Minister Lokesh : దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే వంశీ జైలుకు
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:45 AM
‘దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే మాజీ ఎమ్మెల్యే వంశీ జైలుకు వెళ్లారు.

తప్పు చేసినవారిని చట్టబద్ధంగా శిక్షిస్తాం: లోకేశ్
గన్నవరం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ‘దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే మాజీ ఎమ్మెల్యే వంశీ జైలుకు వెళ్లారు. అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. ఎలాంటి సందే హమూ లేదు. న్యాయబద్ధంగా అన్ని చర్యలూ తీసుకుంటాం’ అని మంత్రి లోకేశ్ అన్నారు. శనివారం గన్నవరం విమానాశ్రయం వద్ద ఆయన మాట్లాడారు. ‘2019-24 నడుమ మమ్మల్ని అడుగడుగునా ఇబ్బంది పెట్టారు. ఇంటి నుంచి బయటకు కూడా రానివ్వలేదు. ప్రభుత్వాన్ని నిలదీస్తే కేసులు పెట్టారు. దేవాలయంగా భావించే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. గన్నవరం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసి వాహనాలను తగులబెట్టారు. యువగళం 90 బహిరంగ సభల్లో ప్రజలకు రెడ్‌బుక్ చూపించి.. టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాను. తప్పుచేసిన వారందరిని చట్టపరంగా శిక్షిస్తాం’ అని లోకేశ్ తెలిపారు.