Kurnool: ఓర్వకల్లు సిగలో కాంతి పుంజం..
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:35 AM
కర్నూలు ఓర్వకల్లు డీఆర్‌డీవో కేంద్రం లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎంకే-2(ఏ)ను విజయవంతంగా పరీక్షించింది. 2019లో క్షిపణి పరీక్ష తర్వాత, ఇప్పుడు లేజర్ అస్త్రం కూడా పరీక్షలో విజయం సాధించింది.

పాలకొలనులో ప్రతిష్ఠాత్మక డీఆర్‌డీవో కేంద్రం
2019లో విజయవంతంగా క్షిపణి ప్రయోగం
తాజాగా ‘లేజర్ అస్త్రం’ పరీక్ష గ్రాండ్ సక్సెస్
కర్నూలు జిల్లా పాలకొలను గ్రామస్థుల హర్షం
(కర్నూలు - ఆంధ్రజ్యోతి)
కర్నూలుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని డీఆర్‌డీవో కేంద్రం నుంచి 30 కిలోవాట్ల లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) ఎంకే-2(ఏ)ను ఈ నెల 13న దిగ్విజయంగా పరీక్షించడంతో అందరి దృష్టీ కర్నూలుపై పడింది. 2019 సెప్టంబరు 11న దేశీయంగా అభివృద్ధి చేసిన తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (క్షిపణి)ని ఇక్కడి నుంచి విజయవంతంగా ప్రయోగించారు. కర్నూలు గడ్డపై డీఆర్‌డీవో ఐదున్నర ఏళ్లలో చేపట్టిన రెండు పరీక్షలు ఘన విజయం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తాజాగా లేజర్ అస్త్రం పరీక్ష సక్సెస్ కావడంతో లక్షలాది మంది కర్నూలు డీఆర్‌డీవో కేంద్రం గురించి గూగుల్‌లో వెతుకుతున్నారు.
పాలకొలను సమీపంలో ఏర్పాటు
కర్నూలు నగరానికి 35 కి.మీ. దూరంలో ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామం వద్ద డీఆర్‌డీవో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని 2015లో అప్పటి డీఆర్‌డీవో డైరెక్టర్లు సీవీ బాలాజీ, డీవీఎ్‌సఆర్ మూర్తి, అసోసియేట్ ప్రొఫెసర్ శంకర్‌రావు పరిశీలించారు. ఓర్వకల్లు మండల పరిధిలో పాలకొలను, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, కాల్వ గ్రామాలు, వెల్దుర్తి మండలం బుక్కాపురం గ్రామాల పరిధిలో డీఆర్‌డీవో ఏర్పాటుకు అనువుగా ఉంటుందని కేంద్ర రక్షణ శాఖకు నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక మేరకు.. అప్పటి సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం డీఆర్‌డీవో ఏర్పాటుకు 2,781 ఎకరాలు కేటాయిస్తూ మంత్రివర్గంలో తీర్మానించింది. ఎకరా రూ.2 లక్షలు చొప్పున రూ.54 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం పట్టాభూమి రైతులకు ఎకరా రూ.5 లక్షలు, అసైన్డ్ పట్టా భూమికి ఎకరాకు రూ.4.30 లక్షలు చొప్పున భూ పరిహారం చెల్లించి సదరు భూమిని డీఆర్‌డీవోకు స్వాధీనం చేశారు. రూ.570 కోట్లతో అభివృద్ధి చేసే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అప్పటి పాలకులు పేర్కొన్నారు. ఫేజ్-1 కింద దాదాపు రూ.120 కోట్లు ఖర్చు చేసి దృడమైన ప్రహరీ, టెక్నికల్ బిల్డింగ్స్, అడ్మినిస్ర్టేషన్ భవనాలు, ఎంఐ (మెడికల్) భవనాలు, డీఎ్‌సఈ, సెక్యూరిటీ భవనాల నిర్మాణాలు.. వంటి పనులను దాదాపు పూర్తి చేశారు. చుట్టూ 24 గంటలు నిఘా ఉండేలా రెండు కిలోమీటర్లకు ఒకటి చొప్పున 14 వాచ్ టవర్లను నిర్మించారు.
నాడు క్షిపణి.. నేడు లేజర్ అస్త్రం ప్రయోగం
కర్నూలు డీఆర్‌డీవో కేంద్రం నిర్మాణ దశలో ఉండగానే 2019 సెప్టెంబరు 11న తేలికపాటి యాంటీ ట్యాంక్ గైడెన్స్ మిస్సైల్ (క్షిపణి) విజయవంతంగా పరీక్షించారు. సైనికుడు భుజంపై మోసుకెళ్లేందుకు వీలుగా ఉండేలా డీఆర్‌డీవో ఈ క్షిపణిని దేశీయంగా తయారు చేసింది. ఐదున్నరేళ్ల తర్వాత.. అధునాతన ఫ్యూచరిస్టిక్ ‘స్టార్ వార్స్’గా పేర్కొంటున్న లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎంకే-2 (ఏ)ను ఈ కేంద్రం నుంచి తొలిసారిగా పరీక్షించారు. ఇది శత్రువుల డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేయగల లేజర్ అస్త్రం. కర్నూలులో ఉన్న నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో ఎంకే-2(ఏ)ను వినియోగించి కాంతి పుంజాలతో డ్రోన్ల సమూహాలను, ఫిక్స్‌డ్ వింగ్ యూఏవీలను ధ్వంసం చేశారు.
ప్రధాన పట్టణాల్లో ఒకటిగా ఓర్వకల్లు: ఎమ్మెల్యే గౌరు చరిత
‘డ్రోన్ సిటీ సహా.. పలు భారీ పరిశ్రమలు సైతం ఓర్వకల్లుకు రాబోతున్నాయి. భవిషత్తులో దేశంలోని ప్రధాన పట్టణాల్లో ఒకటిగా ఓర్వకల్లు మారబోతుంది’ అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. ఇక్కడ చేపట్టిన రెండు పరీక్షలు విజయవంతం కావడంతో భూములిచ్చిన పాలకొలను గ్రామ రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాలకొలను గ్రామానికి చెందిన చదువులు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘దేశ రక్షణలో మేము సైతం భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది. కోర్టులో ఉండడంతో డీ-పట్టా కలిగిన వంద మంది రైతులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని వారికి న్యాయం చేయాలి’ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..