Honor killing: పుట్టింటికి వెళ్లిన గంటలోనే ప్రాణాలు కోల్పోయి.. కన్నవాళ్లే చంపేశారా
ABN , Publish Date - Apr 15 , 2025 | 10:12 AM
మతాంతర వివాహం చేసుకున్న ఓ యవతి కన్నవారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇది పరువు హత్యేనని, తన భార్యను ఆమె కన్నవారే చంపేశారని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. చిత్తూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు: నగరంలో దారుణం జరిగింది. మతాంతర వివాహం (Interfaith couple) చేసుకున్న ఓ యువతి పుట్టింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి (woman dies mysteriously) చెందింది. ఆ భర్త తన భార్యను పుట్టింటి వారికి అప్పగించి.. తిరిగి వచ్చిన మరుసటి రోజే చనిపోయింది. ఇది పరువు హత్యగా (Honor killing) పోలీసులు (Police) అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు పట్టణానికి చెందిన యాస్మిన్ భాను అనే యువతి.. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టుకు చెందిన సాయితేజను ప్రేమించింది. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో గత ఫిబ్రవరిలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నెల్లూరులో ప్రేమ వివాహం చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా ఇటీవల యువతి తండ్రికి సీరియస్‌గా ఉందని కుటుంబ సభ్యులు ఆమెకు ఫోన్ చేయడంతో యాస్మిన్ కన్నవారింటికి వచ్చింది. అయితే మారుసటి రోజు యాస్మిన్ అనుమానాస్పదరీతిలో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. ప్రేమ వివాహం చేసుకొని పరువు తీసావని తండ్రి తిట్టడంతో, మనస్తాపం చెంది రాత్రి తన గదిలో ఉరి వేసుకుందని ఆమె తల్లి పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది.
Also Read..: పూజారి తన్నుల కోసం బారులు తీరిన భక్తులు
దీంతో పోలీసులు ఆ గదిలో పరిశీలించారు. ఉరి వేసుకున్న ఆనవాళ్ళు ఏమీ లేకపోవడంతో అనుమానించి యాస్మిన్ తల్లిని, సోదరిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రితో పాటు పలువురు బంధువులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ కేసును పరువు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అయితే విషయం తెలుసుకున్న భర్త.. తన భార్యను కన్నవారే చంపేసి, మార్చురీలో శవాన్ని చూపించారంటూ తీవ్రంగా విలపించాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు స్థానిక బాలాజీ నగర్‌కు చెందిన యాస్మిన్‌బాను (26) ఎంబీఏ పూర్తి చేసిందని, బీటెక్ చదివిన సాయితేజ్‌తో కాలేజీ రోజుల్లోనే ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసిందని, ఈ క్రమంలో వారిద్దరూ వివాహానికి సిద్దమయ్యారన్నారు. అయితే సాయితేజ ఎస్సీ వర్గానికి చెందిన వాడు కావడంతో ముస్లిం అయిన యాస్మిన్ తల్లిదండ్రులు షౌకత్ అలీ, ముంతాజ్ అంగీకరించలేదన్నారు. దీంతో వారు ఈ ఏడాది ఫిబ్రవరి 9న నెల్లూరులో వివాహం చేసుకున్నారు. అయితే తమ తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని అదే నెల 13న తిరుపతి డీఎస్పీని కలిసి కోరారన్నారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించినట్లు చెప్పారు.
నాన్నకు బాగోలేదని
సాయితేజ, యాస్మిన్ ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడంతో రెండు నెలలుగా వీరి సంసార జీవితం సాఫీగానే సాగుతుంది. ఈ పెళ్లి ఇష్టంలేకపోవడంతో తమ వద్దకు వచ్చేయాలని యాస్మిన్‌ను మొదట్లో కోరినా ఆమె అంగీకరించలేదు.చివరకు కుమార్తెతో ఫోన్ ద్వారా మాటలు కలిపి, తండ్రి షౌకత్‌అలీకి ఆరోగ్యం బాగోలేదని, ఓసారి వచ్చి చూసి వెళ్లాలని కోరారు. చివరకు భర్త సాయితేజ తన భార్యను చిత్తూరులోని గాంధీ విగ్రహ కూడలి వద్ద ఆమె సోదరుడి కారులో ఎక్కించి పుట్టింటికి పంపించాడు. కొద్దిసేపటి తర్వాత తన భార్యతోపాటు కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తుంటే కలవకపోవడంతో అనుమానం వచ్చి యాస్మిన్ ఇంటికి వెళ్లాడు. యాస్మిన్ ఇంట్లో లేదని, ఆత్మహత్య చేసుకోవడంతో ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని సాయితేజ ఆరోపించాడు.
తన భార్యకు ఏమైందంటూ తీవ్ర ఆందోళన చెందుతూ సాయితేజ ఆసుపత్రిలోని మార్చురీలో భార్య మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. కుల, మతాలు వేరు కావడంతో తమ పెళ్లిని యాస్మిన్ తల్లిదండ్రులు వ్యతిరేకించారని, చివరకు తన భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని సాయితేజ ఆరోపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్రీశైల మహాక్షేత్రంలో వార్షిక కుంభోత్సవం...
కమల్ హాసన్‌కు రాజ్యసభ సభ్యత్వం..
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here