భ్రమరాంబికాదేవికి కొబ్బరికాయల సమర్పణ
ABN, Publish Date - Mar 15 , 2025 | 12:38 AM
శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం రోజున గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం.

శ్రీశైలం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహాక్షేత్రంలో చైౖత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళవారం గానీ, శుక్రవారం రోజున గానీ భ్రమరాంబ అమ్మవారికి కుంభోత్సవం జరిపించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్ 15 న కుంభోత్సవం నిర్వహించనున్నారు. అమ్మవారికి సాత్విక బలి నిర్వహించేందుకు కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆ రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. శుక్రవారం అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాధికాలు నిర్వహించి అనంతరం అమ్మవారికి సమర్పించారు. ఈవో ఎం. శ్రీనివాసరావు, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
శ్రీశైలం మహాక్షేత్రంలో లోకకళ్యాణార్థం శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఊయల సేవ ఘనంగా నిర్వహించారు. గ్రామదేవత అంకాలమ్మకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా నిర్వహిస్తున్న నిత్యకళారాధన కార్యక్రమంలో శుక్ర వారం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాధిక డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీతో సంప్రదాయ నృత్యప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి శుక్రవారం కర్నూలు జిల్లాకు చెందిన కె. సురేష్ అనే భక్తుడు రూ.1,00,116 విరాళాన్ని ఏఈవో జి. స్వాములుకు అందజేశారు. హైదరాబాదుకు చెందిన పర్వతవర్ధనమ్మ ఆంజనేయులు అనే భక్తుడు రూ.1,25,000 విరాళాన్ని పర్యవేక్షకుడు ఎం. మల్లికార్జునకు అందజేశారు.
Updated Date - Mar 15 , 2025 | 12:38 AM