Minister Savitha: జగన్ శవరాజకీయాలు మళ్లీ మెుదలుపెట్టారు: మంత్రి సవిత..
ABN, Publish Date - Jan 10 , 2025 | 03:11 PM
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మళ్లీ శవరాజకీయాలు మొదలుపెట్టారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతికి వచ్చిన జగన్.. తొక్కిసలాట బాధితులను పరామర్శించి అనంతరం శవరాజకీయాలకు తెరతీశారని మంత్రి ధ్వజమెత్తారు.
కర్నూలు: తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత (Minister Savita) స్పందించారు. తిరుమల (Tirumala) వెంకన్న వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం వెళ్లి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారని, రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, సిబ్బందికి సైతం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. వేంకటేశ్వర స్వామివారికి సంబంధించి ఆ పుణ్య క్షేత్రంలో ఎటువంటి తప్పిదాలకూ అవకాశం లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వారిని ఆదేశించినట్లు మంత్రి సవిత చెప్పుకొచ్చారు.
జగన్ శవరాజకీయాలు..
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మళ్లీ శవరాజకీయాలు మొదలుపెట్టారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతికి వచ్చిన జగన్.. తొక్కిసలాట బాధితులను పరామర్శించి అనంతరం శవరాజకీయాలకు తెరతీశారని మంత్రి ధ్వజమెత్తారు. ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ చిన్నాన వైఎస్ వివేకా గొడ్డలిపోటు ఎలా జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని సవిత చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలిచేందుకు కోడి కత్తి డ్రామాను జగన్ ఎంత ఆసక్తికరంగా రక్తికట్టించారే విషయం సైతం ప్రజలందరికీ తెలుసని మంత్రి మండిపడ్డారు. జగన్ శవరాజకీయాలు గతంలోనూ పలుసార్లు తెలుగు ప్రజలందరూ చూశారని సవిత ధ్వజమెత్తారు.
చంద్రబాబు అంటే అది..
అధికారం ఉన్నా, లేకున్నా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం చంద్రబాబు అహర్నిశలు పాటుపడుతారని మంత్రి సవిత చెప్పుకొచ్చారు. రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు 30 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి గుర్తు చేశారు. వరదలకు ఏకంగా ఐదు గ్రామాలు మునిగిపోయాయని, ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి చెప్పుకొచ్చారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు.. అన్నమయ్య ప్రాజెక్టు వద్దకు వెళ్లి మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారని మంత్రి సవిత గుర్తు చేశారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతి కుటుంబానికీ రూ.లక్ష విరాళంగా అందచేశారని మంత్రి చెప్పుకొచ్చారు. నిత్యం ప్రజల కోసం ఆలోచించే సీఎం చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మంత్రి సవిత ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: బ్రాండ్ ఏపీ ముందుకెళ్తోంది
Daggubati Purandeswari: విద్యార్థులకు సంస్కృతి, సాంప్రదాయాలపై అవగాహన కల్పించాలి
Updated Date - Jan 10 , 2025 | 03:16 PM