గాలివాన బీభత్సం
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:53 AM
వెదురుకుప్పం మండలంలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. గంటావారిపల్లె గ్రామ పంచాయతీ ఎగువ కన్నికాపురంలో కొన్నిచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.

వెదురుకుప్పం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): వెదురుకుప్పం మండలంలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. గంటావారిపల్లె గ్రామ పంచాయతీ ఎగువ కన్నికాపురంలో కొన్నిచోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడి చెట్ల నుంచి పిందెలు కూడా నేలరాలాయి. కార్వేటినగరం మండలంలోనూ గాలివానతో మామిడి కాయలు నేలరాలాయని రైతులు తెలిపారు.
పిడుగుపడి రెండు ఆవుల మృతి
గంగవరం, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి. గంగవరం జేఆర్ కొత్తపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యం, ఆయన కుమారుడు ఓబులప్ప వ్యవసాయంతోపాటు ఆవులను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజులాగానే సోమవారం సాయంత్రం ఇంటిముందు కానుగ చెట్టు కింద రెండు ఆవును కట్టి ఉంచారు. ఇంతలో భారీ ఈదురుగాలులతోపాటు వర్షం కురుస్తుండగా కానుగ చెట్టు వద్ద పిడుగుపడి భారీ శబ్దం వచ్చింది. కొంతసేపటికి గ్రామస్తులు చెట్టు వద్దకు వచ్చి చూసేసరికి రెండు ఆవులూ మృతి చెందాయి. ప్రభుత్వం పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.
11 మండలాల్లో వాన
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా 11 మండలాల్లో తేలికపాటి నుంచి బలమైన వర్షం కురిసింది. మండలాల వారీగా.. పూతలపట్టులో 24, యాదమరిలో 22, పెద్దపంజాణిలో 14.6, చిత్తూరులో 7.4, తవణంపల్లెలో 4.8, సోమలలో 4.2, చౌడేపల్లెలో 4.2, పులిచెర్లలో 4, గుడిపాలలో 2.6, బంగారుపాళ్యంలో 2.2, ఐరాలలో 2.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏప్రిల్ నెల సాధారణ వర్షపాతం 7 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, సోమవారం నాటికి 19.9 మి.మీ వర్షం కురిసింది. 16 మండలాల్లో 20శాతానికి మించి, మిగిలిన 15 మండలాల్లో సాధారణానికి మించి 20 శాతంలోపు వర్షపాతం నమోదయ్యింది.