Share News

జస్ట్‌ పాస్‌!

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:28 AM

కుప్పం నియోజవకర్గ పరిధిలో యూనిట్‌, క్లస్టర్‌, మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల పనితీరుపై ఇటీవల రెండు, మూడ్రోజులుగా టీడీపీ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో నాయక శ్రేణి పూర్తిగా తేలిపోయింది. జస్ట్‌ పాస్‌ మార్కులు తెచ్చుకుని చంద్రబాబు ఆగ్రహానికి గురైంది. కొందరు ముఖ్య నేతలకైతే కనీసం 30-40 శాతం పర్సంటేజి కూడా రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరవాతిలో శనివారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు కుప్పం నియోజకవర్గ నేతలకు నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

జస్ట్‌ పాస్‌!
కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పీఎస్‌ మునిరత్నంతో చంద్రబాబు

- ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో కుప్పం

నాయకుల పర్సంటేజి 60లోపే

- ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్‌

- పార్టీ ప్రక్షాళన తప్పదని హెచ్చరిక

- ప్రజాభిప్రాయం మేరకే పదవులని స్పష్టం

‘వైసీపీ నుంచి వచ్చిన వారికి కాంట్రాక్టు పనులు ఎలా ఇస్తావు? పార్టీకోసం కష్టపడినవారు చాలామంది ఉన్నారు. వారు నీకు కనిపించడం లేదా?’ కుప్పం నియోజకవర్గంలో సర్వం సహాధికారాన్ని ప్రదర్శిస్తూ రాజ్యాంగ పదవిని అనుభవిస్తున్న ఓ నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిలదీత ఇది.

‘నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉంటావా? ఎప్పటికీ మారవా?’ ఇది తొలినుంచీ నియోజకవర్గ బాఽధ్యునిగా ఉన్న స్నేహితునికి వేసిన చురక.

‘నీవల్ల పార్టీకి ప్రయోజనం కనిపించడంలేదు. ఎన్నికల్లో నీ వర్గమంటూ ఉందన్నావు ఎక్కడ.. ఓట్ల శాతం ఎక్కడ పెరిగింది?’ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన నియోకవర్గ స్థాయి నేతకు సంధించిన ప్రశ్న ఇది.

కుప్పం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజవకర్గ పరిధిలో యూనిట్‌, క్లస్టర్‌, మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల పనితీరుపై ఇటీవల రెండు, మూడ్రోజులుగా టీడీపీ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో నాయక శ్రేణి పూర్తిగా తేలిపోయింది. జస్ట్‌ పాస్‌ మార్కులు తెచ్చుకుని చంద్రబాబు ఆగ్రహానికి గురైంది. కొందరు ముఖ్య నేతలకైతే కనీసం 30-40 శాతం పర్సంటేజి కూడా రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరవాతిలో శనివారం రాత్రి బాగా పొద్దుపోయే వరకు కుప్పం నియోజకవర్గ నేతలకు నిర్వహించిన ప్రత్యేక సమీక్షలో ఈ విషయం స్పష్టమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

సర్వేపై ఫలితాలపై ఆగ్రహం

కుప్పం నియోజకవర్గ పరిధిలోని నేతల పనితీరుపై బూత్‌ స్థాయినుంచి నియోజకవర్గ స్థాయి దాకా సుమారు మూడు, నాలుగు రోజులపాటు ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సర్వేను పార్టీ ప్రత్యేకంగా నిర్వహించింది. ఇందులో రాజ్యాంగ పదవిలో ఉంటూ నియోజకవర్గంలో సర్వంసహా అధికారం చెలాయిస్తున్న ముఖ్య నేతకు కేవలం 57 శాతం సానుకూలత లభించింది. అలాగే చంద్రబాబు స్నేహితుడు, సహాధ్యాయి అయిన కుప్పం నియోజకవర్గ పార్టీ బాధ్యునికి 40శాతంలోపే సానుకూలత వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు జాతీయ పార్టీనుంచి టీడీపీలో చేరిన మరో నేతకు 30-40 శాతం మాత్రమే సానుకూలత లభ్యమైంది. నియోజకవర్గ నేతలకంటే యూనిట్‌ ఇన్‌చార్జిల స్థాయిలో సానుకూల ఫలితాలు అధికంగా వచ్చాయి. దీంతో ఆయా నాయకులపై చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

రామకుప్పం ఎంపీపీపై ఎన్నికపై అసహనం

రామకుప్పం ఎంపీపీ ఎన్నిక విషయంలోనూ చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ‘మీకు చేతకాకపోతే నాకు చెప్పాలి. అలా కూడా చెప్పలేదు. మీ ఇష్టమొచ్చినట్లు చేసి పార్టీ పరువు తీశారు.’ అని అసహనం వ్యక్తం చేశారు. చివరి నిమిషం దాకా ఉత్కంఠ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురైనందుకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను నిలదీశారు.

వైసీపీ వారికి కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారు?

కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టులను ఇటీవలే పార్టీలోకి జంప్‌ అయిన వైసీపీ వారికి కట్టబెడుతున్నారని కొందరు నాయకులు.. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌పై ఫిర్యాదు చేశారు. దీనిపై చంద్రబాబు వివరణ కోరగా, కాంట్రాక్టులు పొందినవారు ఎన్నికల ముందే వైసీపీనుంచి టీడీపీలో చేరారని కంచర్ల సమర్థించుకున్నారు. పార్టీకోసం త్యాగాలు చేసిన వారిని కాదని ఇతర పార్టీలనుంచి వచ్చినవారిని ప్రోత్సహించడం మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.

అందరి జాతకాలూ నా దగ్గర ఉన్నాయి

‘మీ అందరి జాతకాలూ నా దగ్గర ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఏ పని చేసినా లేదా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడినా వెంటనే నాకు తెలిసిపోతుంది.’ అని చంద్రబాబు కుప్పం నాయకులను హెచ్చరించారు. ఇంతకుముందులా ఎవరి సిఫార్సుల ఆధారంగానో పదవులు కట్టబెట్టే పరిస్థితి ఇక ఉండదన్నారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వే ద్వారా ప్రజలు, కార్యకర్తలనుంచి నాయకుల పనితీరుపై అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఆ ప్రకారమే నామినేటెడ్‌ పోస్టులు కానీ, పార్టీ పదవులు కానీ భర్తీ చేస్తామన్నారు. పార్టీని కింది స్థాయినుంచి పైస్థాయి దాకా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కుప్పంలో పార్టీని పునర్వ్యస్థీకరిస్తామని స్పష్టం చేశారు.

మీ లోపాలు సరిచేసుకోండి

కడా పీడీ తమను కలుపుకుని పోవడం లేదని ఒకరిద్దరు నాయకులు అధినేతకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ.. ‘అధికారుల సంగతి నేను చూసుకంటాను. ముందు మీరు ప్రజల్లోకి వెళ్లండి, ప్రజా సమస్యలపై తక్షణం స్పందిస్తూ ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి కృషి చేయండి’ అని సూచించారు. ‘మనలో లోపాలు పెట్టుకుని ఇతరుల మీద నిందలు వేయడం భావ్యం కాదన్నారు. మనం అధికారంలో ఉన్నామంటే ప్రజలు, పార్టీ కార్యకర్తలవల్లే. ముందు వారిని పట్టించుకోండి. వారికోసం పనిచేయండి. పదవులు వాటికవే వెదుక్కుని వస్తాయి’ అని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ఆయన ఎవరికి పీఏ

టీడీపీ కార్యాలయంలో ఒక వ్యక్తి పీయేనంటూ అధికారం చెలాయిస్తున్నారని, ఆయన ఎవరికి పీయేనో ఎవరికీ తెలియడంలేదని ఒకరిద్దరు నాయకులు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ‘మీదగ్గర సైలెంట్‌గా ఉంటూ కుప్పంలో సైరన్‌ మోగిస్తున్నారని, కార్యకర్తలందరిమీదా జులుం చెలాయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అటువంటివేవైనా ఉంటే తాను సరిదిద్దుతానని చంద్రబాబు వారిని సమాధానపరిచారు.

నీ వర్గం ప్రభావం ఏదీ

కొంతమంది నాయకులు తమకు చాలా ఫాలోయింగ్‌ ఉన్నదని చెప్పారని, వారి మాటలకు.. చేతలకు పొంతన కనిపించలేదని చంద్రబాబు ఆక్షేపించారు. ఎన్నికల ముందు జాతీయ పార్టీనుంచి టీడీపీలో చేరిన నాయకుడిని ఉద్దేశించి మాట్లాడుతూ ‘నీ వర్గం ఉన్నదని చెప్పారు. నాకైతే కనిపించడం లేదు. ఎన్నికల్లో నీ వర్గం ఎక్కడ పనిచేసింది? ఒకవేళ పనిచేస్తే ఫలితాలు ఇలా ఎందుకు ఉంటాయి?’ అని నిలదీశారు.

Updated Date - Apr 07 , 2025 | 01:28 AM