Share News

‘జయ0’ జరిగేలా సర్కారు అడుగులు

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:57 AM

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ.582 కోట్ల కుంభకోణం..జరిగి మూడేళ్లయినా ఇప్పటికీ బాధితులకు న్యాయం దక్కలేదు.. గత వైసీపీ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసేసి బాధితులకు తీరని అన్యాయం చేసింది.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారం భించింది.. సీఐడీ సీజ్‌ చేసిన రూ.450 కోట్ల సొసైటీ ఆస్తులను ఎలాగైనా వేలం వేసి బాధి తులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

‘జయ0’ జరిగేలా సర్కారు అడుగులు

  • జయలక్ష్మి బాధితులకు అండ

  • సీఎం దృష్టికి తీసుకువెళ్లిన కలెక్టర్‌

  • సీఐడీతో ప్రభుత్వం సంప్రదింపులు

  • రూ.450 కోట్ల ఆస్తుల వేలం

  • 11న సీఎం చెంతకు పాలకవర్గం

  • జూన్‌కల్లా కొంత చెల్లించే యత్నం

  • గడువు విధించిన అధికారులు

  • మూడేళ్ల కిందట ఘటన

  • రూ.582 కోట్లకు శఠగోపం

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ.582 కోట్ల కుంభకోణం..జరిగి మూడేళ్లయినా ఇప్పటికీ బాధితులకు న్యాయం దక్కలేదు.. గత వైసీపీ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేసేసి బాధితులకు తీరని అన్యాయం చేసింది.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారం భించింది.. సీఐడీ సీజ్‌ చేసిన రూ.450 కోట్ల సొసైటీ ఆస్తులను ఎలాగైనా వేలం వేసి బాధి తులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ షాన్‌మో హన్‌ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని సీఎం చంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లడంతో వేలం ప్రక్రియకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తొలివిడత రూ.200 కోట్లయినా చేతికి అందితే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉండడంతో ఆ దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి.అటు సొసైటీ పాలకవర్గం సైతం ఈ నెల 11న సీఎం చంద్ర బాబును కలవడానికి సన్నాహాలు చేస్తోంది. బా ధితులకు న్యాయం చేయాలని సీఎంను కోర నుంది.జూన్‌లోపు బాధితులకు 25 శాతమైనా న గదు చెల్లించాలని ప్రయత్నాలు చేస్తోంది.

రూ.582 కుంభకోణానికి మూడేళ్లు

కాకినాడ రూరల్‌ సర్పవరం జంక్షన్‌ ప్రధాన కేంద్రంగా ది జయలక్ష్మి మ్యూచువల్‌ ఎయిడెడ్‌ మల్టీపర్పస్‌ కోపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ పేరు తో ఎన్నో ఏళ్లుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వ హించేది. మూడేళ్ల కిందట ఈ సంస్థ డిపాజి టర్లను మోసం చేసింది. ఉమ్మడి తూర్పు, పశ్చి మ గోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో 29 బ్రాం చీల ద్వారా 20 వేల మంది నుంచి రూ.582 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించి 2022 ఏప్రిల్‌ 6న బోర్డు తిప్పేసింది. బాధితుల ఆందోళనలతో ప్రభుత్వం విచారణకు ఆదేశించగా రూ.582 కోట్ల మేర ఆర్థిక మోసం జరిగినట్టు జిల్లా సహకారశాఖ, సీబీసీఐడీ అధికారులు 348 పేజీల నివేదికను 2023లో అప్పటి ప్రభుత్వానికి అం దించారు. ఈ ఆర్థిక కుంభకోణానికి ప్రధాన సూత్రదారులుగా జయలక్ష్మి సొసైటీ చైర్మన్‌ రాయవరపు సీతారామాంజనేయులు, వైస్‌చైర్మన్‌ రాయవరపు బదరీ విశాలాక్ష్మి, ఇతర డైరెక్టర్లు రాయవరపు జయమణి, చక్రభాస్కరరావు, ప్రబల మల్లిఖార్జునరావు, మంగళంపల్లి వెంకట సుబ్రహ్మణ్యకుమార్‌, వారణాసి శాంతేశ్వరరావు, దూళ్ల శ్రీనివాస్‌, ఆర్‌.నాగేశ్వరరావు, జయశంకర్‌లుగా నిర్ధారించి నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. సీఐడీ విచారణ తర్వాత కుంభకోణంలో 159 మంది పాత్ర ఉన్నట్టు గుర్తించి అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచింది. 98 ఆస్తులకు చెందిన రూ.450 కోట్ల విలువైన స్థిరాస్తులను సొసైటీ చొరవతో సీఐడీ సీజ్‌ చేసి కోర్టుకు అటాచ్‌ చేసింది. ఈ ఆస్తులపై సేల్‌ ఆర్డర్‌ కోసం ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో నడుస్తోంది. నూతన పాలకవర్గం చైర్మన్‌ గంగిరెడ్డి త్రినాథరావు ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులు ఇది వరకే సొసైటీ నుంచి రుణాలు తీసుకున్న వారి నుంచి రూ.6 కోట్లు వసూలు చేసి బ్యాం కులో డిపాజిట్‌ చేశారు. ఇంకో రూ.6 కోట్లు సీఐడీ సీజ్‌ చేసిన దాంట్లో కోర్టులో పెండింగ్‌లో ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు ఈ ఆస్తులపై కన్నేసి కొట్టేశారు.

త్వరలో మరిన్ని జీవోలు..

కుంభకోణానికి సంబంధించి 21,895 మంది డిపాజిట్‌దారులకు 2022 నాటికి వడ్డీతో కలిపి మొత్తం రూ.511 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ఇప్పటికే లెక్కలు తేల్చారు. ప్రధానంగా రూ.లక్ష లోపు డిపాజిట్‌దారులు 13,249 మంది ఉండగా, రూ.32.72 కోట్లు చెల్లించాల్సి ఉంది. రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య డిపాజిట్‌దారులు 2,384 మంది ఉండగా వీరికి రూ.37.83 కోట్లు, రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల్లోపు 810 మంది ఉండగా వీరికి రూ.27.99 కోట్లు, రూ.5 లక్షల లోపు 677 మంది బాధితులు ఉండగా వీరికి రూ.30.41 కోట్లు, రూ.5 లక్షలు ఆపైన బాధి తులు 2,563 మంది ఉండగా వీరికి రూ.349 కోట్లు చెల్లించాల్సి ఉంది. రూ.582 కోట్ల కుంభకోణంలో వైస్‌ చైర్మన్‌ విశాలాక్షి ఒక్కరే ఎటువంటి పూచీకత్తు లేకుండా బినామీలతో రూ.300 కోట్లు కొట్టేయడం గమనార్హం. ఇప్పటి వరకు 98 ఆస్తు లకు చెందిన రూ.450 కోట్ల స్థిరాస్తులను సీఐడీ సీజ్‌ చేయగా ఈ ఆస్తుల స్వాధీనానికి ప్రభు త్వం 12 జీవోలు జారీ చేసింది.మరో ఐదు జీ వో లు విడుదల చేయాల్సి ఉండగా మరో వారంలో రూ.100 కోట్ల ఆస్తుల సీజ్‌ కోసం రెండు జీ వోలు ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.

ప్రభుత్వం మారడంతో చకచకా..

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఇప్పుడు సొసై టీ బాధితులకు న్యాయం చేసేందుకు వేగం గా అడుగులు పడుతున్నాయి.ఇటీవల కలెక్టర్ల సద స్సులో ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ షాన్‌మో హన్‌ సీఎం చంద్రబాబుతో చర్చించారు. సీఐడీ అటాచ్‌లో ఉన్న రూ.450 కోట్ల స్థిరాస్తులను వేలం వేసేలా చర్యలు చేపడితే బాధితులకు న్యాయం జరుగుతుందని వివరించారు. తొలుత సీఐడీతో ప్రభుత్వం చర్చించి వేలం ప్రక్రియ ముందుకు సాగేలా ప్రస్తుతం చర్యలు చేప ట్టింది. వేలానికి అన్నీ అనుకూలిస్తే నెల వ్యవ ధిలో ప్రక్రియ ముగించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.దీంతో బాధితుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. వైస్‌ చైర్మన్‌ విశాలాక్షి మేనల్లుడు ఆకెళ్ల ఉదయశంకర్‌ రూ.60 కోట్లతో లం డన్‌ చెక్కేయడంతో సీఐడీ ఇప్పటికే లుక్‌ అవు ట్‌ నోటీసు..తాజాగా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేశారు.హైదరాబాద్‌లో నిందితుడికి చెం దిన రూ.150 కోట్ల విలువైన 14 స్థిరాస్తులను సీఐడీ సీజ్‌ చేసింది. లోన్లు తీసుకున్న 235 మందిపై ట్రిబ్యునల్‌లో కేసు నమోదు చేయగా 40 మందిపై కోర్టులో నెంబర్‌ దాఖలైంది.

ప్రత్యేక ఆర్డినెన్స్‌ అవసరం

కూటమి ప్రభుత్వంలో జయలక్ష్మి సొసైటీ బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలిగింది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో జయలక్ష్మి వ్యవహారంపై సీఎం చర్చించడం మంచి పరిణామం. ఇప్పటికే కలెక్టర్‌ ద్వారా సహకారశాఖ కమిషనర్‌, సీఐడీ ద్వారా సీఎంకు లెటర్లు పంపాం. సొసైటీ సమగ్ర నివేదిక, సీజ్‌ చేసిన ఆస్తులు, తదితర వివరాలన్నీ కలిపి సొసైటీ పాలకవర్గం సభ్యులతో ఈనెల 11న సీఎం చంద్రబాబును కలవబోతున్నాం. సొసైటీ బాధ్యతలు తీసుకున్న సమయంలో ఒక్క రూపాయికి కూడా లేని స్థితినుంచి రూ.500 కోట్లకుపైగా ఆస్తుల గుర్తింపు, స్వాధీనం చేసుకోవడంలో పోలీసు, సీఐడీకి సహకరిం చాం.బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకువస్తే సేల్‌ ఆర్డర్స్‌ వేగంగా వచ్చే అవకాశం ఉంది.

-గంగిరెడ్డి త్రినాథరావు, చైర్మన్‌, జయలక్ష్మి సొసైటీ

Updated Date - Apr 09 , 2025 | 12:57 AM