Share News

Chandrababu Naidu: ఏడాదైనా ఫైళ్లు క్లియర్‌ చేయరా?

ABN , Publish Date - Feb 12 , 2025 | 06:25 AM

ఈ - ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు.

Chandrababu Naidu: ఏడాదైనా ఫైళ్లు క్లియర్‌ చేయరా?

బాధ్యత లేకుండా పనిచేస్తున్నారు

సమాచారం లేకుండా రావడమేంటి?

నన్ను మెప్పించే ఉపన్యాసాలు కాదు

పనిచేసి చూపించండి

అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం

లక్ష్యాలు పెట్టుకొని పనిచేయాలి

ఆర్థిక బాధలున్నా బకాయిల చెల్లింపు

22,507 కోట్ల అప్పు కట్టాం: సీఎం

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఆర్నెల్లైనా, ఏడాదైనా ఫైళ్లు క్లియర్‌ కాకపోవడం ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహించారు. బాధ్యత లేకుండా పనిచేస్తున్నారంటూ అధికారులపై తీవ్ర స్వరం వినిపించారు. ఈ - ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్‌ సీఈవో దినేశ్‌ కుమార్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున మూడు రోజుల్లోనే ఫైళ్లు క్లియర్‌ అవుతున్నాయని ఆర్టీజీఎస్‌ సీఈవో తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలని నిర్దేశించారు. ఆర్థికేతర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలనీ, ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశాలపైనా అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని ఆదేశించారు. అటవీశాఖ ప్రగతిపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఆ సమయంలో గాలి నాణ్యతపై చర్చ జరిగింది. ‘రాష్ట్రంలోని వివిధ నగరాల్లో గాలి నాణ్యత ఎలా ఉంది? దేశంలోని ఇతర నగరాల్లో ఎయిర్‌ క్వాలిటీ ఎలా ఉంది?.’ అని సీఎం ప్రశ్నించారు. అనంతరాము వద్ద సమాచారం లేకపోవడంతో ముఖ్యమంత్రి సీరియస్‌ అయ్యారు.

‘‘సమాచారం లేకుండా సమావేశానికి ఎలా వస్తారు? ప్రభుత్వ కార్యదర్శులకు అన్ని అంశాలపై కంట్రోల్‌ ఉండాలి. తమ శాఖకు సంబంధించిన పూర్తి సమాచారంతో, సన్నద్ధమై సమావేశాలకు రావాలి. అలా కాకుండా మీటింగ్‌కు వచ్చిన తర్వాత మళ్లీ డేటా పంపిస్తామంటే కుదరదు. చాలా మంది కార్యదర్శులు బాధ్యత లేకుండా పని చేస్తున్నారు’’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ పాలసీల రూపకల్పన, అమలు బాధ్యత మనదేనన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని, ఎప్పుడూ ఇలాంటి తీర్పు రాలేదన్నారు. గత ఐదేళ్ల విధ్వంస పాలనకు విసుగు చెంది కొత్త ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ముందుకొచ్చి కూటమికి ఘన విజయం అందించారన్నారు. వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇతరులపై ఆధారపడితే కొత్త ఆలోచనలు రావని, తాను ప్రతి గంటనూ లెక్కిస్తానన్నారు. 90 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, పథకాలకు ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించిందన్నారు. గత ప్రభుత్వంలో పరిశ్రమలు పడకేశాయని ఆయన గుర్తుచేశారు.

fg.jpg


మన నిబద్ధతకు నిదర్శనమిదే..

గత ప్రభుత్వం వల్ల ఏర్పడ్డ నష్టాలు వెంటాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు, బాధలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రూ.22,507 కోట్ల పాత అప్పులు చెల్లించామని ముఖ్యమంత్రి అన్నారు. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. చాలా క్లిష్టపరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని, ఎన్నో సవాళ్లు ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినప్పటికీ క్రమశిక్షణతో పాత బకాయిలు కూడా తీర్చగలిగేలా ఆర్థిక శాఖ పనిచేయడం సంతోషదాయకమంటూ ఆ శాఖ అధికారులను సీఎం ప్రశంసించారు.

చేతల్లో చూపిస్తేనే ప్రజల్లో మనుగడ

రాబోయే రోజుల్లో భావితరాలు గుర్తించుకునేలా మన పాలసీలు, అమలు విధానం ఉండాలని చంద్రబాబు నిర్దేశించారు. మాటలు చెప్పి ప్రజలను ఏమార్చే పాలకులు కనుమరుగవుతున్నారనీ, చేతల్లో చూపించే వారికే ప్రజల్లో మనుగడ ఉంటుందన్నారు. బడ్జెట్‌లో కేంద్రం ప్రాధాన్యం కల్పించిన వ్యవసాయ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రులు, కార్యదర్శులకు చంద్రబాబు నిర్దేశించారు వినూత్న మార్గంలో వ్యవసాయంలో ఏపీ ముందుకెళ్తోందన్నారు. ప్రపంచంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణగా రైతులు కూడా సాగు పద్ధతులు మార్చుకుంటున్నారని అన్నారు. కమర్షియల్‌ సాగులో ముందుకెళ్తున్న వారికి ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఏఐ టెక్నాలజీని అన్నీ శాఖలు అనుసంధానం చేసుకోవాలన్నారు. 1995లో ఐటీని దత్తత చేసుకున్నామని, ఇప్పుడు ఏఐని దత్తత తీసుకోవాలన్నారు.

ఎయిర్‌ క్వాలిటీలో మన స్థానమెంత?

ఏపీకి నివాసయోగ్యరాష్ట్రంగా పేరు తీసుకురావాలని చంద్రబాబు కోరారు. ‘‘ఢిల్లీ కాలుష్యంపై ప్రజల్లో చాలా ప్రతి స్పందన వచ్చింది. ప్రపంచంలోనే ఢిల్లీకి అత్యంత కాలుష్య నగరంగా పేరు వచ్చింది.’’ అని సీఎం అన్నారు. ఏపీలో ఉత్తమ నివాసయోగ్య పట్టణాలను సృష్టిస్తే బాగుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ సూచించారు. దానిపై సీఎం కొనసాగిస్తూ... ‘కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాలి. ఎయిర్‌ క్వాలిటీలో మనం ఏ స్థానంలో ఉన్నామో చెక్‌ చేసుకోవాలి. తర్వాత టార్గెట్‌ ప్రకారం సమిష్ఠిగా కృషి చేయాలి. ఇందుకోసం మున్సిపల్‌ మంత్రి నారాయణ బాధ్యత తీసుకోవాలి. ఎయిర్‌ క్వాలిటీలో దేశంలోనే బెస్ట్‌ సిటీలు ఏపీలోనే ఉండేలా కృషి జరగాలి.‘‘ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


అధికారులకు సీఎం చురకలు...

నన్ను మెప్పించడం కాదు. పని చేయండి. ఉపన్యాసాలు వద్దు.

ఫైళ్ల క్లియరెన్స్‌లో జాప్యానికి గల కారణాలు క్లుప్తంగా, సూటిగా చెప్పండి. చెప్పింది కార్యాచరణలో చూపండి.

సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల్లోని ఫైళ్ల క్లియర్‌ కావడం లేదని అధికంగా ఫిర్యాదులు వచ్చాయి.

సీఎంవోలో ఫైళ్ల క్లియరెన్సుకు సగటున 30 రోజుల ఏడున్నర గంటల సమయం పడుతోంది. అయినప్పటికీ మూడు ఫిర్యాదులే వచ్చాయి. చీఫ్‌ సెక్రటరీ కార్యాలయంలో ఫైళ్ల క్లియరెన్సుకు సగటున 2 రోజుల 13 గంటల సమయం పడుతోంది. ఈ కార్యాలయంపై కూడా ఫైళ్లు క్లియరెన్సు కోసం 3 ఫిర్యాదులే వచ్చాయి.

అత్యధికంగా ఆర్థిక శాఖ జనవరి ఒకటో తేదీ నాటికి 26,613 ఫైళ్లను క్లియర్‌ చేసింది. ఈ శాఖపై 129 ఫిర్యాదులు వచ్చాయి. 7013 ఫైళ్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

సాధారణ పరిపాలన శాఖ 17,780 ఫైళ్లను క్లియర్‌ చేసింది. 195 ఫిర్యాదులొచ్చాయి. 11,958 ఫైళ్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.

జలవనరుల శాఖ 18,430 ఫైళ్లను క్లియర్‌ చేసింది. 91 ఫిర్యాదులు వచ్చాయి. ఇంకా 9,491 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.

హోం శాఖలో 12,200 ఫైళ్లు క్లియర్‌ అయ్యాయి. 65 ఫిర్యాదులు వచ్చాయి. ఇంకా 7,433 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 17,259 ఫైళ్లు క్లియర్‌ చేశారు. 72 ఫిర్యాదులు వచ్చాయి. 3,296 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి.

పంచాయతీరాజ్‌ శాఖలో క్లియర్‌ చేసిన ఫైళ్ల కంటే పెండింగ్‌లో ఉన్న ఫైళ్లే అధికం. జనవరి ఒకటో తేదీ నాటికి 9,011 ఫైళ్లు క్లియర్‌ కాగా, ఇంకా 14,140 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ శాఖపై 101 ఫిర్యాదులు వచ్చాయి.

రెవెన్యూశాఖలో 16,313 ఫైళ్లు క్లియర్‌ చేయగా, 11,286 పెండింగ్‌లో ఉన్నాయి. 112 ఫిర్యాదులు వచ్చాయి.

ఫైళ్లు తక్కువ సమయంలో క్లియర్‌ చేస్తున్న శాఖల్లో రెవెన్యూ, న్యాయశాఖ, పశుసంవర్థకశాఖ, ఉన్నతవిద్యాశాఖ, ఆర్థిక శాఖ, అటవీ శాఖ, సీఎస్‌ కార్యాలయాలు ఉన్నాయి.


శివ భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు

‘శైవ క్షేత్రాలు ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆయా ఆలయాలకు వెళ్లే మార్గంలో భక్తులకు అటవీ అధికారులు ఇబ్బంది కలిగిస్తున్నారు’ అని సమావేశంలో దేవదాయ మంత్రి రామనారాయణరెడ్డి, సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘శ్రీశైల భక్తులకు ఇబ్బంది కలిగించవద్దు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కూడా పూర్తి స్థాయిలో సహకరించాలి’ అని ఆదేశించారు. కాగా, రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల గుంపులను తరిమికొట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను తెప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రయత్నాలు చేస్తే... అటవీ అధికారులు ఫాలోఅప్‌ చేయకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మీ ఫాలోఆప్‌ లేక ఇప్పటికీ కుంకీ ఏనుగులు రాలేదు. దీనిపై అధికారులు హోంవర్క్‌ చేయాలి’ అని సీఎం ఆదేశించారు.

4 నెలల్లో పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు

వెంటనే కేంద్రం ఆమోదం తీసుకోవాలి: సీఎం

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): పోలవరం నుంచి బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును నాలుగు నెలల్లో ప్రారంభించాలని, దీనికి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఒకరోజు వర్క్‌షాప్‌ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించిన ప్రణాళికలను ఇప్పటినుంచే రూపొందించాలని, పంపులు, ఎత్తిపోతలపై కార్యాచరణను సిద్ధం చేయాలని నిర్దేశించారు. పోలవరం నుంచి బనకచర్లకు గోదావరి జలాల తరలింపు పథకాన్ని పూర్తి చేసేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి మొత్తం రిజర్వాయర్లును పూర్తిగా వంద శాతం నింపాలని సీఎం స్పష్టం చేశారు. కాగా, ప్రభుత్వ శాఖలన్నింటికీ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) అనుసంధానం చేయాలని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ సూచించారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌పై ఐఐటీ చెన్నైతో అవగాహన కుదుర్చుకున్నామని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా తెలిపారు.


సీఎం చెప్పినా పట్టాలెక్కలేదు

నైపుణ్యాభివృద్ధిశాఖ తీరు మారలేదు

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): నైపుణ్య గణనలో నైపుణ్యాభివృద్ధి శాఖ తీరు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. డిసెంబరు రెండో వారంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయగా... రెండు నెలల తర్వాత మంగళవారం జరిగిన కార్యదర్శుల సదస్సు నాటికి కూడా ఆ శాఖ పనితీరు మారలేదు. కలెక్టర్ల సదస్సులో ఆ శాఖ అధికారులు ఏం చెప్పారో ఇప్పుడు కూడా అదే సమాధానం చెప్పడం గమనార్హం. అధికారంలోకి వచ్చిన వెంటనే నైపుణ్య గణనపై దృష్టి పెట్టి.. వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావించారు. లక్ష్యాన్ని నిర్దేశించి నైపుణ్యాభివృద్ధి శాఖకు గణనను అప్పగించారు. దీనిపై మొదట్లో హడావుడి చేసిన ఆ శాఖ అధికారులు ఆ తర్వాత చేతులెత్తేశారు. ఆరు నెలలకు జరిగిన కలెక్టర్ల సదస్సు నాటికి మంగళగిరి నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేకపోయారు. పైగా అప్పట్లో నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి, ఆ శాఖ ఎండీ మధ్య సమన్వయలోపంతో ప్రభుత్వానికి వేర్వేరు గణాంకాలు సమర్పించారు. కలెక్టర్ల సదస్సులో దీనిపై ప్రజెంటేషన్‌ ఇచ్చిన సమయంలో సీఎం తీవ్రంగా స్పందించారు. ‘నైపుణ్య గణన రాష్ట్రం మొత్తం ఆరు నెలల్లో పూర్తికావాలి. ఇప్పటికే ఆరు నెలలు గడిచినా ఇంకా ఒక్క నియోజకవర్గంలోనే ఉన్నారు. రాష్ట్రం మొత్తం నైపుణ్య గణన ఎప్పుడు పూర్తిచేస్తారు?.’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ప్రజెంటేషన్‌ను కూడా అక్కడే ఆపేశారు. అయితే ఇది జరిగి రెండు నెలలైనా ఇప్పటికీ నైపుణ్య గణన ప్రారంభం కాలేదు. మంగళవారం నాటి కార్యదర్శుల సదస్సులోనూ అధికారులు గతంలో చెప్పిందే మళ్లీ చెప్పారు.


వసతి గృహాల్లో భద్రతా ప్రమాణాలు పెరగాలి

వన్‌ మ్యాన్‌ కమిషన్‌కు సహకరించండి: సీఎం

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): సంక్షేమ వసతి గృహాల్లో భద్రతా ప్రమాణాలను పెంచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆర్‌టీజీఎస్‌ ద్వారా పర్యవేక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యదర్శుల సమీక్షలో సంక్షేమ శాఖపై ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఏకసభ్య కమిషన్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తూ అవసరమైన సమాచారాన్ని వెంటనే అందజేయాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన ఆదాయ, కుల తదితర ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా తక్షణమే అందజేయాలని ఆదేశించారు. ఉద్యోగాల్లో గిరిజనులకు రిజర్వేషన్‌ కల్పించే జీవో 3 రద్దుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసే ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, గిరిజన హక్కులకు ఎలాంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మైనారిటీలకు రంజాన్‌ తోఫా అందజేయడానికి ఏర్పాట్లు చేయాలని, విజయవాడలో హజ్‌హౌస్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ లావణ్యవేణి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సత్యనారాయణ ప్రజంటేషన్‌లు ఇచ్చారు.


14వేల కి.మీ. పరిధిలో గోతులు పూడ్చాం

నెలాఖరు నాటికి గుంతలు లేని రోడ్లు: ఆర్‌అండ్‌బీ

అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జనవరి నాటికి 14వేల కి.మీ. పరిధిలో గుంతలను పూడ్చామని రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే తెలిపారు. ఈ నెలాఖరు నాటికి గ్రామీణ, పట్టణ రహదారులపై గుంతలు పూడ్చివేసే కార్యక్రమం పూర్తిచేస్తామని పేర్కొన్నారు. గుంతలు లేని రహదారుల నిర్మాణం, నిర్వహణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కార్యదర్శుల సమావేశంలో ఆర్‌అండ్‌బీ రోడ్లపై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఎన్‌డీబీ నిధులతో ఇప్పటి వరకు 250 కి.మీ. రహదారుల నిర్మాణం జరిగిందని, వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ప్రాజెక్టు పూర్తవుతుందని కార్యదర్శి నివేదించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రోడ్లపై గుంతలన్నవే కనిపించడానికి వీల్లేదని, జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టులు వచ్చే నాలుగేళ్లలో పూర్తిచేయాలని ఆదేశించారు. గతంలో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం చేపడుతోన్న చర్యలతో ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. రహదారుల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.


Also Read: ఇకపై సహించను.. ఆ మంత్రులకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్..

Updated Date - Feb 12 , 2025 | 06:25 AM