Share News

రానున్నది రాజపూజ్యమే!

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:49 AM

కూటమిపై జనం విశ్వాసం ఉంచారు.. చంద్రబాబును సీఎంను చూస్తే ఏపీ దిశ.. దిశ మారుతుందని నమ్మారు.. సూపర్‌ 6 హామీలను చూసి మురిసిపోయారు.. ఇంకేంటి గత సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్నదించారు..

రానున్నది రాజపూజ్యమే!

-(కాకినాడ/అమలాపురం/ాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)

కూటమిపై జనం విశ్వాసం ఉంచారు.. చంద్రబాబును సీఎంను చూస్తే ఏపీ దిశ.. దిశ మారుతుందని నమ్మారు.. సూపర్‌ 6 హామీలను చూసి మురిసిపోయారు.. ఇంకేంటి గత సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని విజయాన్నదించారు.. రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాలు ఉంటే 164 స్థానాల్లో కూటమిని గెలిపించారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే క్లీన్‌స్వీప్‌ చేశారు.. మరి ఆ విశ్వాసాన్ని కూటమి నిలబెట్టుకుంటుందా అంటే.. జనం ఓటేసి విశ్వాసాన్ని చూపితే.. చంద్రబాబు ప్రభుత్వం కూడా విశ్వావసు నామ సంవత్సరంలో సూపర్‌ 6 హామీల అమలుపై దృష్టిపెట్టింది.. మరో రెండు నెలల్లోనే తల్లికి వందనం.. అన్నదాతా సుఖీభవ తదితర సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయనుంది.. ఉందిలే మంచీ కాలం ముందు ముందునా.. అందరూ సుఖపడాలి.. ఈ రాష్ట్రమునందునా.. అన్నట్టుగానే.. ఆ మంచి కాలం రానుంది. తెలుగు సంవత్సరాది ఉగాది వేళ.. కోటి ఉషస్సుల కొత్త కాంతిలో సామాన్యుల జీవితాలు కొత్త వెలుగును సంతరించుకోనున్నాయి. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం తీసుకొసున్న పథకాలు ప్రజలకు భరోసాగా నిలవనున్నాయి. సర్కారు చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమాలతో సామాన్యుడి బతుకు చిత్రం మారనుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇప్పటికే కొత్త పింఛన్లు, సదరం సర్టిఫికెట్ల జారీ, కొత్త రేషన్‌ కార్డుల సమాచారం, ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు ప్రక్రియ, బీసీ రుణాలు, మహిళలకు కుట్టుమెషీన్లు, మే నెలలో తల్లికి వందనం, జూన్‌లో అన్న దాతా సుఖీభవ వంటి పథకాలను ప్రజలకు అందించనుంది.

తల్లికి వందన..మే

మే నెలలో తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఎం తో ప్రతిష్టాత్మకమైన ఈ పథకాన్ని సీఎం నారా చంద్రబాబు ఎన్నికల హామీగా ఇచ్చారు. ఈ పథకంలో ఒకొక్క విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది ఉంటే అంత మందికి అందించనున్నారు. కాకినాడ జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 3,10,003 లక్షల మంది ఉండగా 1,87,671 మంది తల్లులు ఉన్నారు. కోనసీమ జిల్లాలో 2.25 లక్షల మంది, తూర్పుగోదావరి జిల్లాలో 2.48 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

మహిళలకు కుట్టు మెషీన్లు..

మహిళల ఆర్థికాభివృద్ధికి ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి వారికి మెషీన్లు పంపిణీ చేసేందుకు కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన మహిళలు అర్హులు. నియోజకవర్గానికి మూడు వేల మెషీన్లు అంద నున్నాయి. 45, 60, 90 రోజుల శిక్షణ పూర్తయిన అనంతరం వీటిని లబ్ధిదారులకు అందజేస్తారు. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 3243 మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది.

అన్నదాతా సుఖీభవ..

కూటమి ప్రభుత్వం రైతుల్లో భరోసా నింపే అనేక కార్యక్రమాలు చేపడుతోంది. త్వరలోనే అన్నదాతా సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టనుంది. రైతన్నలకు అండగా నిలిచేలా పెట్టుబడి సాయం రూ.20 వేలు అందించనుంది. రానున్న మే, జూన్‌ నెలల్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా కోనసీమ జిల్లాలో ఉన్న పీఎం కిసాన్‌ పథకం కింద 1.12 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 1.20 లక్షలకు చేరుకోనుంది. కాకినాడ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది.

ఆనందమనిపింఛెన్‌..

దివ్యాంగులకు కొత్త పింఛన్లు అం దించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోం ది.జిల్లా ఆసుపత్రుల్లో దివ్యాంగులకు వైద్యపరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. నెలలో మొదటి మంగళవారం జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించి సదరం సర్టిఫికెట్లు అంద జేసి లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఎమ్మెల్సీ కోడ్‌ కారణంగా నిలిచిపోయిన స్పౌజ్‌ పెన్షన్లను ఏప్రిల్‌ నెల నుంచి పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్ర త పింఛన్లు ఒక్కొక్కరికీ రూ.4 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు.కాకినాడ జిల్లాలో 2,71,039 మంది పింఛనుదారులకు రూ.116.89 కోట్లు,తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 2,35,076 మంది లబ్ధిదారులకు రూ.102.28 కోట్లు, కోన సీమ జిల్లాలో 2,35,887 మంది లబ్ధిదారులకు రూ.100.90 కోట్లు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు.వీటితో పాటు మే నెలలో కొత్తగా పెన్షన్లు విడుదల చేయనున్నారు.

‘గృహ’త్తర పథకం..

పేదింటి కల తీరుస్తున్నారు. సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు పీఎం ఆవాస్‌యోజన, అర్బన్‌ పథకాల కింద రుణాలు మంజూరు చేస్తున్నారు. ఒక్క కోనసీమ జిల్లాలోనే ఇప్పటివరకు స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే అర్హులను 12,213 మందిగా గుర్తించారు. వీరిలో అముడా, రుడా పరిధిలో 11,134 మంది అర్బన్‌ పరిధిలో 484 మంది, గ్రామాల్లో 595 మందిని అర్హులుగా గుర్తించారు. కాకినాడ జిల్లాలో సొంతస్థలాలు ఉండి ఇళ్ల కోసం 19500 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1800 మంది వివిధ మునిసిపాలిటీల పరిధిలో దరఖాస్తు చేశారు. కాకినాడ నగరంలో 945 ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ 15 వేల వరకూ దరఖాస్తులు అందినట్టు సమాచారం. అర్బన్‌ పరిధిలో గృహనిర్మాణ లబ్ధిదారులకు రూ.2.50 లక్షలు, గ్రామీణ లబ్ధిదారులకురూ.1.80 లక్షలు రుణాలుగా అందజేస్తారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు అదనంగా రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా రూ.75 వేలు అదనపు సాయం అందిస్తుంది.

అభివృద్ధి.. డ్వాక్రా

ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోనే ఊపిరి పోసుకున్న డ్వాక్రా సంఘాలు ఇప్పుడు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. డ్వాక్రా మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కూట మి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 18 వేల మంది ఎన్యూమరేటర్లకు శిక్షణ ఇస్తున్నారు. వీళ్లకు ఒక యాప్‌ని ఇస్తారు. దానిలో డ్వాక్రా సంఘంలోని మహిళల పూర్తి వివరాలను నమోదు చేస్తారు. డ్వాక్రా రు ణాలు సక్రమంగా సద్వినియోగం చేసుకునే దిశగా ప్రోత్సహించి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తారు. జిల్లాలోని 3200 మహిళా సంఘాల్లోని 3.10 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.

రుణాల జాతర..

రుణాల జాతర మొదలైంది. ఈ నెల 11న కూటమి ప్రభుత్వం దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈనెల 25తో గడువు ముగిసింది. 21 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. బీసీ ఉపకులాలు, ఈడబ్ల్యూఎస్‌, ఈబీసీ, కాపు కులాలు స్వశక్తితో ఆర్థికంగా బలపడేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఒక్క కోనసీమ జిల్లాలోనే 1,275 యూనిట్ల ఏర్పాటుకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా రూ.12. 26 కోట్లు సబ్సిడీతోపాటు రూ.12.26 కోట్లు రుణంగా అందిస్తారు. మిగిలిన కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది.

ఏడుగురికి ఉగాది పురస్కారాలు

రాజమహేంద్రవరం, మార్చి 29 (ఆంధ్ర జ్యోతి): ఉగాది సందర్భంగా ప్రభుత్వం ప్రక టించిన పురస్కారాల్లో జిల్లా నుంచి ఇద్దరు కళారత్న, ఐదుగురు ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు.ఈ మేరకు శనివారం ప్రభు త్వం ఉత్తర్వులు విడుదల చేసింది. సాహిత్యం లో రాజమహేంద్రవరానికి చెందిన ఆచార్య శలాక రఘునాథ శర్మ, డా.దంటు మురళీ కృష్ణ (సంస్కృతం)కు కళారత్న, సాహిత్యంలో రాజ మహేంద్రవరానికి చెందిన డా.అరిపిరాల నారా యణరావు, అవధాన విభాగం నుంచి బులుసు అపర్ణ, తాతా సందీప్‌ శర్మ, సామాజిక సేవలో అనపర్తికి చెందిన నల్లమిల్లి సుబ్బారెడ్డి, రాజమహేంద్రవరానికి చెందిన అంతర్జాతీయ ప్రముఖ నఖ చిత్రకారుడు డాక్టర రవి పరసకు ఉగాది పురస్కారాలు దక్కాయి. విజయ వాడలో ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి ఉగాది వేడుకల్లో పురస్కారాలు అందుకుంటారు.

నేడు ఎంపీ కార్యాలయంలో ఉగాది ఉత్సవం

రాజమహేంద్రవరం అర్బన్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆద్వర్యంలో ఉగాది ఉత్సవం జరగనుంది.ఈ మేరకు రాజమహేంద్రవరం జేఎన్‌ రోడ్డులోని ఎస్‌వీ ఫంక్షన్‌ హాలులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు దైవజ్ఞరత్న, వాస్తు జ్యోతిష్య ప్రవీణ పుల్లెల సత్యనారాయణచే పంచాంగ శ్రవణం ఉంటుంది. అనంతరం వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందజేయడం జరుగుతుందని ఎంపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్ర మానికి పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ప్రజలు హాజరుకావాలన్నారు.

ప్రజలకు మంత్రి, కలెక్టర్‌

ఉగాది శుభాకాంక్షలు

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తెలుగు ప్రజలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభా కాంక్షలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌, జిల్లా కలెక్టర్‌ పి ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు వేర్వేరు ప్రకటనలు విడుదల చేసారు. షడ్రుచుల కలయికతో కూడిన ఉగాది పచ్చడి లా ఈ ఏడాది అన్ని రుచుల మేళవిం పుతో ఆనందంగా గడపాలన్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజల కు మంచి జరగాలని కోరారు.

Updated Date - Mar 30 , 2025 | 12:49 AM