AP Govt : ఆ మహిళా పోలీసులను ఏం చేద్దాం?

ABN, Publish Date - Feb 16 , 2025 | 03:26 AM

గత ప్రభుత్వ హయాంలో వారిని సచివాలయాల పరిధిలో శిశు సంక్షేమ విధుల కోసం తీసుకున్నారు.

AP Govt : ఆ మహిళా పోలీసులను ఏం చేద్దాం?
  • నియామకం స్త్రీ, శిశు సంక్షేమ సేవలకు

  • పని చేస్తున్నది యూనిఫాం విధుల్లో

  • నాడు జగన్‌ నిర్ణయాల ఫలితమిది

  • హోం, శిశు సంక్షేమ శాఖ మంత్రుల చర్చలు

  • శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని అనిత, సంధ్యారాణి యోచన

అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో వారిని సచివాలయాల పరిధిలో శిశు సంక్షేమ విధుల కోసం తీసుకున్నారు. కానీ, ఆ తర్వాత యూనిఫాం ఇచ్చి పోలీసు డ్యూటీ చేయమన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఎటాచ్‌ చేసి ప్రమాదకర పనులూ చేయించారు. తమ నియామకానికీ, చేస్తున్న విధులకూ పొంతన లేకపోవడంతో వారిలో కొందరు కోర్టులను ఆశ్రయించారు. కోర్టులో ఈ విషయం నలుగుతుండగానే రాష్ట్రంలో ప్రభుత్వం మారి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వారి సేవలను ఎలా వినియోగించుకోవాలనేది పెద్ద ప్రశ్నగా ముందు నిలిచింది. నాడు జగన్‌ ప్రభుత్వం నిర్వాకంతో బాధలు పడుతున్న సచివాలయాల మహిళా పోలీసుల దుస్థితి ఇదీ! వీరి సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించింది. వీరి సేవల వినియోగం విషయమై శనివారం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఇరు శాఖల అధికారులు చర్చించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి వారిని తీసుకురావాలని యోచించారు. చివరకు, దీనిపై మరోసారి కలిసి మాట్లాడదామని, ఆ తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్ణయం తీసుకుందామని ఇరువురు మంత్రులు భావించారు.

జాబ్‌ కార్టు ఎలా ఉండాలి?

ఒకవేళ మహిళా పోలీసులను మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయిస్తే, వారి సేవలను వినియోగించుకోవడంపై ఆ శాఖ ప్రాథమికంగా కసరత్తు చేసింది. కొన్ని విభాగాలను, సేవలను గుర్తించింది. అవి..

వన్‌ స్టాఫ్‌ సెంటర్లు: రాష్ట్రంలో 29 వన్‌ స్టాఫ్‌ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్ల సంరక్షణ విధులు ఇచ్చే అవకాశం ఉంది.

మహిళా,శిశు గృహాలు, శక్తి సదన్లు: మహిళా హాస్టళ్లు, శిశు గృహాలు, శక్తి సదన్లలో వీరి సేవలను వినియోగించుకునే వీలుంది.

Updated Date - Feb 16 , 2025 | 03:26 AM