Minister Nimmala Ramanaidu: ఇది జగన్ ప్రభుత్వం అనుకుంటున్నారా
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:39 AM
హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పనుల్లో జరిగిన నిర్లక్ష్యంపై జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 15 లోగా విస్తరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు

హంద్రీ-నీవా ఇంజనీర్లపై నిమ్మల ఆగ్రహం
కర్నూలు, అనంతలో విస్తరణ పనుల పరిశీలన
జూన్ 15లోగా పూర్తిచేయాలని ఆదేశం
కర్నూలు/గుంతకల్లు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ‘ఇది జగన్ ప్రభుత్వం అనుకున్నారా..? ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నామనే భ్రమల్లో ఉన్నారా..? ఇది విజనరీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం’ అంటూ హంద్రీ-నీవా ప్రాజెక్టు ఇంజనీర్లపై జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజనీర్లు ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడాలని హితవు పలికారు. హంద్రీ-నీవా కాలువను తీవ్ర నిర్లక్ష్యంచేసి.. రాయలసీమ ప్రజలకు జగన్ తీరని ద్రోహం చేశారని విమర్శించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ఫేజ్-1 కింద రూ.695 కోట్లతో ఉమ్మడి కర్నూలు జిల్లా మల్యాల లిఫ్ట్ నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువను విస్తరించే పనులు చేపట్టారు. ఫేజ్-2 కింద ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రూ.1,500 కోట్లతో విస్తరణ, సీసీ లైనింగ్ పనులు చేస్తున్నారు. మంగళవారం నిమ్మల కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జరుగుతున్న విస్తరణ పనులను ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డిలతో కలసి పరిశీలించారు. అలాగే గుంతకల్లులో కసాపురం వద్ద స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంతో కలసి విస్తరణ పనులను తిలకించారు. ప్రాజెక్టు అనంతపురం చీఫ్ ఇంజనీరు (సీఈ) నాగరాజుతో కలసి విస్తరణ, సీసీ లైనింగ్ పనుల తీరుపై ఇంజనీర్లతో సమీక్షించారు.
జూన్‌లో కృష్ణా నదికి వరద వస్తే శ్రీశైలం జలాశయం ఎగువ నుంచి హంద్రీ-నీవా కాలువకు నీటిని తీసుకోవాలని గుర్తుచేశారు. అందుచేత జూన్ 15లోగా విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పలు ప్యాకేజీల పనులు పురోగతి నత్తనడకన సాగుతుండడంపై మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ.. హంద్రీ-నీవా కాలువ పూర్తి చేస్తే రాయలసీమ సస్యశామలం అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రధాన కాలువ, అనుబంధ కాలువలు 700 కిమీ మేర పూర్తి చేశామన్నారు.