Share News

పల్లె దారులకు మహర్దశ

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:13 AM

1,643 చోట్ల సిమెంటు రోడ్లు 33 ప్రాంతాల్లో బీటీ రోడ్లు

పల్లె దారులకు మహర్దశ
పెనుమూరు మండలం గంగుపల్లెలో నిర్మించిన సిమెంటు రోడ్డు

చిత్తూరు(గాంధీ సర్కిల్‌), ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో పడకేసిన పల్లె పాలన... కూటమి ప్రభుత్వ రాకతో అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది.సిమెంటు రోడ్లు, బీటీ రోడ్లు, మినీ గోకులాలు, తాగునీటి కొళాయిలు, ప్రహారీ గోడలు వంటి పనులతో పల్లెల్లో సందడి నెలకొంది.ఈ పది నెలల కాలంలోనే ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలోని పల్లెలకు 1,643 సిమెంటు రోడ్లు... 33 బీటీ రోడ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మిగతా వాటితో కలిపి మొత్తం రూ.107.71కోట్లు అంచనాతో 1,719 పనులు జిల్లాకు మంజూరయ్యాయి. వీటిలో గత నెలాఖరుకు 1,387పనులు పూర్తి చేశారు.124 పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం ఇప్పటి వరకు రూ.63.90కోట్లు ఖర్చు చేశారు.

వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు అభివృద్ధి పనులు లేక పల్లెలు వెలవెలబోయాయి. చేసిన అరకొర అభివృద్ధి పనులకు కూడా బిల్లులు రాక సర్పంచులు, కాంట్రాక్టర్లు లబోదిబోమన్నారు. బిల్లుల కోసం వారు రాజధానికి వెళ్లి ధర్నాలు కూడా చేశారు. వైసీపీ హయాంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు అచేతన స్థితిలో ఉండేవి.ఈ ఽశాఖలకు కూటమి ప్రభుత్వం రాకతో ప్రాధాన్యత వచ్చింది. ఈ రెండు శాఖలు గ్రామీణ ప్రాంతాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాయి.‘పల్లె పండుగ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి... తమ పల్లెల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో ప్రజల నుంచి రాత పూర్వకంగా అభిప్రాయాలు సేకరించింది. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు జిల్లాలోని 31 మండలాల్లో వివిధ రకాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.78.89కోట్ల అంచనాతో 192.58కి.మీ. పొడవునా 1,605 సిమెంటు కాంక్రీట్‌ అంతర్గత రోడ్లు మంజూరు చేశారు. ఇందులో ఇంతవరకు 1,407 పనులు గ్రౌండింగ్‌ కాగా... 1,352 పనులు పూర్తి చేశారు. ఇందుకోసం రూ.56.81 కోట్లుఖర్చు చేశారు. 149.43కి.మీ. పొడవునా సిమెంటు రోడ్డు పనులు పూర్తి చేశారు. ఇక సిమెంటు కాంక్రీట్‌ అప్రోచ్‌ రోడ్ల విషయానికి వస్తే... రూ.6.52కోట్లు అంచనాతో 14.95కి.మీ. పొడవున 38పనులు మంజూరు చేశారు. ఇందులో 38పనులు గ్రౌండింగ్‌ కాగా... ఇప్పటి వరకు 7.30కి.మీ పొడవున 26 పనులు పూర్తి చేశారు. ఇందుకోసం రూ.3.25కోట్లు ఖర్చు చేశారు. బీటీ రోడ్ల విషయానికి వస్తే... రూ.10.60కోట్ల అంచనాతో 21.41కి.మీ. పొడవున 18 పనులు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 18 పనులు గ్రౌండింగ్‌ కావడంతో పాటు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ పనులకు ఇప్పటి వరకు రూ.2.25కోట్లు ఖర్చు చేశారు. ఇక రూ.3.26కోట్ల అంచనాతో 42 ప్రహారీ గోడలు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటి వరకు 32 పనులు గ్రౌండింగ్‌ అయ్యాయి. తొమ్మిది పనులు పూర్తి చేశారు. ఇందుకోసం రూ.50.25లక్షలు ఖర్చు చేశారు. పల్లె పండుగలో భాగంగా ఉపాధి నిఽధులతో ఒక గ్రామ పంచాయతీ భవనాన్ని రూ.22లక్షలతో నిర్మిస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ పరిఽధిలో రూ.8.20కోట్ల అంచనాతో 11.52కి.మీ. పొడవున 15పనులు మంజూరు చేశారు.ఇప్పటి వరకు ఈ రోడ్లకు రూ.89.68లక్షలు ఖర్చు చేశారు. పల్లె పండుగలో మంజూరైన మిగిలిన పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ ఎస్‌ఈ చంద్రశేఖర రెడ్డి చెప్పారు.

రూ.26.51కోట్ల బిల్లుల చెల్లింపు

‘పల్లె పండుగ’లో భాగంగా రూ.107.71కోట్ల అంచనాతో 1,719 పనులు మంజూరు చేయగా.. గత నెల 31వ తేదీ వరకు 1,387 పనులు పూర్తయ్యాయి. మొత్తం రూ.63.90కోట్లకు గాను రూ.26.51కోట్ల బిల్లులు చెల్లించారు. ఇందులో సిమెంటు కాంక్రీట్‌ అంతర్గత రోడ్లకు రూ.25.22కోట్లు... సిమెంటు కాంక్రీట్‌ అప్రోచ్‌ రోడ్లకు రూ.98.10లక్షలు...బీటీ రోడ్లకు రూ.11.06లక్షలు... ప్రహారీలకు రూ.10.47లక్షలు... గ్రామ పంచాయతీ భవనానికి రూ.9.21లక్షలు చెల్లించారు. పూర్తయిన పనులకు ఇంకా రూ.38.81కోట్లు చెల్లించాల్సి ఉంది.

Updated Date - Apr 08 , 2025 | 01:13 AM