YS Jagan: జగన్ నోట రోజుకో పిట్ట కథ.. జనం నమ్ముతారా..!
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:45 PM
వైసీపీ నేతలు పార్టీ వీడి వెళ్లిపోకుండా ఉండేందుకే జగన్ 2.O అంటున్నారా.. ఐదేళ్లు అద్భుతంగా పాలిస్తే ప్రజలు ఎందుకు పక్కనపెట్టేశారు. జగన్ పిట్ట కథలతో కాలక్షేపం చేసే ప్రయత్నం చేస్తున్నారా..

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో ఎక్కడ మాట్లాడినా రాబోయేది తమ ప్రభుత్వమేనంటూ ఎంతో ధీమాగా చెబుతున్నారు. ఓవైపు కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతున్న వేళ వైసీపీ శ్రేణులు నిరాశతో ఉన్నారు. మరోవైపు తమ రాజకీయ మనుగడ కోసం కూటమి పార్టీల్లోకి వెళ్లేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో జగన్ తమ నేతల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు తమ ప్రభుత్వం వచ్చేస్తోందంటూ.. ప్రస్తుత కూటమి పాలనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి మరోసారి అధికారం దక్కడం కష్టమనే అభిప్రాయం, అంచనా వైసీపీ నేతల్లో ఉందని, జగన్‌కు కూడా ఈ విషయం తెలుసని, అయినప్పటికీ పార్టీని కాపాడుకోవడానికి, ప్రస్తుతం ఉన్న నేతలు పార్టీ వీడి వెళ్లకుండా ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. జగన్ ఈ మధ్య కలలు బాగా కంటున్నారనే అభిప్రాయం కొంతమంది నుంచి వ్యక్తమవుతోంది. ఐదేళ్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు సంతృప్తి చెందకపోవడంతోనే మార్పు కోరుకున్నారనేది సుస్పష్టం. ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందనే విషయం ఏపీ ప్రజలకు తెలుసు. రాష్ట్ర అభివృద్ధి కోసం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. జగన్ గొప్పగా పాలించి ఉంటే ప్రజలు ఐదేళ్లకే మార్పు ఎందుకు కోరుకున్నారనేదానికి జగనే సమాధానం చెప్పాలి.
రోజుకో పిట్ట కథ..
జగన్ 2.0 అంటూ ఇటీవల కాలంలో తెగ ఊదరగొడుతున్నారు. ఈసారి అధికారంలోకి వస్తే మూడు దశాబ్ధాలు తమదే అధికారం అంటూ ప్రతిచోట ప్రసంగిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జరిగిన సమావేశంలోనూ ఇదే పిట్ట కథ చెప్పుకొచ్చారు జగన్. తాను ఐదేళ్లు అద్భుతంగా పాలించానని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ 1.0 పాలన చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిందని, జగన్ 2.0 కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారంటూ జగన్ చెబుతున్నారు. వాస్తవానికి జగన్ 1.0 పాలన అద్భుతమైతే ప్రజలు వరుసగా మరోసారి జగన్‌ను గెలిపించేవారు. సంక్షేమ పథకాల పేరుతో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించినా ప్రజలు మాత్రం జగన్ మాయలో పడలేదు. ఇవ్వన్నీ తెలిసినప్పటికీ జగన్ 2.0 అంటూ ఎందుకు పిట్టకథలు చెబుతున్నారనే చర్చ జరుగుతోంది.
ఇక మారరా..
పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు పార్టీ చీఫ్‌గా జగన్ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది తామేనని చెప్పడం వరకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఐదేళ్లు అద్భుత పాలన తర్వాత ప్రజలు ఎందుకు పక్కనపెట్టారనేదానికి మాత్రం సమాధానం చెప్పడంలేదు. ఎమ్మెల్యే హోదాలో శాసనసభకు వెళ్లి ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా.. పార్టీ కార్యకర్తల సమావేశంలో తమదే అధికారం అంటూ పిట్టకథలు చెప్పడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here