WhatsApp Governance: మా లక్ష్యమిదే.. వాట్సప్ గవర్నెన్సుపై లోకేష్
ABN , Publish Date - Mar 18 , 2025 | 03:02 PM
WhatsApp Governance: ప్రతీ ఆరు నెలలకు ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలనే ఈ వాట్సప్ గవర్నెన్సు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్ సాయంతో ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేయబోతున్నామని వెల్లడించారు.

అమరావతి, మార్చి 18: వాట్సప్ గవర్నెన్స్‌పై (whatsapp governance) ఏపీ శానసనసభలో (Andhrapradesh legislative assembly) లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పటేల్ పట్వారీ వ్యవస్థను రూపుమాపి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్లారని.. చంద్రబాబు (CM Chandrababu Naidu) పౌరసేవలను ఈసేవగా మార్చి ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లారని తెలిపారు. పాదయాత్ర ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పూర్తిగా అర్ధం చేసుకున్నామన్నారు. ప్రభుత్వం నుంచి సేవలు అందుకోవాలంటే చేతులు కట్టుకుని నిల్చున్న పరిస్థితి ప్రజలదన్నారు. అందుకే సులభతరంగా పౌరసేవలు అందాలని సంకల్పించుకున్నామని చెప్పారు. మంగళగిరిలో ఓ ఎంపీపీ కుల ధృవీకరణ పత్రం అడిగితే గత ప్రభుత్వ హయాంలో వేధించారని.. అప్పుడే ప్రజలకు అత్యంత సులువుగా సర్టిఫికెట్లు జారీ చేసేలా వాట్సప్ గవర్నెనెన్సు తెచ్చామన్నారు. విజిబుల్ గవర్నెన్సు ఇన్విజిబుల్ గవర్నమెంట్ అనే అంశాన్ని బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ఈ పౌరసేవల కోసం మళ్లీ ప్రత్యేకంగా మరో యాప్ కాకుండా అందరూ వినియోగించే వాట్సప్‌నే దీని కోసం వాడుకోవాలని భావించామన్నారు.
ఈనెలాఖరుకు 300 సేవలు
ప్రస్తుతం 200 పౌర సేవలు వాట్సప్ ద్వారా అందించగలుగుతున్నామని అన్నారు. మన మిత్ర పేరిట ఈ వాట్సప్ గవర్నెన్సు సేవలు అందిస్తున్నామన్నారు. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాయిస్ ద్వారా కూడా సేవలు అందించాలని భావిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ సర్టిఫికెట్లు, ఆస్తి పన్నులను చెల్లించేలా వాట్సప్ గవర్నెన్సు సేవలు ఉంటాయన్నారు. ఈ నెలాఖరుకు 300 పౌరసేవలను అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రతీ ఆరు నెలలకు ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరగాలనే ఈ వాట్సప్ గవర్నెన్సు సేవలు అని స్పష్టం చేశారు. దీనికోసం కొన్ని చట్టాలను కూడా సవరించాలని భావిస్తున్నామన్నారు. క్యూఆర్ కోడ్ సాయంతో ఈ ధృవీకరణ పత్రాలను జారీ చేయబోతున్నామని వెల్లడించారు.
త్వరలోనే టీటీడీ సేవలు..
ఏఐ ఛాట్ బోట్ ద్వారానూ వాట్సప్ గవర్నెన్సు సేవలు అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భాషపై చర్చ జరుగుతోందని.. ఏపీలో చాలా భాషలు మాట్లాడే వ్యక్తులు ఉన్నారన్నారు. వారందరికీ వాట్సప్ గవర్నెన్సు సేవలు ఆయా భాషల్లోనే అందుతాయని తెలిపారు. ప్రస్తుతం 73 దేవాదాయశాఖకు చెందిన సేవలు వాట్సప్ గవర్నెన్సు ద్వారా అందుతున్నాయన్నారు. త్వరలోనే టీటీడీ సేవలు కూడా వాట్సప్ గవర్నెన్సు ద్వారా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్త కరెంటు కనెక్షన్ కావాలన్నా ఇప్పుడు వాట్సప్ ద్వారా అందుకోవచ్చన్నారు. 19 రెవెన్యూ సేవలు కూడా వాట్సప్ గవర్నెన్సు ద్వారా అందుతున్నాయన్నారు.
ఫోన్‌కే హాల్‌టికెట్స్..
ప్రజలు తమ ఇబ్బందులకు సంబంధించిన ఫిర్యాదులు కూడా దీని ద్వారా నమోదు చేయొచ్చన్నారు. 51 లక్షల లావాదేవీలు వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఇప్పటి వరకూ జరిగాయని.. విద్యాశాఖ నుంచి హాల్ టికెట్ల జారీ కూడా వాట్సప్ గవర్నెన్సు ద్వారా అందుతున్నాయన్నారు. పరీక్ష రాసే విద్యార్ధుల హాల్ టికెట్లు నేరుగా వాళ్ల పోన్‌కే వచ్చేస్తున్నాయని.. ఇదో సక్సెస్ స్టోరీ అని చెప్పుకొచ్చారు. విద్యార్ధుల పరీక్షా ఫలితాలు కూడా వాట్సప్ ద్వారా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి పౌరులకు అందించిన లావాదేవీలు కోటీ యాభై లక్షల మేర జరిగితే అందులో వాట్సప్ గవర్నెన్సు సేవలే 51 లక్షల వరకూ ఉన్నాయన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం అంతా డేటా లేక్ ద్వారా సమన్వయపరిచి సేవలు అందిస్తున్నామని తెలిపారు.
పూర్తి భద్రంగా డేటా..
కేవలం పది సెకన్లలోనే పౌరులకు సేవలు అందించాలన్నది తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. అలాగే పౌరులకు సంబంధించిన సమాచారం కూడా పూర్తి భద్రంగా ఉంటుందన్నారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదని తేల్చిచెప్పారు. వ్యక్తిగత డేటాను ఎక్కడా ఎవరితోనూ పంచుకోవటం లేదన్నారు. పూర్తిగా ఎన్‌క్రిప్టెడ్ డేటా మాత్రమే నేరుగా వినియోగదారుకు వెళ్తుందన్నారు. ఆధార్ ఎనేబుల్డ్ ఓటీపీ మాత్రమే జారీ అవుతుందన్నారు. ఐటీ చట్టం ప్రకారం వాట్సప్ గవర్నెన్సు ద్వారా జారీ అయ్యే పత్రాలకు పూర్తి చట్టబద్ధత ఉందన్నారు. సాంకేతికత విషయంలో పొరుగు రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయని తెలిపారు. వాట్సప్ గవర్నెన్సు సేవలను ఏపీ ప్రారంభించగానే అటు మహారాష్ట్ర కూడా నెల తర్వాత దీన్ని మొదలు పెట్టిందన్నారు. గ్రామవార్డు సచివాలయాలు తీసుకువచ్చాక గత ప్రభుత్వం మీసేవా కేంద్రాల నుంచి కొన్ని సేవలను తొలగించిందన్నారు. ఇప్పుడు వాట్సప్ గవర్నెన్సు వచ్చినంత మాత్రాన మీసేవా కేంద్రాల నుంచి సేవలను తొలగించబోమని స్పష్టం చేశారు. ప్రజలు కావాలనుకుంటే వాట్సప్ గవర్నెన్సు ద్వారా లేదంటే మీసేవా ద్వారా ప్రభుత్వ సేవలు పొందొచ్చన్నారు.
సీఎం లక్ష్యమిదే..
క్యూఆర్ కోడ్ ద్వారా ఒక్కసారి ధృవీకరణ పత్రం జారీ అయితే అది శాశ్వతంగా ఇచ్చినట్టే అని వెల్లడించారు. ప్రతీ ఆరు నెలలకూ ఓ సారి ధృవీకరణ పత్రం పొందాలంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. ధాన్యం సేకరణను కూడా దీంతో అనుసంధానం చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వం అంటే కార్యాలయం కాదని.. అందించే సేవలు గుర్తుకు రావాలన్నారు. ఏది అమలు చేసినా ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేసి వాట్సప్ గవర్నెన్సు మన మిత్ర సేవలను ప్రజలకు చేరువ చేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Hyderabad crime news: పనిలో చేరిన 16 గంటల్లో ఊహించని షాకిచ్చిన మహిళ
Chittoor man snake bite: అయ్యోపాపం సుబ్రహ్మణ్యం.. బాబోయ్ ఇదెక్కడి పగరా నాయనా
Read Latest AP News And Telugu News