CM Chandrababu : అక్టోబరు నుంచి ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:21 AM
అక్టోబరు 2 తర్వాత ఏ ఊరు వస్తున్నానో చెప్పను. రెండు, మూడు గంటలు ముందు చెప్పి నేరుగా అక్కడికే వస్తా. ఆకస్మికంగా తనిఖీ చేస్తా.’’ అని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.

చెప్పకుండానే క్షేత్రస్థాయికి వస్తా.. ఎమ్మెల్యేలు పరుగులు పెట్టాల్సిందే
అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనే లక్ష్యం.. గత పాలకులతో రాష్ట్రంలో విధ్వంసం.. వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారు
10 లక్షల కోట్ల అప్పులు మోపారు.. 85 లక్షల టన్నుల చెత్తను ఇచ్చారు.. సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం
కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ర్టాభివృద్ధి.. మే నుంచి ‘తల్లికి వందనం’ అమలు.. రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర ఉద్యమం కొనసాగాలి
తణుకులో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
పారిశుధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టి పార్కును శుభ్రం చేసిన ముఖ్యమంత్రి
ఏలూరు/తణుకు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘నేను 1995లో సీఎంగా ఉన్నప్పుడు బయటకొస్తున్నానంటే అందరూ అలర్ట్ అయిపోయేవారు. అందరూ హుషారు అయిపోయేవారు. ఇప్పుడు మాత్రం ఇంకా సమయం ఇస్తున్నా. అక్టోబరు 2 తర్వాత ఏ ఊరు వస్తున్నానో చెప్పను. రెండు, మూడు గంటలు ముందు చెప్పి నేరుగా అక్కడికే వస్తా. ఆకస్మికంగా తనిఖీ చేస్తా.’’ అని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చానని, ఎందుకు పరిశుభ్రం కాలేదో మీ ఎమ్మెల్యేని, కలెక్టరును నిలదీస్తానని అన్నారు. ‘‘మీకు సమయం ఇచ్చాను సమస్యలు పరిష్కరించండి. ఇంతకుముందు ఈ మాత్రం కూడా సమయం ఇచ్చే వాడిని కాదు. ఇప్పుడలా కాదు.. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే కాదు.. నేనేమి చూస్తానో అప్పుడే చెబుతా. ఆకస్మిక తనిఖీ చేస్తా. పాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తా.’’ అని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తా. ఒక ఆశయం కోసం మనమంతా పనిచేయాలి. దాన్ని నెరవేర్చుకోవాలి. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికను రాష్ట్ర ప్రజలు ఆమోదించారు. ఆశీర్వదించారు. రాష్ర్టాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. కేంద్రం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టింది’’ అని పేర్కొన్నారు.
గత ముఖ్యమంత్రి వచ్చారా?
గత ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఇలా ప్రజల మధ్యకు వచ్చారా? అని చంద్రబాబు స్థానికులను ప్రశ్నించారు. ‘‘గత సీఎం ఇలా వచ్చి మీటింగ్ పెట్టారా? ఎవరికైనా మైక్ ఇచ్చారా? పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వచ్చినా కింద చెట్లను నరికేసేవారు’’ అంటూ పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పరిపాలనలో మార్పులు తేవడానికే తాను ప్రజల మధ్యకు వస్తున్నట్టు చెప్పారు. ‘‘గత పాలకులు రాష్ర్టాన్ని విధ్వంసం చేశారు. 10 లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారు. ఆ అప్పులకు వడ్డీలు కడుతున్నాం. మీ కష్టాలు తీర్చేందుకు అభివృద్ధి, సంక్షేమం సమానంగా నడిపేందుకు ప్రయత్నిస్తున్నా. నాలుగోసారి సీఎంగా ఉన్న నాకే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూశాక వెసులుబాటు కనిపించడం లేదు. అయినప్పటికీ ప్రజల సహకారంతో రాష్ర్టాన్ని నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతా’’ అని చంద్రబాబు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
47 ఏళ్లుగా..
1978, మార్చి 15వ తేదీ.. 47 ఏళ్ల క్రితం ఇదే రోజు నేను మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టా. ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ దక్కని అసాధారణ గౌరవం నాకు దక్కింది. తెలుగు ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. పాలనలో సంస్కరణలు తెస్తున్నా. 2019లో గెలిపించే ఉంటే విభజిత రాష్ర్టాన్ని ఎక్కడికో తీసుకెళ్ల్లేవాళ్లం. నా తప్పులు కూడా ఉన్నాయి. ప్రతిసారీ వైకుంఠపాళి అవుతుంది. గుజరాత్‌లో సుదీర్ఘ కాలంగా బీజేపీ ప్రభుత్వం ఉంది. అలా సుదీర్ఘ కాలం అవకాశం ఇస్తే స్థిర నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. గత పాలకులు చెత్తపై పన్నువేశారు. మీ పట్టాదారు పాస్‌పుస్తకాల పైన వారి బొమ్మ వేశారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యతను తీసుకుంటాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి లక్షల ఎకరాల భూములు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. రికార్డులు తారుమారు చేశారు. ప్రైవేట్ భూములు 22ఏ కింద పెట్టేశారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేస్తున్నారు.
గత ప్రభుత్వం ముక్కుతూ, మూలుగుతూ పింఛన్లు ఇచ్చింది. ఇప్పుడు ఏటా పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.33 వేల కోట్లు వెచ్చిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.3 వేల పింఛనును రూ.4 వేలు చేశాం. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు రూ.10 వేలు, మంచం పట్టిన వారికి రూ.15 వేల చొప్పున పింఛను ఇస్తూ మానవత్వం చాటుతున్నాం.
అందరికీ ‘తల్లికి వందనం’
ఎన్నికల్లో చెప్పిన విధంగా ‘సూపర్ సిక్స్’ హామీలు నెరవేరుస్తున్నాం. మే నెల నుంచి ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ ‘తల్లికి వందనం’ అందిస్తాం. ప్రజలు పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నాం. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు రూ.20 వేలు ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం ధాన్యం సేకరణ, సొమ్ము చెల్లింపుల్లో ఇష్టానుసారంగా వ్యవహరించింది. కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది. మా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాకు సొమ్ములు జమ చేస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతలే. మా ప్రభుత్వం 85 శాతం రోడ్లలో గుంతల్లేకుండా చేసింది.
మునిసిపల్ కార్మికులను ఆదుకుంటాం
నేను ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టాను. ప్రతి ఒక్కరూ నెలలో ఒకరోజు దీనికి కేటాయించాల్సిందే. నెలకొకసారైనా మీలో చైతన్యం తేవడానికి ప్రయత్నిస్తున్నా. స్వచ్ఛాంధ్ర కోసం ఒక కోర్సును తయారు చేస్తాను. మునిసిపల్ కార్మికులను వేదికపై నా పక్కనే కూర్చొపెట్టుకున్నానంటే వారు మన ఆరోగ్యం కాపాడుతున్నారు. ఎవరు చేయని పని వారు చేస్తున్నారని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మునిసిపల్ కార్మికులను ఆదుకునే బాఽధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. గత పాలకులు ఐదేళ్లలో కనీసం డ్రెయినేజీల్లో మురికి కూడా తీయలేదు. 85 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు.
తణుకులో కూరగాయల మార్కెట్ చూశా. మిగిలిన కూరగాయలు అక్కడే ఉంచడంతో కుళ్లి పరిసర ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. వేస్ట్‌ను కంపోస్టుగా మార్చే సాంకేతికత ఇప్పుడు వచ్చింది. రోజుకి ఒక టన్ను చెత్తతో కంపోస్టు తయారవుతుంది. మునిసిపాలిటీలో పరిశుభ్రతను పరిరక్షించేందుకు వీలుగా పొల్యూషన్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, పురపాలకశాఖ మంత్రి నారాయణ ఒక అవగాహనకు వచ్చారు. దీనికి రూ.150 కోట్లు మంజూరు చేయబోతున్నాం.
ప్లాస్టిక్ పెనుభూతం
ప్లాస్టిక్ పెనుభూతం ప్రకృతిని నాశనం చేస్తుంది. ప్లాస్టిక్ కారకాలతో శ్వాసకోస వ్యాధులు, క్యాన్సర్లు వస్తున్నాయి. ఢిల్లీకి రోజూ పంజాబ్ నుంచి క్యాన్సర్ రోగులతో రైలు వస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. క్యాన్సర్ కారణంగా మా అత్తగారు(ఎన్టీఆర్ సతీమణి) బసవ తారకం చనిపోయారు. ఆమె పేరిటే బసవ తారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించారు. ఇప్పుడు వేలాది మంది క్యాన్సర్ రోగులకు ఆ సంస్థ వైద్యసేవలందిస్తోంది. క్యాన్సర్ నివారణకు సలహాలు ఇచ్చేందుకు ప్రముఖ క్యాన్సర్ వైద్యనిపుణుడు నోరి దత్తాత్రేయుడుని సలహాదారుగా నియమించాం. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్(సింగిల్ యూజ్) వస్తువుల కారణంగా అనేక అనర్థాలు జరుగుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రాష్ట్రంలో ఎక్కడా కాలుష్యకారకాలు లేకుండా, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళతాం.
స్వచ్ఛ భారత్ నివేదిక నాదే
‘పచ్చదనం-పరిశుభ్రత’ కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటి సారిగా ఉమ్మడి రాష్ట్రంలో నేనే ప్రారంభించా. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ భారత్’ నివేదిక ఇచ్చిందీ నేనే. స్వచ్ఛమైన ఏపీ నా ఆశయం.. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర మా లక్ష్యం. రాష్ట్రంలో రోడ్ల మీద 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉంది. దీనిలో ఇప్పటి వరకు 55 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగించాం. అక్టోబరు 2 నాటికి చెత్త అనేది ఎక్కడా కనిపించకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2027 నాటికి మురుగునీటిని 100 శాతం శుద్ధి చేసి వ్యవసాయానికి వాడతాం.
చీపురు పట్టిన చంద్రబాబు
తణుకులోని ఎన్టీఆర్ పార్కులో పారిశుధ్య కార్మికులతో సీఎం చంద్రబాబు ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. మున్సిపల్ కార్మికుల దుస్తులు ధరించి పార్కులోని రోడ్లను కార్మికులతో కలిసి శుభ్రం చేసి, చెత్తను తొలగించారు. కార్మికులను శాలువాలతో సత్కరించారు. స్వచ్ఛాంధ్ర కోసం పారిశుధ్య కార్మికులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉమ్మడిగా కృషి చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పార్కును రెండు నెలల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని మంత్రి నారాయణను ఆదేశించారు.
‘స్వచ్ఛాంధ్ర’లో ఎన్టీఆర్ జిల్లా ఫస్ట్
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లాల వారీగా ప్రగతిని ముఖ్యమంత్రి ర్యాంకుల రూపంలో ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా 134 పాయింట్లతో ముందు వరసలో నిలిచింది. అనకాపల్లి 131, తిరుపతి 128, విశాఖ 125, అనంతపురం 123, కాకినాడ 121, గుంటూరు 119, తూర్పుగోదావరి 118, పల్నాడు 117, అన్నమయ్య 115, అంబేడ్కర్ కోనసీమ 115, శ్రీకాకుళం 113, కడప 113, బాపట్ల 111, ఏలూరు 108, కర్నూల్ 104, నంద్యాల 102, సత్యసాయి 102, పార్వతీపురం 100, పొట్టి శ్రీరాములు 100, విజయనగరం 100, కృష్ణా 99, ప్రకాశం 99, పశ్చిమగోదావరి 97, చిత్తూరు 91, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 68 పాయింట్లు వచ్చాయి.
పోలీసుల అతి.. పట్టాభి అడ్డగింత
సీఎం పర్యటనలో పోలీసుల అతి ప్రవర్తన పార్టీ నాయకులకు చిరాకు తెప్పించింది. సీఎంకు స్వాగతం పలికే జాబితాలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు అనుమతి లేదంటూ తణుకు పాలిటెక్నిక్ కళాశాలలోని హెలిపాడ్ వద్ద పోలీసులు అడ్డగించారు. షాక్‌కు గురైన ఆయన వాహనం దిగి అనుమతి జాబితా పత్రాన్ని పరిశీలించారు. జాబితా తయారు చేసింది ఎవరంటూ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. కాసేపటికి ఆయనను హెలిప్యాడ్ వద్దకు అనుమతించారు. అలాగే తేతలి వై.జంక్షన్ వద్ద పట్టణంలోకి సాధారణ ప్రజలను అనుమతించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
టార్గెట్ 2029.. తమ్ముళ్లకు బాబు దిశా నిర్దేశం
‘‘నిన్న కన్నా నేడు బాగా పనిచేయడానికి నేనెప్పుడూ సిద్ధపడతా. పార్టీలో మీరు ఇదే మాదిరి సిద్ధపడాలి. మీ లక్ష్యం 2029. పార్టీలో అందరూ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాల్సిందే’’ అని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తణుకు నియోజకవర్గ టీడీపీ కేడర్, నాయకులతో శనివారం ఆయన భేటీ అయ్యారు. ‘‘తెలుగుదేశం కార్యకర్తకి ఏ ఎన్నిక అయినా ఒక పరీక్ష. జీవితాంతం మీకు పరీక్షలే. ఇది గుర్తు పెట్టుకుని మసలుకోవాల్సిందే. ఎక్కడకు వెళ్లినా కార్యకర్తల సమావేశం తప్పనిసరిగా పెడుతున్నా. వారి బాగోగులతోపాటు పార్టీ వ్యవహారాలపైనా మాట్లాడుకుంటున్నాం. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కార్యకర్తలతో మమేకం కావాలి. విషయాలపై చర్చించుకోవాలి. తదనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి అంటే అనుభవించడం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండటం. పార్టీకి ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తే ఒకటి, రెండుసార్లు చూస్తా.. తర్వాత పనిష్మెంట్ గట్టిగా ఉంటుంది. ఈసారి మహానాడు కడపలో పెడుతున్నాం.ప్రతీ కార్యకర్తకు పార్టీపరంగా బీమా సౌకర్యం ఉంటుంది. పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరికి తగిన గుర్తింపు లభించాలన్నదే నా ఆకాంక్ష.’’ అని చంద్రబాబు చెప్పారు.