
రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి: చంద్రబాబు
విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): ‘‘మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. ప్రజలు అండగా ఉండాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలను చేరుకోలేం. ప్రజల నిరంతర మద్దతుతో ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలమో మోదీ నిరూపించారు. ఎన్డీయే బలంగా ఉంటే భారత్ బలంగా ఉంటుంది. కూటమి బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం విశాఖపట్నం వేదికగా... ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగి న భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు రూపుమాపే దిశగా ఇది మొదటి అడు గు. మంచి అడుగు. ఇక అన్నీ జయాలే’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘డబుల్ ఇంజిన్ సర్కార్.. డబుల్ డిజిట్ గ్రోత్’ సాకారమవుతుందన్నారు. కష్టాలు, సమస్యలు అధిగమిస్తామని.. సుపరిపాలనతో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళతామని చంద్రబాబు ప్రకటించారు. ‘సూపర్ సిక్స్’ హామీలు కచ్చితంగా అమలు చేసే బాధ్యత ఎన్డీయే తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయని.. కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ పెంచుకుంటున్నామని చెప్పారు. దేశానికి ముంబైలాగా.. రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంటుందని తెలిపారు.
చరిత్రలో నిలిచిపోయేలా...
ప్రధాని మోదీ మీద ప్రతిచోటా విశ్వాసం, నమ్మకం ఉన్నాయని.. విశాఖ రోడ్‌షో బ్రహ్మాండంగా జరగడం దీనికి నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ఇది రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. రూ.2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభమయ్యాయి. జోన్ కార్యాలయానికి స్థలం ఇవ్వాలని కేంద్రం అడిగినా ఐదేళ్లు ఇవ్వలేదు. మేం వచ్చాక 52 ఎకరాలు ఇచ్చాం. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత తొలిసారిగా మోదీ రాష్ట్రానికి వచ్చారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ కాంబినేషన్ కొనసాగుతుంది
బీజేపీ, టీడీపీ, జనసేన మైత్రి కొనసాగుతుందని చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘‘గత ఎన్నికల్లో మోదీ, పవన్, నేనూ కలిశాం. నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఎప్పుడూ లేనట్లుగా 93 శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం. ఈ కాంబినేషన్ ఎప్పటికీ కొనసాగుతుంది. మోదీ దేశ ప్రధానిగా కొనసాగుతా రు. ఏపీలో ఎన్నికల అనంతరం... హరియా ణా, మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయం సాధించింది. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీయేనే విజయం వరిస్తుంది. దీనికి కారణం మోదీ కరిష్మాయే! సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలనతో దేశాన్ని ఆయన ముందుకు తీసుకెళుతున్నారు. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగింపు, అందరికీ ఇళ్లు, సూర్యఘర్, కుసుమ్, ఫసల్ బీమా, పీఎం కిసాన్ నిధి పెంపు.. ఇలా 7 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన అభిమానం ఉత్తరాంధ్రకే పరిమితమని కొందరు అంటున్నారు. కానీ... దేశం, ప్రపంచం మెచ్చే నాయకుడు మోదీ’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
దేశ ప్రజల అదృష్టం...
ప్రధాని మోదీ విధానం.. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అని చంద్రబాబు తెలిపారు. ‘‘2014లో 11వ ఆర్థిక వ్యవస్థ లా ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. 2029కి 3వ స్థానానికి వస్తుంది. 2047 నాటికి మొదటి లేదా రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇది మోదీ వల్లే సాధ్యమవుతుంది. ఆయన ప్రగతిశీల ప్రధాని. రేపు చేసే పని, నిన్నే చేసి ఉంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఉండటం మనందరి అదృష్టం. ఆయన నాయకత్వంలో ‘ఇండియా బ్రాండ్’ బలోపేతమైంది. ఆయన ఇండియన్ లీడర్ కాదు... గ్లోబల్ లీడర్’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకు న్యాయం జరగలేదని తొలిసారి గొంతెత్తిన వ్యక్తి మోదీ అని బాబు తెలిపారు.
మనది ‘ఒకే స్కూల్’
‘‘అభివృద్ధి ఆలోచనల విషయంలో మనిద్దరి దీ ఒకే స్కూల్’ అని చంద్రబాబు మోదీతో అన్నారు. ‘‘మీరు నాకు స్ఫూర్తి. నిన్నటిదాకా అమరావతి అనిశ్చితిలో ఉంది. ఇప్పుడు పట్టా లు ఎక్కింది. మీరే అమరావతికి శంకుస్థాపన చేశారు.. మీ ఆశీర్వాదంతో అమరావతిని ప్రా రంభిస్తాం. మీరే ప్రారంభించాలి. మీరు నదు ల అనుసంధానం చేసి చూపించారు. మేమూ పోలవరం నిర్మించి నదుల అనుసంధానం సాధిస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.
ఇదీ మోదీ పని తీరు...
మోదీ పని తీరు గురించి చెప్పేందుకు చందబ్రాబు రెండు వ్యక్తిగత అనుభవాలను వివరించారు. అవి...
1) ఆర్సెలార్ మిట్టల్ రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే... కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. నేను ప్రధానిని కలిశాను. ఇనుప ఖనిజాన్ని పైప్‌లైన్ (స్లరీ) ద్వారా సరఫరా చేయాలని భావిస్తున్నారని, అందుకు సహకరించాలని కోరాను. ఆయన తక్షణం దీనికి అంగీకరించారు. ఇనుప ఖనిజాన్ని వాహనాల్లో సరఫరా చేయడం వల్ల ఖర్చు, కాలుష్యం అధికమవుతుందని... స్లరీతో ఈ సమస్య ఉండదని చెప్పారు. నా ప్రతిపాదనకు అప్పటికప్పుడు ఆమోదం తెలిపారు.
2) గూగుల్ సంస్థ విశాఖకు వస్తానని చెప్పిం ది. అయితే... ఇప్పుడున్న విధానాల మార్చి, పన్నులు పెంచితే తమకు కష్టమని వెల్లడించింది. అప్పుడు కూడా ప్రధానిని కలిశాను. పన్నులు పెంచబోమని ఆయన హామీ ఇచ్చారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి ఎన్డీయే కూటమి విధానమని చంద్రబాబు ప్రకటించారు. ‘‘కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్‌లో.. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. వికసిత్ భారత్... మోదీ కల. స్వర్ణాంధ్ర ప్రదేశ్ నా ఆలోచన. ‘స్వర్ణాంధ్ర-2047’పై నిరంతర ప్రచారం చే యాలని.. అన్ని యూనివర్సిటీల్లో అవగాహ న కల్పించాలని ప్రధాని నాకు సూచించారు. అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు’’ అని చంద్రబాబు వివరించారు.
అరకు కాఫీకి మోదీ ఫిదా...
ఐటీ, టూరిజంలాగే అరకు కాఫీని ప్రధాని మో దీ అనునిత్యం ప్రమోట్ చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. మన అరకులో పండే కాఫీ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిందంటే.. దానికి మోదీ చొరవే కారణమని అన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 04:47 AM