Share News

ఊరూరా.. ఉగాది సందడి

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:29 AM

ఊరూరా.. ఉగాది సందడి నెలకొంది. ‘శ్రీ విశ్వావసు’ నామ తెలుగు సంవత్సర ఆరంభ వేడుక...తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైన పండుగ ‘ఉగాది’ని ఆదివారం ఉమ్మడి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకున్నారు.

ఊరూరా.. ఉగాది సందడి
ఉగాది పురస్కారం అందజేస్తున్న మంత్రి టీజీ భరత్‌, కలెక్టర్‌ రంజిత్‌ బాషా

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు

పంచాంగ పఠనం చేసిన అర్చకులు

కర్నూలు కల్చరల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఊరూరా.. ఉగాది సందడి నెలకొంది. ‘శ్రీ విశ్వావసు’ నామ తెలుగు సంవత్సర ఆరంభ వేడుక...తెలుగు వారికి అత్యంత ప్రీతికరమైన పండుగ ‘ఉగాది’ని ఆదివారం ఉమ్మడి జిల్లా వాసులు ఘనంగా నిర్వహించుకున్నారు. తెలుగు కాలమానం ప్రకారం తొలి సంవత్సరంలో అన్నీ శుభాలే వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు పండుగ కళ కానవచ్చింది. మరోవైపు ఆదివారం సెలవు రోజు కావడంతో అన్ని వర్గాల వారు వేకువ జాము నుంచే వేడుక నిర్వహణకు సన్నద్ధమయ్యారు. ప్రజలు తమ గృహా ద్వారాలను బంతిపూలతో ప్రత్యేకంగా అలంకరించి, మామిడి ఆకుల తోరణాలు కట్టి, ఉగాది లక్ష్మిని తమ ఇంటికి ఆహ్వానించారు. తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారంతో చేసిన షడ్రుచుల ఉగాది పచ్చడిని, పిండి వంటలను నైవేద్యంగా అమ్మ వారికి సమర్పించారు. ఆతర్వాత సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని స్వీకరించారు. సాయంత్రం నూతన వస్త్రాలు ధరించి, సమీపంలోని దేవాలయాలకు, ధార్మిక క్షేత్రాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పంచాంగ పఠన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ ఏడాది వ్యవసాయం, వర్షాలు, గ్రహస్థితులు, దేశ కాలమాన పరిస్థితులను, తమతమ రాశుల ఫలితాలను పంచాంగ పఠన కర్తల ద్వారా వింటూ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉగాది పర్వదిన సందర్భంగా వివిధ ఆలయాల్లో ఉగాది పచ్చళ్లను పంపిణీ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకొన్నారు. ఆయా గ్రామాల్లోని గ్రామ దేవతల ఆలయాలకు వెళ్లి ఉదయాన్నే పూజాది కార్యక్రమాలు చేపట్టారు. ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. ఇండ్లలో కుటుంబ సమేతంగా ఉగాది పచ్చళ్ళు, పలు రకాల పిండి వంటలు చేసుకుని వేడుకలను ఆనందంగా జరుపుకొన్నారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ఏడాది ఉగాది వేడుకలు వైభవంగా సాగాయి. ఒకవైపు గ్రీష్మతాపం తీవ్రంగా ఉన్నా, ఆలయాల వద్ద భక్తుల సందడి బాగా కనిపించింది. ఉమ్మడి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు వివిధ ప్రాంతాల నుంచీ విచ్చేసిన యాత్రికులతో కిటకిటలాడాయి.

ఉగాది శుభాలను తీసుకురావాలి

పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం

మంత్రి టీజీ భరత్‌

కర్నూలు కలెక్టరేట్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): శ్రీ విశ్వావసునామ నూతన సంవత్సరం ప్రజలందరికీ శుభాలను తీసుకురావాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ ఆకాంక్షించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్‌ మాట్లాడుతూ దావోస్‌ పర్యటన అనంతరం ఈ మధ్యన రెండు ముఖ్యమైన పారిశ్రామిక ప్రాజెక్టులు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశామన్నారు. త్వరలోనే వాటిని గ్రౌండింగ్‌ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పింఛన్‌ పంపిణీ, సీసీ రోడ్ల నిర్మాణం తదితర విషయాల్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచామన్నారు. ఈ సంవత్సరం వృద్ధి రేటు 11.56 శాతం వచ్చిందన్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం మేరకు 16 శాతం సాధించేలా ప్లాన్‌ చేసుకున్నామన్నారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కలెక్టర్‌ రంజిత్‌ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది, రంజాన్‌, క్రిస్మస్‌ తదితర పండుగల సందర్భంలో మన ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి రానున్న తరాలకు తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు.

11 మందికి ఉగాది పురస్కారాలు:

ఉగాది సందర్భంగా ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన వారికి పురస్కారాలు అందించింది.

వ్యవసాయ శాఖ : గూడూరులోని రైతు పెద్ద గొల్ల ఎల్లప్ప.

విద్యారంగం: పత్తికొండ మండలం జేఎం తండా ఎంపీపీ స్కూల్‌లో పని చేస్తున్న ఎం. కళ్యాణి కుమారి.

నాటక రంగం: నాటకాల్లో అనేక పాత్రలు పోషించిన శ్రీనివాసరెడ్డి

ఉద్యాన పంటల సాగు: తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండిస్తూ అధిక దిగుబడులు పొంది ఇతర రైతులకు మార్గదర్శకులుగా నిలిచిన దేవనకొండ మండలంలోని బేతపల్లి గ్రామ రైతు కనాపురం సుంకన్న.

సాహిత్యం: మొట్టమొదటిసారిగా బ్రెయిలి లిపిలో భగవద్గీతను అనువదించి జిల్లా లైబ్రరీ సంస్థ నుంచి అవార్డు కూడా పొందిన ఆలూరు మండలం హులేబేడులోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో పని చేస్తున్న బీటీ లక్ష్మన్న.

శాస్త్రీయ నృత్యం: కూచిపూడి అధ్యాపకుడు గంగాధరం.

శాస్త్రీయ వాయిద్యం: నాద స్వర విద్యాంసులు పలు కచేరీలలో ప్రతిభ చాటుకున్న గణేష్‌.

క్రీడారంగం: రన్నింగ్‌ క్రీడలలో 2024లో ఈజిప్టులో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలలో మూడోస్థానం పొందిన బంగ చరణ్‌తేజ.

రక్తదానం: 102 సార్లు రక్తదానం చేసిన సామాజిక సేవాకర్త జి. బసవేశ్వర బాబ్జి

పాడి పరిశ్రమ: 12 బుర్ర గేదెలతో 6 ఆవులతో రోజుకు 100 లీటర్ల పాటు ఉత్పత్తి చేసి అందరికి ఆదర్శంగా నిలిచిన ఎస్‌. తులసిరెడ్డి.

కళారంగం: లలిత సంగీతంలో ప్రతిభా చాటిన సరస్వతి... వీరికి ఉగాది పురస్కారాలను మంత్రి ప్రదానం చేశారు. అంతకు ముందు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డా.బి. నవ్య, డీఆర్వో సీ. వెంకటనారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:29 AM