CM Chandrababu Naidu: వెలుగు బాట
ABN , Publish Date - Mar 14 , 2025 | 05:00 AM
రాష్ట్రంలో విద్యుత్ రంగానికి గత ఐదేళ్లలో చీకట్లు ముసిరాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాము తొమ్మిది నెలల్లోనే పరిస్థితిని గాడిన పెట్టామని, ప్రతి ఇంటి నుంచీ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలకు ఆదాయ వనరుగా మార్చనున్నామని తెలిపారు.

‘‘ముప్పై ఏళ్ల క్రితం విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టినప్పుడు నన్ను ప్రపంచ బ్యాంకు జీతగాడని అన్నారు. రాష్ట్రం కోసం ఆ మాటలు పడ్డాను. రాష్ట్ర విభజన తర్వాత కరెంటు కోతల్లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాను. 2018 నాటికి మిగులు విద్యుత్‌లోకి తీసుకొచ్చాను. అయితే గత వైసీపీ ప్రభుత్వం తన మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్రాన్ని లోటు పరిస్థితికి తీసుకొచ్చింది. వివిధ చార్జీల పేరిట రూ.లక్ష కోట్ల భారం వేసింది. కమీషన్ల కోసం ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి.. ఆ భారమంతా మోపి ప్రజలను బాదేసింది. రాబోయే నాలుగేళ్లలో ఒక్క పైసా కూడా చార్జీలు పెంచం.’’
- సీఎం చంద్రబాబు
గత ఐదేళ్లూ కమీషన్ల కోసమే విద్యుత్ కొనుగోళ్లు
ఆ భారం ప్రజలపై వేసి భారీగా బాదుడు
వివిధ చార్జీల పేరిట 32 వేల కోట్ల వడ్డింపు
ప్రాజెక్టుల జాప్యం, అనాలోచిత నిర్ణయాలు..
తొమ్మిది నెలల్లోనే పరిస్థితిని గాడిన పెట్టాం
యూనిట్ ధర 5.16 నుంచి 4.80కు తెస్తాం
ఇంధన రంగంలోకి రానున్న 10 లక్షల కోట్లు
వచ్చే నాలుగేళ్లు విద్యుత్ చార్జీలు పెంచం
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్ రంగానికి గత ఐదేళ్లలో చీకట్లు ముసిరాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తాము తొమ్మిది నెలల్లోనే పరిస్థితిని గాడిన పెట్టామని, ప్రతి ఇంటి నుంచీ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలకు ఆదాయ వనరుగా మార్చనున్నామని తెలిపారు. గురువారం శాసనసభలో విద్యుత్ రంగంపై జరిగిన లఘు చర్చలో చంద్రబాబు ప్రసంగించారు. ‘‘గత వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ఒక వ్యక్తి(జగన్) మూర్ఖపు చర్యల వల్ల రాష్ట్ర విద్యుత్ రంగంపై వేల కోట్ల రూపాయల భారం పడింది. ప్రజలు విద్యుత్ బిల్లులు ముట్టుకుంటే షాక్ కొట్టేలా తొమ్మిది సార్లు ధరలు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది. ఈ రంగంలో ముప్పై సంవత్సరాల క్రితమే సంస్కరణలు టీడీపీ తెచ్చింది. ఆ ఫలితాలను సొమ్ము చేసుకున్న కాంగ్రెస్ పార్టీ 2004లో ఉచిత విద్యుత్ పేరుతో తిరోగమనంలోకి ఆ రంగాన్ని తీసుకెళ్లింది. రాష్ట్ర విభజన తర్వాత లోటు విద్యుత్‌ను పూడ్చి 2018నాటికి మిగులు విద్యుత్ స్థాయికి టీడీపీ తీసుకొచ్చింది. అయితే, గత ఐదేళ్లలో అరాచక ప్రభుత్వం మళ్లీ విద్యుత్ రంగాన్ని తిరోగమనంలోని తీసుకెళ్లింది. కమీషన్ల కోసం పీపీఏలు రద్దు చేసుకుని. కేంద్రం చెప్పినా వినకుండా, హైకోర్టు మొట్టికాయలు వేసినా మొండిగా ముందుకెళ్లి అన్యాయంగా ప్రజల సొమ్ము 9వేల కోట్ల రూపాయలను ఒప్పందాల రద్దుకు చెల్లించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలకమైన విద్యుత్ రంగాన్ని సంస్కరిస్తున్నాం. వృథా తగ్గించి, ఉత్పత్తి పెంచి నాణ్యమైన విద్యుత్ రైతులకు పగటి పూట తొమ్మిది గంటలు ఇస్తున్నాం. ఇంధన రంగంలో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించనున్నాం. రాబోయే నాలుగేళ్లలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ప్రజలకు మాటిస్తున్నాను.’’ అని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
కరెంటు స్వాపింగ్‌కు శ్రీకారం
‘‘ప్రజలనే విద్యుత్ ఉత్పత్తిదారులుగా తీర్చిదిద్ది కరెంటు స్వాపింగ్ విధానానికి శ్రీకారం చుడతాం. రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ పలకలు ఏర్పాటు చేసి సొంత అవసరాలకు ఉత్పత్తి చేసుకునేలా ప్రోత్సహిస్తాం. మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వమే యూనిట్ రూ.2.09తో కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వాలకు ఇప్పటి వరకూ ఎక్సైజ్, మైనింగ్, పెట్రోల్, డీజిల్ లాంటి వాటితోనే ఆదాయం అధికంగా ఉంది. ఇప్పుడు విద్యుత్ కూడా ఆదాయం తెచ్చిబెట్టబోతోంది. రాష్ట్రంలో 160గిగావాట్ల మేర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. విద్యుత్ రంగంలో ఇప్పటికే ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 3.70లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి.’’
కొనుగోలు వ్యయం తగ్గిస్తాం
‘‘రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాం. యూనిట్ కొనుగోలు ధరను 5.16రూపాయల నుంచి 4.80రూపాయలకు తగ్గిస్తాం. భూతాపం వల్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కృష్ణపట్నం స్టేజ్ 2, వీటీపీఎస్ స్టేజ్ 5, పోలవరం హైడ్రో పవర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణంలో గత ప్రభుత్వం చేసిన జాప్యం వల్ల అదనపు భారం పడుతోంది. ఒక అసమర్థుని వల్ల రూ.62,826కోట్ల అప్పు... రూ.1,12,422 కోట్లకు పెరిగింది. ఉత్పత్తి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజలపై భవిష్యత్తులో భారం పడకుండా దూరదృష్టితో వ్యవహరిస్తున్నాం. రాబోయే ఐదేళ్లలో జెన్‌కో ద్వారా మనకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి 1.07 కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో ఇప్పటివరకు వెనుకబడి ఉన్నాం. దీనిని అధిగమించడం కోసం రాష్ట్రంలో ప్రతి 30 కిలోమీటర్ల దూరంలో ఒక చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నాం. ట్రాన్స్ మిషన్ కెపాసిటీ పెంపునకు రూ.16,500కోట్లు ఖర్చు చేయబోతున్నాం.’’ అని సీఎం వెల్లడించారు.
కొరత లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా: మంత్రి గొట్టిపాటి
పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన కరెంటు సరఫరా చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గడిచిన తొమ్మిది నెలల్లో 40వేల కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, మరో పాతిక వేలు ఇవ్వబోతున్నామని చెప్పారు. విద్యుత్ రంగంపై చర్చ సందర్భంగా మాట్లాడిన సభ్యులు కళా వెంకట్రావ్, ప్రత్తిపాటి పుల్లారావు, జయ నాగేశ్వరరెడ్డి, పులివర్తి రామాంజినేయులు, వసంత కృష్ణప్రసాద్, పార్థసారథి, బండారు సత్యానందం, కాల్వ శ్రీనివాసులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి గొట్టిపాటి బదులిచ్చారు.
ఆర్‌వోఆర్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ భూ హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల సవరణ బిల్లు-2025కు శాసనసభ ఆమోదం తెలిపింది. అప్పిలేట్ అధికారాలను డీఆర్‌వోల నుంచి ఆర్డీవోలకు బదిలీ చేస్తూ ప్రతిపాదించిన ఈ ఆర్‌వోఆర్ చట్ట సవరణ బిల్లును రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం శాసనసభలో ప్రవేశపెట్టగా.. దీనిపై ఎలాంటి చర్చ లేకుండానే సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.