Share News

Rain Alert to AP: బలపడిన అల్పపీడనం

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:30 AM

మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత పెరిగి, వాయవ్య గాలులతో వర్షాలు కురిపిస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు, వడగాడ్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

 Rain Alert to AP: బలపడిన అల్పపీడనం

రెండు రోజుల్లో బలహీనపడే అవకాశం

  • విస్తరించిన ఉపరితల ద్రోణి.. వాయవ్య గాలులు

  • వాతావరణ అనిశ్చితితో వర్షాలు.. వడగాడ్పులు

విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా బలపడి నైరుతి, దానికి ఆనుకుని దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఉత్తర వాయవ్యంగా పయనించి మళ్లీ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 24 గంటల్లో ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని బలహీనపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి ఒకటి విస్తరించింది. ఇదే సమయంలో వాయవ్య భారతం నుంచి రాష్ట్రంపైకి వేడి గాలులు వీస్తుండటంతో వాతావరణ అనిశ్చితి నెలకొని మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు, గురువారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం అల్లూరి, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 28 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడు, కడప జిల్లా మద్దూరులో 41.5, కర్నూలు జిల్లా కామవరంలో 40.7, పల్నాడు జిల్లా రావిపాడులో 40.6, ప్రకాశం జిల్లా దరిమడుగులో 40.5, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 40.3, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 09 , 2025 | 07:21 AM