Vallabhaneni Vamsi: తెలియదు... సంబంధం లేదు
ABN , Publish Date - Mar 30 , 2025 | 03:59 AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భూ వివాదం కేసులో కంకిపాడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. వంశీ ప్రశ్నలకు సహకరించకపోవడంతో, వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్ద భారీ హంగామా చేశారు.

విచారణకు సహకరించని వంశీ
భూ వివాదం కేసులో కంకిపాడు స్టేషన్‌లో విచారణ
లాయర్ సమక్షంలో ప్రశ్నలు
కంకిపాడు/గన్నవరం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): భూ వివాదం కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని శనివారం కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారించారు. పోలీసుల విచారణకు వంశీ ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. పోలీసుల ప్రశ్నలకు ‘తెలియదు.. సంబంధం లేదు’ అంటూ దాటవేత సమాధానాలు చెప్పినట్లు సమాచారం. వంశీపై తేలప్రోలుకు చెందిన కాంట్రాక్టర్ శనగల శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు గతనెల 24న ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న వంశీని ఈ కేసులో పీటీ వారెంట్‌పై ఇటీవల గన్నవరం కోర్టులో హాజరుపరచగా, ఏప్రిల్ 1 వరకు రిమాండ్ విధించారు. భూ వివాదంపై వంశీని విచారించడానికి ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరగా, శనివారం ఒకరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో శనివారం వంశీ అడ్వొకేట్ సత్యశ్రీ సమక్షంలో పోలీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భూ వివాదంపై ప్రశ్నించారు. అక్కడ నుంచి తీసుకువచ్చి గన్నవరం కోర్టులో న్యాయాధికారి ముందు హాజరు పరిచారు. కస్టడీలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా అని వంశీని న్యాయాధికారి ప్రశ్నించగా ఏమీ లేదని బదులిచ్చారు. అడ్వొకేట్ సత్యశ్రీ, తన భార్య పంకజశ్రీతో 5 నిమిషాలు మాట్లాడేందుకు వంశీకి న్యాయాధికారి అనుమతి ఇచ్చారు. అనంతరం వంశీని విజయవాడ జైలుకు తరలించారు.
పీఎస్ వద్ద వైసీపీ శ్రేణుల హంగామా
వంశీని కంకిపాడుకు తరలించారన్న సమాచారంతో వైసీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని హంగామా చేశారు. కంకిపాడు జెడ్పీటీసీ బాకి బాబు తదితరులు వంశీని కలిసేందుకు ప్రయత్నించారు. పోలీసులు అనుమతివ్వకపోవడంతో వెనుతిరిగారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేషన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News