Share News

అన్నమయ్య సంకీర్తనల నడుమ ‘గరిమెళ్ల’ అంతిమయాత్ర

ABN , Publish Date - Mar 12 , 2025 | 02:03 AM

అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ శిష్యులు, అభిమానులు ముందు నడుస్తుండగా.. ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ అంతిమయాత్ర సాగింది. ఇలా పాటలతో నివాళులర్పిస్తూ.. కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో ఆదివారం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ కన్నుమూయగా, మంగళవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తిరుపతి నగరం భవానినగర్‌లోని గరిమెళ్ల ఇంటికి ఉదయం నుంచీ ఆయన అభిమానులు, శిష్యులు, ప్రముఖులు చేరుకున్నారు. పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని కప్పారు.

అన్నమయ్య సంకీర్తనల నడుమ ‘గరిమెళ్ల’ అంతిమయాత్ర
గరిమెళ్ల గౌరవార్థం గాల్లోకి కాల్పులు జరుపుతున్న పోలీసులు

- పాటలతో శిష్యులు, అభిమానుల నివాళి

- ప్రభుత్వ లాంఛనాలతో బాలకృష్ణప్రసాద్‌ అంత్యక్రియలు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మార్చి 11 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ శిష్యులు, అభిమానులు ముందు నడుస్తుండగా.. ప్రముఖ సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ అంతిమయాత్ర సాగింది. ఇలా పాటలతో నివాళులర్పిస్తూ.. కన్నీటి వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో ఆదివారం గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ కన్నుమూయగా, మంగళవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తిరుపతి నగరం భవానినగర్‌లోని గరిమెళ్ల ఇంటికి ఉదయం నుంచీ ఆయన అభిమానులు, శిష్యులు, ప్రముఖులు చేరుకున్నారు. పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని కప్పారు. అనంతరం అంతిమయాత్ర మొదలై.. హరిశ్చంద్ర శ్మశాన వాటిక వరకూ సాగింది. ఈ యాత్రలో ఆయన శిష్యులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తూ ముందుకు కదిలారు. శ్మశాన వాటికలో గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ గౌరవార్థం పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనం పలికారు. ఆయన చిన్న కుమారుడు అనిల్‌కుమార్‌ చితికి నిప్పు అంటించారు. అంత్యక్రియల్లో గరిమెళ్ల బాలకృష్ణ సతీమణి రాధమ్మ, తనయుడు, కుటుంబీకులు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ పాలకమండలి సభ్యురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రమీలమ్మ, సీపీఎం నాయకుడు కందారపు మురళి, గాయని కర్రి విజయలక్ష్మి, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్‌, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గాయని కొండవీటి జ్యోతిర్మయి, గాయకుడు కారుణ్య, టీటీడీ సీపీఆర్వో డాక్టర్‌ తలారి రవి తదితరులు నివాళులర్పించారు.

గరిమెళ్ల పాడిన పాటలను మరింత ప్రాచుర్యంలోకి తెస్తాం

అన్నమయ్య పాటలంటే గరిమెళ్లకు ప్రాణం. గరిమెళ్ల గొంతులో అన్నమయ్య పాటలు జీవం పోసుకున్నాయి. ఇంత గొప్ప సంగీతాన్ని గరిమెళ్ల పాడిన పాటలను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం.

- డాక్టర్‌ కర్రి విజయలక్ష్మి, గాయని

గరిమెళ్ల విగ్రహ ఏర్పాటుకు కృషి

ప్రపంచానికి అన్నమయ్య సంకీర్తనలను అందించిన గొప్ప వ్యక్తి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌. అలాంటాయన మృతి తీరని లోటు. అనేక మంది గరిమెళ్ల అభిమానులు ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించాలనీ, తిరుపతిలో గరిమెళ్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. అన్నమయ్య కీర్తనలతో కూడిన పుస్తక ప్రసాదాన్ని భక్తులకు అందించేలా టీటీడీ కృషి చేయాలనీ పలువురు కోరారు. ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళతాం. ముఖ్యంగా తిరుపతిలో గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం.

- కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

Updated Date - Mar 12 , 2025 | 02:03 AM