కనకాయలంకలో రూ.22 కోట్లతో వంతెన
ABN , Publish Date - Apr 08 , 2025 | 01:03 AM
గోదా వరికి ఎర్రనీరు వచ్చిందంటే చాలు పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్‌వేపై రాకపోకలు నిలిచిపోతాయి. అలాగే వరద సమయంలో ఆప్రాంత లంక గ్రామస్తు లు నానావస్థలు పడుతున్నారు.

పి.గన్నవరం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): గోదా వరికి ఎర్రనీరు వచ్చిందంటే చాలు పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కనకాయలంక కాజ్‌వేపై రాకపోకలు నిలిచిపోతాయి. అలాగే వరద సమయంలో ఆప్రాంత లంక గ్రామస్తు లు నానావస్థలు పడుతున్నారు. కనకాయలంక గ్రామం పశ్చిమగోదావరి జిల్లా యలమంచలి మండలం పాలకొల్లు నియోజకవర్గంలో ఉండ టంతో వంతెనపై ఆ నియోజకవర్గ ప్రతినిధి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానా యుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. రూ.22కోట్లతో కాజ్‌వే స్థానే వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం కనకాయలంక గ్రామాన్ని మంత్రి సందర్శించి వంతెనపై అధికారులకు పలు సూచనలు చేశారు. దీంతో సోమవారం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైషన్ (సీడీవో) సీఈ ఆళ్ల విజయభాస్కర్, అధికారుల బృందం, రాజోలు హెడ్‌వర్క్స్ సబ్‌డివిజన్ డీఈ గంగుమళ్ల శ్రీనివాస్ వంతెన నిర్మాణ ప్రదేశాన్ని క్షేత్రస్థా యిలో పరిశీలన చేశారు. చాకలిపాలెం ఏటి గట్టు నుంచి కనకాయలంక గ్రామ సరిహద్దులో సీసీ రోడ్డుకు వంతెనను అనుసంధానం చేస్తా మని అధికారులు తెలిపారు. ఏటిగట్టు నుంచి 350 మీటర్ల పొడవు, 3.05మీటర్ల వెడల్పుతో వంతెన ఉంటుందన్నారు. వాటిలో 290మీటర్లు 20పిల్లర్లతో వంతెన, 60మీటర్ల మేర అప్రోచ్ ఉంటుందని వారు తెలిపారు. తొలుత స్థానిక అధికారులతో క్షేత్రస్థాయిలో వంతెన డిజైన్‌ను పరిశీలన చేసి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు. సీఈ వెంట సీడీవో ఈఈ సత్యనారాయణ, ఏఈఈ రమేష్, నరాసాపురం జేఈ సుబ్బారావు, స్థానిక జేఈలు మూర్తి, నాయుడు తదితరులు ఉన్నారు.